Retirement Planning Tips: అంబానీ నుంచి అదానీ వరకు, సంపన్నుడి నుంచి సామాన్యుడి వరకు.. ప్రతి ఒక్కరు జీవితంలో ఏదోక సమయంలో పని నుంచి విశ్రాంతి తీసుకోవాల్సిందే. అంబానీ, అదానీ లాంటి సంపన్నులు రిటైర్మెంట్ తర్వాతి లైఫ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, వాళ్ల దగ్గర అవసరానికి మించిన ఐశ్వర్యం ఉంది. సామాన్య ప్రజలు మాత్రం రిటైర్మెంట్ గురించి ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే ఆర్థికంగా దెబ్బ తినాల్సి వస్తుంది. ప్రతి వ్యక్తి పక్కాగా రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తే, వృద్ధాప్యం ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సంతోషంగా గడిచిపోతుంది. అంటే, పదవీ విరమణ తర్వాత తప్పనిసరిగా ఆర్థిక భద్రత ఉండాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మార్కెట్‌లో చాలా రకాల ఆప్షన్లు ఉన్నాయి. మీరు ఎంత త్వరగా దీనిని ప్రారంభిస్తే, రిటైర్ అయ్యే నాటికి అంత పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్
పదవీ విరమణ ప్రణాళిక కోసం, ఏ వ్యక్తి అయినా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో (Mutual Funds) పెట్టుబడి పెట్టవచ్చు. భారత స్టాక్ మార్కెట్ గత కొన్ని దశాబ్దాలుగా బలమైన వృద్ధిని సాధించింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా ఇన్వెస్ట్ చేసిన వ్యక్తులు భారీ కార్పస్‌ను సృష్టించవడంలో విజయం సాధించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో గణనీయమైన పెరుగుదల కారణంగా స్టాక్ మార్కెట్ రాబోయే రోజుల్లో కూడా బుల్లిష్‌గా ఉండొచ్చు. ఈ నేపథ్యంలో, SIP ద్వారా దీర్ఘకాలం పాటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.
EPF
వ్యవస్థీకృత రంగంలో పని చేసే ఉద్యోగులు 'ఉద్యోగుల భవిష్య నిధి' (EPF)లో పెట్టుబడి పెడతారు. ఉద్యోగులు తమ మూల వేతనంలో 12 శాతం ఈపీఎఫ్‌కు జమ చేయాలి & మరో 12 శాతం యాజమాన్యం ద్వారా అకౌంట్‌లో జమ అవుతుంది. ఈ 12 శాతం నుంచి.. 3.67 శాతం EPFలోకి & మిగిలిన 8.33 శాతం 'ఉద్యోగుల పింఛను పథకం' (EPS)లోకి వెళుతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈపీఎఫ్‌పై 8.25 శాతం రాబడిని ఇచ్చింది. ఇలాంటి కాంట్రిబ్యూషన్స్ నడుమ ఏ ఉద్యోగి అయినా ఎక్కువ కాలం పని చేస్తే, పదవీ విరమణ రోజున EPFలో పెద్ద మొత్తాన్ని చూడవచ్చు.
NPS
పెన్షన్ రెగ్యులేటర్ PFRDA నిర్వహించే 'నేషనల్ పెన్షన్ స్కీమ్' (NPS)లో పెట్టుబడి ద్వారా ఏ వ్యక్తి అయినా తనకు తానుగా లార్జ్ కార్పస్ సృష్టించుకోవచ్చు. ఎన్‌పీఎస్ నుంచి.. ఈక్విటీ & డెట్ రెండింటిలోకీ పెట్టుబడులు వెళతాయి. యవ్వన దశలో ఉన ఏ ఉద్యోగి అయినా 75:25 నిష్పత్తిలో ఈక్విటీ & డెట్‌కు ఎక్స్పోజర్ ఉన్న NPS అగ్రెసివ్ లైఫ్ సైకిల్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ ఫండ్ స్టాక్ మార్కెట్‌లో బూమ్ సమయంలో అద్భుతాలు చేసే ఛాన్స్ ఉంది. NPS ఆటో రీబ్యాలెన్సింగ్ ఫీచర్ ద్వారా, ఈక్విటీ & డెట్‌లో పెట్టుబడి నిష్పత్తి చందాదార్ల వయస్సును బట్టి మారుతూ ఉంటుంది. పెట్టుబడిదారులు ప్రతి సంవత్సవం పెట్టుబడి మొత్తాన్ని పెంచుకుంటూ వెళితే పెన్షన్ ఆదాయం పెరుగుతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు.
రియల్ ఎస్టేట్
ప్రతి వ్యక్తికి సొంత ఇంటి కలలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే ముందు, హౌసింగ్ లేదా కమర్షియల్ లేదా రెండు విభాగాల్లో డబ్బును పంప్ చేయడానికి ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. వాణిజ్య ఆస్తి నుంచి వచ్చే అద్దె ఆదాయం ప్రతి నెలా చేతికి వస్తుంది. నివాస ఆస్తి ఏ వ్యక్తికైనా భద్రతను అందిస్తుంది. పదవీ విరమణ కార్పస్‌లో 60 శాతం మొత్తాన్ని రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టొచ్చు.
స్పష్టీకరణ: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒక మంచి ఆర్థిక సలహాదారును సంప్రదించండి, అతని సూచనల ప్రకారం నడుచుకోండి.
మరో ఆసక్తికర కథనం: నూతన సంవత్సరంలో షాక్ కొడుతున్న నగలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ