New Year 2025 - New Rules: కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి మన దేశంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అవన్నీ నేరుగా మీ జేబులోని డబ్బుపై ప్రభావం చూపేవే. కాబట్టి, మార్పులను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. కొత్త రూల్స్‌లో... కారు ధరలు, LPG సిలిండర్ ధరలు, పెన్షన్ సంబంధిత నియమాలు, అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, యూపీఐ 123పే రూల్స్, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటివి ఉన్నాయి.
1. కార్ల ధరల పెరుగుదల
కొత్త సంవత్సరంలో కొత్త మోడల్ కారు కొనాలని మీరు ప్లాన్ చేస్తుంటే, మీరు మరికొంచం ఎక్కువ డబ్బును దగ్గర పెట్టుకోవాలి. 2025 మొదటి రోజు జనవరి 01 నుంచి... మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, హోండా, మెర్సిడెస్ బెంజ్, ఆడి, BMW వంటి పాపులర్ కార్ కంపెనీలు వాహనాల ధరలను 3% వరకు పెంచేందుకు నిర్ణయించాయి. కాబట్టి, నూతన సంవత్సరంలో మీరు కారు కొనాలంటే ఇంకొంచం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది.
2. వంట గ్యాస్ సిలిండర్ రేటు
ప్రతి నెలా మొదటి తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి. ఇంట్లో వంటకు ఉపయోగించే డొమెస్టిక్ LPG సిలిండర్ &వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ LPG సిలిండర్ ధరలను పెంచుతాయి/తగ్గిస్తాయి. దేశీయ వంట గ్యాస్ సిలిండర్ (14.2 కిలోలు) రేటు గత కొన్ని నెలలుగా మారలేదు. ఇప్పుడు, ఏపీ & తెలంగాణలో 4.2 కిలోలు సిలిండర్ 844.50 రూపాయల ధర పలుకుతోంది. కానీ, వాణిజ్య సిలిండర్ రేటు గత కొన్ని నెలలుగా పెరుగుతూనే ఉంది. జనవరి 01వ తేదీన కూడా OMCలు సమీక్ష నిర్వహించి గ్యాస్ ధరలను సవరిస్తాయి.
3. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్
అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కొత్త రూల్స్ జనవరి ఫస్ట్ నుంచి అమలులోకి వస్తాయి. న్యూ రూల్స్ ప్రకారం... ఒక ప్రైమ్ ఖాతా నుంచి ప్రైమ్ వీడియోను రెండు టీవీల్లో మాత్రమే చూడగలరు. మూడో టీవీలో చూడాలనుకుంటే అడిషనల్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. ప్రైమ్ సభ్యులు ఒకే అకౌంట్‌తో ఐదు డివైజ్‌ల్లో వీడియోలు చూసే సదుపాయం 31 డిసెంబర్ 2024తో ముగుస్తుంది.
4. పింఛను డబ్బు ఉపసంహరణ
2025లో, పెన్షనర్లకు అతి పెద్ద ఊరట ఉంటుంది. 01 జనవరి 2025 నుంచి, పెన్షనర్లు దేశంలోని ఏ బ్యాంకులో అయినా తమ పింఛను తీసుకోవచ్చు. దీని కోసం ఎలాంటి అదనపు ధృవీకరణ అవసరం లేదు. అంటే, కొత్త ఏడాదిలో పెన్షనర్లు దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నా వాళ్ల పెన్షన్ పొందవచ్చు.
5. ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)
ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీల విషయంలో FDలకు సంబంధించిన రూల్స్‌ను కేంద్ర బ్యాంక్ (RBI) సవరించింది. ఈ సవరణలు జనవరి మొదటి తేదీ నుంచి అమలులోకి వస్తాయి. బ్యాంక్ డిపాజిట్ల భద్రతను పెంచి ఖాతాదార్లకు భరోసా ఇచ్చేందుకు రూల్స్ మార్చారు.
6. UPI 123pay లావాదేవీ పరిమితి
ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం కేంద్ర బ్యాంక్ తీసుకొచ్చిన UPI 123Pay సర్వీస్‌లో ట్రాన్జాక్షన్ లిమిట్ జనవరి 01, 2025 నుంచి పెరుగుతుంది. డిసెంబర్ 31 వరకు, ఈ సర్వీస్ కింద గరిష్టంగా 5 వేల రూపాయల వరకు ట్రాన్జాక్షన్స్ చేయవచ్చు. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి లావాదేవీ పరిమితిని రూ.10,000కు కేంద్ర బ్యాంక్ పెంచింది.
మరో ఆసక్తికర కథనం: పన్ను చెల్లింపుదార్లకు గుడ్ న్యూస్ - ITR ఫైలింగ్ గడువు పెంచిన టాక్స్ డిపార్ట్‌మెంట్