Budget House 2023: గత ఆర్థిక సంవత్సరంలో (2022-23), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును పెంచడం వల్ల హౌసింగ్ లోన్స్ మీద నేరుగా ప్రభావం పడింది. గృహ రుణం ఈఎంఐ (Home Loan EMI) అమౌంట్ పెరుగుతూ వచ్చింది. 2023 సంవత్సరం మొదటి ఆరు నెలల్లో, దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేసే వ్యక్తుల సామర్థ్యంపైనా ప్రత్యక్ష ప్రభావం చూపింది.
రియల్ ఎస్టేట్ బిజినెస్‌కు సంబంధించి, దేశంలోని టాప్-8 సిటీస్‌గా (Top 8 Cities In India) ముంబై, పుణె, దిల్లీ NCR, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతాను పరిగణిస్తారు. ఈ నగరాల్లో ఇండివిడ్యువల్ హౌస్ కొనాలన్నా, అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకోవాలన్నా భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
టాప్-8 సిటీస్‌లో ఎక్కడ ఇంటిని చౌకగా కొనొచ్చు?
నైట్ ఫ్రాంక్ ఇండియా అఫర్డబిలిటీ ఇండెక్స్ ప్రకారం, దేశంలోని టాప్-8 సిటీస్‌లో, అహ్మదాబాద్‌లో ఇంటిని చవగ్గా కొనొచ్చు. అహ్మదాబాద్‌లో హౌస్ కొనాలంటే ప్రజలు తమ నెలవారీ ఆదాయంలో 23% ఖర్చు చేయాల్సి (EMI to Income Ratio) వస్తుంది. మిగిలిన నగరాలతో పోలిస్తే, ఇక్కడ ఇల్లు కొనగలిగే స్థోమత ఎక్కువగా ఉంది. కోల్‌కతా, పుణెలో సొంతింటి కల ఇంకొంచం కాస్టీ. ఈ రెండు నగరాల్లో మంత్లీ ఇన్‌కమ్ నుంచి 26% ఇంటి కోసం వదులుకోవాలి. అంటే, కొనగలిగే స్థోమత తగ్గుతుంది. దక్షిణాది నగరాలు చెన్నై, బెంగళూరులో ఇల్లు తీసుకుంటే, నెల సంపాదనలో 28% డబ్బును EMI రూపంలోనే కట్టాల్సి వస్తుంది. దిల్లీ NCRలో ఇది 30%గా ఉంది. అంటే, ఈ ప్రాంతంలో సొంత ఇల్లు తీసుకోవాలంటే సంపాదనలో మూడో వంతు హారతి కర్పూరం అవుతుంది.
భరించలేని నగరాల్లో టాప్-2లో భాగ్యనగరం
సొంత ఇల్లు కొనాలంటే సామాన్యుడు భరించలేనంత ఖర్చు చేయాల్సిన నగరాల్లో తెలంగాణ రాజధాని హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. భాగ్యనగరంలో సొంతిల్లు కావాలంటే నెలవారీ ఆదాయంలో 31% డబ్బు మనది కాదు అనుకోవాలి.
అత్యంత ఖరీదైన నగరం ముంబై
టాప్-8 సిటీస్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్న ముంబైకి, మిగిలిన 7 నగరాలకు ఖర్చులో చాలా వ్యత్యాసం ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఇల్లు తీసుకోవాలంటే, నెలవారీ సంపాదనలో సగానికి పైగా (55%) డబ్బును EMI రూపంలో ఖర్చు చేయాలి. అంటే, ఒక వ్యక్తి తన కుటుంబం కోసం చేసే మిగిలిన అన్ని ఖర్చులను కలిపినా, సొంత ఇంటికి కట్టే ఈఎంఐ అమౌంట్‌కు అవి ఈక్వల్ కావు.
నైట్ ఫ్రాంక్ అఫర్డబిలిటీ ఇండెక్స్ ప్రకారం, 2010 - 2021 సంవత్సరాల మధ్య, దేశంలోని టాప్ 8 నగరాల్లో స్థోమత సూచీ ఏటికేడు మెరుగుపడింది. అంటే, సొంతింటిని కొనుగోలు చేయగలిగిన ప్రజల స్థోమత పెరిగింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్‌లో సీన్ రివర్స్ అయింది. కరోనా మహమ్మారి తర్వాత, RBI రెపో రేటును పెంచుతూ వెళ్లింది. ఫలితంగా బ్యాంక్ లోన్ రేట్లు పెరిగాయి, EMI భారం తడిచి మోపెడైంది. 2021, 2022, 2023 తొలి ఆరు నెలల్లో సొంతింటిని కొనుగోలు చేయగలిగిన ప్రజల స్థోమత తగ్గుతూ వచ్చింది. అయినా, కరోనా నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు సొంతింటి కొనుగోళ్ల కోసం వేట మొదలు పెట్టారు. అందుకే... వడ్డీ రేట్లు, EMI అమౌంట్ పెరిగినా హౌస్ లోన్లు తీసుకునే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతూనే వచ్చింది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇవాళ్టి రేట్లివి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial