Income Tax Saving Fixed Deposit: ఆదాయ పన్నును ఆదాకు వీలు కల్పించే ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఒక మంచి పెట్టుబడి ఎంపికగా చూడవచ్చు. ఈ పథకాల్లో ఇన్వెస్టర్లకు పన్ను ఆదా మాత్రమే కాకుండా, మంచి వడ్డీ ఆదాయం, పెట్టుబడులకు సంపూర్ణ రక్షణను పొందవచ్చు.


2022-23 ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. పన్ను ఆదా చేసే మార్గాల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటే, "టాక్స్‌ సేవింగ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌" మార్గాన్ని కూడా పరిశీలించవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టే మొత్తాలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.


అధిక రిస్క్ ఉన్న ఈక్విటీలు సహా ఇతర రిస్కీ ఆప్షన్‌ల కంటే 'పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు' సురక్షితమైనవి. రిస్క్ లేని పన్ను ఆదా మార్గం కోసం చూస్తున్నట్లయితే, ఈ ఆప్షన్‌ మీకు సరిగ్గా సరిపోతుంది. ఈ పథకాలపై, వివిధ బ్యాంక్‌లు 8.1 శాతం వరకు వడ్డీ ఆదాయాన్ని అందిస్తున్నాయి.


'పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల'పై ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తోంది?
                                                                                     
DCB బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మీద 8.1% వడ్డీ
యాక్సిస్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మీద 7.75% వడ్డీ
ఇండస్‌ఇండ్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మీద 7.75% వడ్డీ
యెస్ బ్యాంక్ లిమిటెడ్ ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మీద 7.75% వడ్డీ
HDFC బ్యాంక్ పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మీద 7.5% వడ్డీ 
ICICI బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మీద 7.5% వడ్డీ
IDFC ఫస్ట్ బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మీద 7.5 శాతం వడ్డీ
బ్యాంక్ ఆఫ్ బరోడా పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మీద 7.15% వడ్డీ
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మీద 7.5% వడ్డీ
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మీద 7% వడ్డీ


ఎంత పన్ను ఆదా చేయవచ్చు?
పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో పెట్టుబడి మీరు పెట్టే ఆలోచనలో మీరు ఉంటే, ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే ఈ సెక్షన్‌ ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఇది వర్తించదు.


ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు 5 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్‌ ఉంటుంది. ఈ గడవుకు ముందే వెనక్కు తీసుకోవడానికి వీలుండదు. ఈ తరహా డిపాజిట్ల ఆధారంగా బ్యాంక్‌ లోన్ తీసుకోవడానికి కూడా వీలుండదు. ఆదాయపు పన్ను సెక్షన్ 80TTB కింద, ఈ తరహా డిపాజిట్ల వడ్డీపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 వరకు రాయితీని సీనియర్ సిటిజన్లు పొందవచ్చు.


ఆదాయ పన్ను ఆదా చేయడానికి మార్చి 31, 2023 చివరి అవకాశం కాబట్టి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) మీరు పన్ను ఆదా చేయాలనుకుంటే, ఈ డిపాజిట్‌ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.