Best Saving Plans in India 2022:  30 ఏళ్ల వయసుకు అటుఇటుగా ఉండేవారు ఆర్థికపరమైన పొరపాట్లు ఎక్కువగా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలు ఎలా ఉండాలి.. ఆర్థికపరంగా జీవితం ప్రశాంతంగా ఉండాలన్నా, రిటైర్‌మెంట్‌ తర్వాత కూడా సాఫీగా సాగాలన్నా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 25 నుంచి 30 ఏళ్ల వయసు జీవితంలో చాలా కీలకం. ఆర్థిక పరంగా, కెరీర్ పరంగా ఈ సమయం చాలా ముఖ్యం.


సిప్ ఇంకా మొదలుపెట్టలేదా?
తక్కువ సమయంలోనే మీ పెట్టుబడి డబుల్, ట్రిపుల్ అయ్యేందుకు సిప్ గా పిలిచే సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ చాలా మంచి మార్గం. జీవితంలో సంపాదించడం ప్రారంభించిన తొలిరోజుల్లోనే అంటే 25 ఏళ్ల వయసులోనే దీనిని ప్రారంభించడం ఎక్కువ ప్రయోజనకరం. తొందరగా ప్రారంభించి, సమర్థంగా నిర్వహించినపుడు సాటిలేని ఫలితాలు సాధించవచ్చు. ఉదాహరణకు స్టాక్ మార్కెట్లలో మీ పెట్టుబడులు పెట్టినట్లైతే... ఇష్టం వచ్చినపుడు వాటిని అమ్మేయడమో, తొలగించడమో జరుగుతుంది. దీనివల్ల వృద్ధి చెందడానికి తగిన సమయం లభించకపోవచ్చు. సిప్‌లలో అలా కాకుండా అధిక సమయానికి పెట్టుబడి పెడుతున్నందువల్ల వృద్ధికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీరు మరింత క్రమశిక్షణతో వ్యవహరించేలా కూడా సిప్‌ ఉపయోగపడుతుంది. సిప్‌లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్మాల్ క్యాప్‌, లార్జ్‌ క్యాప్, మిడ్ క్యాప్, డెట్ పండ్స్‌, మనీ మార్కెట్ ఫండ్స్‌ ఇలా చాలా రకాలున్నాయి. వయసు, రిస్కును అంచనా వేసుకొని సిప్‌ పోర్ట్‌ఫోలియోను ఎంచుకోవాలి. 


పీపీఎఫ్ ఖాతాతో మరింత మేలు
అతి తక్కువ రిస్కుతోనే కచ్చితమైన వడ్డీ ఇస్తూ, పన్ను ప్రయోజనాలను కూడా అందించేదే పబ్లిక్‌ ప్రావిడెంట్ ఫండ్. 7 – 8 శాతం మధ్యలో ఉండే పీపీఎఫ్ ఖాతా వడ్డీని ఏటా సవరిస్తారు. ఈ పద్ధతిలో మీ పెట్టుబడి, వడ్డీ, చివర్లో పొందే మొత్తం డబ్బుల మీద ఎలాంటి పన్నూ విధించరు. పీపీఎఫ్ లో అందించే గొప్ప ప్రయోజనం ఇదే. సేవింగ్స్‌పై పన్నుల భారాన్ని తగ్గించుకుందామనుకొనే వారికి ఇది చాలా మంచి ఆప్షన్. అయితే... ఏడాదికి లక్షన్నరకు మించిన పెట్టుబడిపై పన్ను ప్రయోజనాలు వర్తించవు. 15ఏళ్ల మెచ్యూరిటీ దాటిన తర్వాత కూడా 5ఏళ్ల చొప్పున పెట్టుబడిని పొడిగించుకోవచ్చు. భారతీయులెవరైనా సరే దగ్గర్లోని బ్యాంకు, లేదా పోస్టాఫీసుకి వెళ్లి పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు. 


టర్మ్ ఇన్సూరెన్స్‌ లేదా?
ఒక వ్యక్తికి మరణం సంభవించిన పరిస్థితుల్లో అతడి కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించేదే టెర్మ్ ఇన్సూరెన్స్‌. సేవింగ్స్‌తో నిమిత్తం లేకుండా మరణాంతరం నామినీకి డబ్బు అందేలా ఏర్పాటు చేయాలనుకుంటే ఇది మంచి ఆప్షన్. చిన్న వయసులోనే టెర్మ్ ఇన్సూరెన్స్ ను తీసుకుంటే తక్కువ ప్రీమియంతోనే పెద్ద మొత్తానికి కవరేజీ పొందవచ్చు. ఎంత ఆలస్యంగా ప్రారంభిస్తే మీ వయసు, ఆరోగ్యాన్ని బట్టి అంత ఎక్కువ ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. 


హెల్త్ ఇన్సూరెన్స్ లేదా?
టెర్మ్ ఇన్సూరెన్స్‌లా మరణాంతరం కాకుండా.... అనారోగ్యానికి గురైనప్పుడు ఆర్థికంగా అండగా నిలబడేదే హెల్త్ ఇన్సూరెన్స్. తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు సేవింగ్స్‌ మొత్తం ఆస్పత్రి ఖర్చులకు కరిగిపోయే ప్రమాదం నుంచి ఇది కాపాడుతుంది. 30లలోనే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కలిగి ఉండటం మంచి ఆర్థిక నిర్ణయంగా చెప్పవచ్చు. టెర్మ్‌ ఇన్సూరెన్స్‌లానే వయసు పెరిగిన కొద్దీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగిపోతుంది. మీరు పనిచేసే సంస్థ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అందిస్తున్నప్పటికీ, అది సరిపోదనుకుంటే అదనపు ఇన్సూరెన్స్‌ తీసుకోవచ్చు. 


అవగాహనా లోపం వద్దు
చాలా మంది యువత తగిన అవగాహన లేకుండానే కొన్ని మార్గాల్లో పెట్టుబడులు పెడతారు. తమ ఏజెంట్‌ను సరైన ప్రశ్నలు అడగకపోవడం వల్ల.... తక్కువ ఖరీదైన ఉత్పత్తికి ఎక్కువ డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు డైరెక్ట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ తీసుకుంటే... ఏడాదికి 2శాతం వరకూ ఏజెంట్‌ కమిషన్ ఆదా చేసుకోవచ్చు. 


సేవింగ్స్‌కే మీరు పరిమితమా?
చాలామంది యువత పెట్టుబడులు, సేవింగ్స్ ఒకటే అనుకుంటారు. ఆ రెండూ ఒకటి కాదు. బ్యాంకు ఖాతాలో డబ్బులు వదిలేస్తే కేవలం 4శాతం మాత్రమే వడ్డీ వస్తుంది. కనీసం, పెరిగే ద్రవ్యోల్బణాన్ని తట్టుకొనేందుకూ అది ఏమాత్రం సరిపోదు. అంటే... సేవింగ్స్‌లో ఉండే డబ్బుల విలువ క్రమంగా తగ్గుతూ పోతుంది. మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం వల్ల ద్రవ్యోల్బణాన్ని తట్టుకోగలగటమే కాక... మీ డబ్బు విలువ పెరుగుతుంది.