Top 5 Investment Options: జీతం తీసుకునే వ్యక్తులు ప్రతినెలా స్థిరమైన ఆదాయం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు. ఆదాయానికి అనుగుణంగా ఇంటి ఖర్చులను, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులను ప్లాన్‌ చేస్తుంటారు. ఒక్కోసారి, సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోలేకపోతే డబ్బు నష్టపోవాల్సి వస్తుంది.


రిస్క్‌ను భరించగల సామర్థ్యం, పెట్టుబడి కాల వ్యవధి ఆధారంగా శాలరీడ్‌ పర్సన్స్‌ ఈ ఐదు ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవచ్చు.


1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
అత్యంత సురక్షితమైన స్థిర ఆదాయ పెట్టుబడి ఎంపికల్లో PPF ఒకటి. ఇది గవర్నమెంట్‌ స్కీమ్‌ కాబట్టి పెట్టుబడి నష్టభయం ఉండదు. PPFలో పెట్టే పెట్టుబడులకు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ అకౌంట్‌లో జమ చేసిన డబ్బు, పొందిన వడ్డీ, మెచ్యూరిటీ మొత్తానికి కూడా టాక్స్‌ వర్తించదు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర పొదుపు పథకాలతో పోలిస్తే ఇది బెటర్‌ అనిపిస్తుంది. అయితే, లాక్‌-ఇన్‌ పిరియడ్‌ 15 సంవత్సరాలు కావడం PPFలోని పెద్ద మైనస్‌ పాయింట్‌. మెచ్యూరిటీ కంటే ముందుగానే డబ్బు తీసుకోవాలంటే కొన్ని షరతులకు లోబడాలి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి త్రైమాసికంలో వడ్డీ రేటును సవరిస్తుంది. ప్రస్తుతం, PPFపై వడ్డీ రేటు సంవత్సరానికి 7.1%.


2. ఫిక్స్‌డ్ డిపాజిట్లు
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Bank fixed deposits) సురక్షితమైన పెట్టుబడి మార్గమే కాదు, వడ్డీ రాబడిని కూడా తెచ్చిస్తాయి. డిపాజిట్ వ్యవధిలో వడ్డీ రేట్లలో ఎలాంటి హెచ్చుతగ్గులు ఉన్నా, ముందుగా నిర్ణయించిన రేట్‌ ప్రకారం వడ్డీ ఆదాయం వస్తుంది. DICGC అందించే డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ పరిధిలోకి షెడ్యూల్డ్ బ్యాంక్‌ల్లోని డిపాజిట్లు కూడా వస్తాయి. ఈ బీమా కవర్‌ కింద ఒక్కో డిపాజిటర్‌కు గరిష్టంగా రూ. 5 లక్షల వరకు తిరిగి వస్తాయి. సెక్షన్ 80C కింద పన్ను ఆదా చేయాలనుకునే వారికి, 5 సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్‌తో ఉండే 'టాక్స్‌ సేవర్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌' ఒక మంచి ఎంపిక. డిపాజిట్ మొత్తానికి పన్ను మినహాయింపు లభిస్తుంది, వడ్డీ ఆదాయం మాత్రం స్లాబ్ సిస్టమ్‌ ప్రకారం పన్ను పరిధిలోకి వస్తుంది.


3. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్
ఈక్విటీల ద్వారా దీర్ఘకాలిక సంపద సృష్టించాలని కోరుకునే రిటైల్ ఇన్వెస్టర్లకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ (Equity Mutual Funds) బెస్ట్‌ ఆప్షన్‌ అవుతాయి. స్టాక్‌ మార్కెట్‌లో పార్టిసిపేట్‌ చేయాలని ఉన్నప్పటికీ, ఈక్విటీల్లో నేరుగా పెట్టుబడి పెట్టే నైపుణ్యం లేదా సమయం లేని వ్యక్తులకు ఈ ఫండ్స్‌ చాలా అనువుగా ఉంటాయి. పెట్టుబడిదార్లు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిని కేవలం రూ. 5,000తో కూడా ప్రారంభించొచ్చు. ఒకేసారి డిపాజిట్‌ చేయొచ్చు లేదా SIP మార్గంలో ప్రతినెలా కనీసం రూ.1,000 డిపాజిట్‌ చేయొచ్చు. ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ELSS) విషయంలో SIP మొత్తం నెలకు రూ. 500. ELSS లాక్‌-ఇన్‌ పిరియడ్‌ 3 సంవత్సరాలు.


4. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్
ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌కు (EPF) కొనసాగింపుగా వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌ను (VPF) తీసుకొచ్చారు. EPF తరహాలోనే, VPFలో జమ చేసే విరాళాలను సెక్షన్ 80C కింద మినహాయింపుగా క్లెయిమ్‌ చేసుకోవచ్చు. EPF వడ్డీ రేటే VPFకూ వర్తిస్తుంది. పాక్షిక ఉపసంహరణలు, పన్నులు, నామినేషన్, ఇతర అంశాలకు సంబంధించిన అన్ని EPF నిబంధనలు యథాతథంగా VPFకు వర్తిస్తాయి. ఎక్కువ రిస్క్ తీసుకోలేని వేతనజీవులకు ఇది సూటవుతుంది.


5. నేషనల్ పెన్షన్ సిస్టమ్
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కూడా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న టాక్స్‌ సేవింగ్‌ స్కీమ్‌. ఒక వ్యక్తి రిటైర్మెంట్‌ నాటికి పెద్ద మొత్తంలో డబ్బు సృష్టించే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. ఎక్కువ రిస్క్‌ తీసుకోలేనివారికి సరిపోయే ఆప్షన్‌ ఇది. వ్యక్తిగత చందాదార్లు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును, సెక్షన్ 80CCD 1(B) కింద మరో రూ. 50,000 మినహాయింపును పొందుతారు. మొత్తంగా, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు అర్హత లభిస్తుంది.


మరో ఆసక్తికర కథనం: కేవలం 15 నిమిషాల్లో లోన్‌ - చిన్న వ్యాపారుల కోసం SBI స్పెషల్‌ ఆఫర్‌