Happy New Year 2025 Gift Ideas: ప్రస్తుత సంవత్సరం 2024 వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉంది, కొత్త సంవత్సరం 2025 రాబోతోంది. న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి, గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రజలు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇయర్లీ అకేషన్‌ను ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో జరుపుకుంటారు. ఈ రోజును ప్రత్యేకంగా గుర్తుంచుకునేలా బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటుంటారు.
నూతన సంవత్సర వేడుకలను మీతో పాటు మీ ప్రియమైన వాళ్లకు కూడా ప్రత్యేకంగా మార్చాలని మీరు భావిస్తే, వారికి కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ ఇవ్వొచ్చు. ఆ ప్రత్యేక బహుమతులు మీ వాళ్లకు దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను అందించేలా, పెద్ద సంపదను సృష్టించేలా ఉంటే, అలాంటి ఐడియాలు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాంటి కొన్ని ఆర్థిక బహుమతులు ఇవి:
గోల్డ్ బాండ్ (Gold Bond)
మీకు సన్నిహితులకు నూతన సంవత్సర బహుమతిని ఇవ్వాలనుకుంటే, గోల్డ్ బాండ్ ఒక ఉత్తమ ఎంపిక. మీరు గోల్డ్ ETFs లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్, బంగారు నాణేలు, ఆభరణాలు వంటివి కూడా మీ బహుమతిగా వాళ్ల పేరిట కొనుగోలు చేయవచ్చు. ఈ విషయంలో, డిజిటల్ గోల్డ్ కూడా బెస్ట్ ఆప్షన్. బంగారం ఎప్పటికీ నిలిచి ఉంటుంది, ఎప్పటికీ ధర పెరుగుతూనే ఉంటుంది.
ఆరోగ్య బీమా (Health Insurance)
నూతన సంవత్సరం సందర్భంగా సంపూర్ణ ఆరోగ్య బీమా పథకాన్ని కూడా మీరు బహుమతిగా ఇవ్వవచ్చు. మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల పేరిట కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేసి, దాని ప్రీమియంను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉండండి. మీ ఈ బహుమతి ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్ (Mutual Fund)
న్యూ ఇయర్ సందర్భంగా మ్యూచువల్ ఫండ్ రూపంలో ఇచ్చే బహుమతి కూడా బెస్ట్‌గా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ మార్గం SIP. మీరు బహుమతి ఇచ్చే వ్యక్తి పేరిట మీరే SIPలో ప్రతి నెలా కొంచెం డబ్బును డిపాజిట్ చేస్తూ ఉండండి. ఇది, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి ఆర్థిక అవసరాల కోసం పెద్ద మొత్తంలో సంపద సృష్టించగలదు.
షేర్లు (Shares)
షేర్లు కూడా ఎప్పటికీ నిలిచి ఉంటాయి, దీర్ఘకాలంలో వెల్త్ క్రియేటర్‌గా మారతాయి. దీని కోసం, ముందుగా, మీరు ఎవరికి బహుమతి ఇవ్వాలనుకుంటున్నారో వారి పేరు మీద డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేయండి. ఇప్పుడు, లైఫ్ టైమ్ ఫ్రీ డీమ్యాట్ అకౌంట్లను కూడా కొన్ని బ్రోకింగ్ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. డీమ్యాట్ ఖాతా తెరిచిన తర్వాత, ఏదైనా మంచి కంపెనీలో మీకు వీలైనన్ని షేర్లు కొనుగోలు చేయండి. మీరు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనుకుంటే, బ్లూ చిప్ కంపెనీల షేర్లను కొనుగోలు చేయవచ్చు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit)
ఫిక్స్‌డ్ డిపాజిట్ సంప్రదాయ పెట్టుబడి మార్గం. దీనిని సురక్షితమైన పెట్టుబడిగా ప్రజలు అంగీకరిస్తారు. కాబట్టి, మీ ప్రియమైన వాళ్లకు నేరుగా డబ్బులు ఇచ్చే బదులు వారి పేరిట ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయడం తెలివైన ఎంపిక అవుతుంది. ఇందులో, డిపాజిట్ చేసిన డబ్బుపై మంచి వడ్డీ వస్తుంది, మ్యూచువల్ ఫండ్ లేదా షేర్ల తరహాలో రిస్క్ ఉండదు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఇది దేశంలోనే అత్యంత చవకైన బీమా పాలసీ, కేవలం 45 పైసలకే రూ.10 లక్షల బీమా కవరేజ్