Zero Balance Savings Account: మారుతున్న కాలానికి అనుగుణంగా, భారతదేశంలో బ్యాంకింగ్ సౌకర్యాలలో చాలా మార్పులు వచ్చాయి. ప్రధానమంత్రి జన్ ధన్ ఖాతా (Pradhanmantri Jan Dhan Account) ద్వారా దేశంలోని ప్రతి వర్గానికి బ్యాంకింగ్ సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం అందించింది. 


సాధారణంగా, ఏ బ్యాంకులో అయినా సేవింగ్స్ ఖాతా తెరిచేటప్పుడు కనీస బ్యాలెన్స్ డిపాజిట్ చేసి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కస్టమర్ ఖాతాలో మినిమమ్ క్యాష్‌ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే, సదరు బ్యాంకు సంబంధిత ఖాతాదారు మీద జరిమానా విధిస్తుంది. ఖాతాలో ఉన్న కొద్దిపాటి నిల్వ నుంచి ఆ జరిమానా డబ్బును తీసుకుంటుంది. మీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో కనీస నగదు నిల్వ (మినిమమ్ క్యాష్‌ బ్యాలెన్స్) కొనసాగించడంలో ఉన్న ఇబ్బంది నుంచి బయటపడాలనుకుంటే, మీరు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాను తెరవవచ్చు.


జీరో బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్‌ వల్ల ఒనగూరే అతి పెద్ద ఫీచర్ ఏమిటంటే, ఈ ఖాతాలో కనీస నగదు నిల్వను కొనసాగించాల్సిన అవసరం లేదు. ఖాతాలో ఒక్క రూపాయి లేకపోయినా పర్లేదు. దీంతోపాటు, ఈ ఖాతా ద్వారా అనేక రకాల బ్యాంకింగ్ సౌకర్యాలను మీరు పొందుతారు. 


జీరో సేవింగ్స్ ఖాతాలో ఉన్న సౌకర్యాలు:
ముందే చెప్పుకున్నట్లు... జీరో సేవింగ్స్ అకౌంట్‌లోఒక్క రూపాయి కూడా ఈ ఖాతాలో లేకపోయినా పర్లేదు, బ్యాంకులు ఎలాంటి జరిమానా విధించవు. ఈ ఖాతా ద్వారా వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని పొందుతారు, దీని ద్వారా సులభంగా డబ్బు లావాదేవీలు చేయవచ్చు. ఇది కాకుండా, ఈ ఖాతాకు సంబంధించి ATM కార్డ్‌ (Debit Card), మొబైల్ బ్యాంకింగ్, పాస్‌బుక్, ఈ-పాస్‌బుక్ వంటి అనేక రకాల సౌకర్యాలను పూర్తి ఉచితంగా పొందుతారు.


జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా పరిమితులు:
అయితే... జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్‌కు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఈ ఖాతాలో గరిష్టంగా రూ. లక్ష వరకు మాత్రమే జమ చేయవచ్చు. 1 లక్ష కంటే ఎక్కువ డిపాజిట్ చేయాలంటే, ఈ ఖాతాను సాధారణ పొదుపు ఖాతాగా మార్చాలి. 
ఈ ఖాతాలో లావాదేవీ పరిమితి కూడా ఉంది. పరిమితి దాటి లావాదేవీ చేస్తే, దీనిని సాధారణ పొదుపు ఖాతాగా మారుస్తారు.
ఈ ఖాతా ద్వారా మీరు FD, RD, క్రెడిట్ కార్డ్, డీమ్యాట్ ఖాతా వంటి ఆప్షన్లు పొందలేరు.


జీరో సేవింగ్స్ ఖాతా ఎలా తెరవాలి?
మీరు ఏ బ్యాంకులోనైనా ఈ ఖాతాను తెరవవచ్చు. దీనితో పాటు, జీరో సేవింగ్స్ ఖాతాను కూడా ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా తెరవవచ్చు. వీడియో కాలింగ్ ద్వారా మీ KYCని నిర్ధరించవచ్చు. మీరు జీరో సేవింగ్స్ ఖాతాను తెరవాలనుకుంటున్న బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. ఆ తర్వాత, హోమ్‌ పేజీలో కనిపించే 'ఓపెన్‌ జీరో సేవింగ్స్‌ అకౌంట్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ బ్యాంక్‌ వాళ్లు అడిగిన వివరాలను పూరించడం ద్వారా మీ ఖాతాను ఓపెన్‌ చేసుకోవచ్చు. దీని కోసం మీకు ఆధార్, పాన్ కార్డ్ మాత్రమే అవసరం.