Rising Gold Prices: ప్రాచీన కాలం నుంచి, బంగారం రేట్లు సగటు భారతీయుడికి ఎప్పుడూ అందనంత ఎత్తులో ఉంటాయి. అయినా, పసిడి అనేది భారతీయ సంస్కతి-సాంప్రదాయాలతో పెనవేసుకుపోయింది. కాబట్టి, ఏ శుభకార్యం వచ్చినా, పుత్తిడిని అందుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తూనే ఉంటారు. గత దశాబ్ద కాలంగా స్వర్ణాభరణాల ధరలు మితిమీరి పెరిగాయి, రెక్కలు కట్టుకుని చుక్కల్లో విహరిస్తున్నాయి.


తక్కువ బరువున్న ఆభరణాల వైపు మొగ్గు
బంగారం పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెరుగుతున్న పసిడి రేట్లు భారతీయ కుటుంబాలను కలవరపెడుతున్నాయి. బడ్జెట్‌ను మించి ముందుకు వెళ్లలేని కామన్‌ మ్యాన్‌, తన ముందస్తు ప్రణాళిక కంటే తక్కువ ఆభరణాలు కొంటున్నాడు. ఉదాహరణకు.. 50 గ్రాముల నగ కొనాలనుకున్న వాళ్లు అంతకంటే తక్కువ నగతో, 10 గ్రాముల ఆభరణం కొనాలనుకున్న వాళ్లు అంతకంటే తక్కువ బరువున్న ఆభరణం కొని సరిపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం, గోల్డ్‌ మార్కెట్‌లో ఇదే పద్ధతి నడుస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాదు, తక్కువ ధరలో వచ్చే తక్కువ క్యారెట్‌ బంగారు నగలను (Lower-Carat Jewellery) కొనేవాళ్ల సంఖ్య పెరిగింది. అంటే, సాంప్రదాయికమైన 22 కేరెట్ల స్వచ్ఛమైన నగలకు (22 Carat Gold Jewellery) బదులు 18 కేరెట్లు (18 Carat Gold Jewellery) లేదా 16 కేరెట్ల నగలతో (16 Carat Gold Jewellery) సర్దుకుంటున్నారు.


2023లో 15 శాతం పెరిగిన బంగారం ధరలు ఈ ఏడాది (2024) 22 శాతం పెరిగాయి.


చాలా మంది భారతీయ కొనుగోలుదారులు ఇప్పటికీ సాంప్రదాయ ఆభరణాలను (22 క్యారెట్లు) ఇష్టపడుతున్నప్పటికీ, తమ ఆర్థిక ప్రణాళికలకు సరిపోయే తేలికపాటి డిజైన్‌లను ఎంచుకుంటున్నారని నగల వర్తకులు చెబుతున్నారు. ఈ ట్రెండ్‌కు తగ్గట్లుగా, చాలా మంది వ్యాపారులు భారీ డిజైన్ల లిస్ట్‌ను తగ్గించుకుంటూ మరింత తేలికైన ఆభరణాల సెట్‌లను షోరూముల్లో ప్రదర్శిస్తున్నారు. 


నగల తయారీలో అధునాతన సాంకేతికతల కారణంగా, తక్కువ బరువుతోనే సంప్రదాయ డిజైన్లను సృష్టించగలుగుతున్నారు. ఈ తరహా జ్యువెల్లరీకి ఇప్పుడు ఆదరణ పెరిగినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) ఇండియన్ ఆపరేషన్స్ CEO సచిన్ జైన్ (Sachin Jain) చెప్పారు.


ట్రెండింగ్‌లో 18 క్యారెట్‌ జ్యువెల్లరీ
శుభకార్యాల కోసం, 22 క్యారెట్ల బదులు 18 క్యారెట్ల ఆభరణాలను చాలా మంది ప్రజలు ఎంచుకుంటున్నారు. ఎందుకంటే, 22 క్యారెట్‌లతో పోలిస్తే 18 క్యారెట్ల ఆభరణాలను చౌకగా వస్తున్నాయి.


ప్రస్తుతం, తక్కువ ధర & ఎక్కువ మన్నిక కారణంగా 18 క్యారెట్ల ఆభరణాలకు గిరాకీ పెరుగుతున్నట్లు ట్రెండ్స్‌ను బట్టి అర్ధమవుతుంది. గణాంకాల ప్రకారం, మొత్తం నగల అమ్మకాల్లో 18 క్యారెట్ల నగల వాటా 15 శాతానికి పెరిగింది. రెండేళ్ల క్రితం  ఇది కేవలం 5 శాతం నుంచి 7 శాతం మాత్రమే ఉంది.


బంగారం స్వచ్ఛత లెక్కింపు ఇలా...
భారతదేశంలో, సాంప్రదాయికంగా 22 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ప్రాధాన్యత ఇస్తారు, వీటిలో 91.7 శాతం స్వచ్ఛమైన బంగారం & మిగిలిన భాగంలో రాగి లేదా వెండి ఉంటుంది. 18 క్యారెట్ల బంగారంలో 75 శాతం స్వచ్ఛమైన బంగారం & 25 శాతం ఇతర లోహాలు ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం ధర కంటే 18 క్యారెట్ల బంగారం ధర దాదాపు 20 శాతం తక్కువ. 16 క్యారెట్ల బంగారంలో 66.7 శాతం స్వచ్ఛమైన బంగారం & మిగిలిన భాగంలో ఇతర లోహాలు ఉంటాయి. ఇవి ఇంకా చవకగా లభిస్తాయి.


మరో ఆసక్తికర కథనం: గ్లోబల్‌గా గోల్డ్‌ రేటు డీలా - తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ