Banks struggle to make Jan Dhan accounts cost effective and viable :  ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన (PMJDY) మొదలై ఎనిమిదేళ్లు అవుతోంది. ఇప్పటికీ తక్కువ ఖర్చుతో ఈ ఖాతాలను నిర్వహించేందుకు బ్యాంకులు ఇబ్బంది పడుతున్నాయని తెలిసింది. వ్యాపార దృక్పథంతో చూస్తే వీటి నిర్వహణ బ్యాంకులకు భారంగా మారింది. ఒక్కో జన్‌ ధన్‌ ఖాతా నిర్వహణకు ఏడాదికి రూ.3,200 నుంచి రూ.3,500 వరకు ఖర్చవుతోంది. వీటి మెయింటెనెన్స్‌కు ఎక్కువగా టెక్నాలజీనే ఉపయోగిస్తున్నా కొత్త ఖాతాలు తెరిచేందుకు సమయం, మానవ వనరులు అవసరమవుతోంది.


ప్రస్తుతం జన్‌ధన్‌ ఖాతాల సగటు డిపాజిట్‌ మొత్తం రూ.3000గా ఉంటోంది. క్రమంగా రూ.5000 లేదా రూ.6000కు పెరుగుతుందని అంచనా. అయితే ఇందుకెంతో సమయం పట్టనుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 454.7 మిలియన్ల జన్‌ధన్‌ ఖాతాలు నిర్వహణలో ఉన్నాయి. ఇందులో రూ.167,000 కోట్లుకు మించి నగదు నిల్వ ఉంది. ఎక్కువగా ప్రభుత్వ రంగంలోని బ్యాంకుల్లోనే ఉన్నాయి. కొవిడ్‌ సమయంలో ప్రత్యక్ష నగదు బదిలీ, ఆరోగ్య బీమా డబ్బులు వేసేందుకు ఇవెంతగానో ఉపయోగపడ్డాయి. రాను రాను సగటు నిల్వ రూ.3,723కు పడిపోతుండటం కలవరపెడుతోంది. 430 మిలియన్లలో ఇప్పుడు 368.6 మిలియన్ల ఖాతాలే యాక్టివ్‌గా ఉన్నాయి.


జన్‌ ధన్‌ ఖాతాల్లోని నగదుపై ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపుగా 4 శాతం వరకు వడ్డీ ఇస్తున్నాయి. మిగతా వాటిల్లో ఇది  2.75 నుంచి 3.50 శాతమే కావడం గమనార్హం. ఒక్కో జన్ ధన్‌ ఖాతా కేవైసీకి 40 నుంచి 50 శాతం వరకు ఖర్చవుతోందని తెలిసింది. చాలా మంది కస్టమర్లు ఈ ఖాతాల్లో లావాదేవీలే చేపట్టడం లేదు. పేదలకు జీతభత్యాలు నేరుగా నగదు రూపంలోనే ఇవ్వడం, వారు ఖాతాల్లో జమ చేసుకోవడం తక్కువగా ఉండటం వల్ల బ్యాంకులకు ఇబ్బంది అవుతోంది. నకిలీ ఖాతాలు ఎక్కువ అవ్వడంతో వాటి కేవైసీ చేపట్టేందుకు భారీగా ఖర్చవుతోంది. మరి ఈ సమస్యల నుంచి బ్యాంకులు ఎలా గట్టెక్కుతాయో చూడాలి!!