Income Tax Relief On Interest Income From Savings Account: భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్  (Finance Minister Nirmala Sitharaman), ఈ నెల చివరి కల్లా సమర్పించనున్న బడ్జెట్‌లో పన్ను చెల్లింపుదార్లకు కొన్ని ఊరటలు కల్పించే అవకాశం ఉంది. నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ను బట్టి చూస్తే, రిలీఫ్‌ల లిస్ట్‌లో బ్యాంక్‌ పొదుపు ఖాతాలు (Bank Savings Account) కూడా ఉండొచ్చు. సేవింగ్స్‌ అకౌంట్స్ పొదుపు ఖాతాలపై బ్యాంకుల నుంచి వచ్చే వడ్డీపై పన్నుకు సంబంధించి టాక్స్‌పేయర్లకు గిఫ్ట్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.


పొదుపు ఖాతా వడ్డీ ఆదాయంపై ప్రతిపాదన
ఎకనమిక్‌ టైమ్‌ రిపోర్ట్‌ ప్రకారం, ప్రజలు తమ బ్యాంక్‌ పొదుపు ఖాతాలపై ఆర్జించిన వడ్డీ ఆదాయంపై రూ. 25 వేల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని బడ్జెట్‌లో ఇవ్వొచ్చు. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు ప్రతిపాదన వచ్చిందని, సమీక్షలో ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. పొదుపు ఖాతా వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు మొత్తాన్ని పెంచాలని ఆ ప్రతిపాదనలో ఉంది.


గత వారం, దేశంలోని బ్యాంకర్లతో ఆర్థిక శాఖ అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో... పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ప్రయోజనాలను పెంచే ప్రతిపాదనను బ్యాంకులు ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులకు అందించాయి. బ్యాంకుల ప్రతిపాదనను ఇంకా సమీక్షిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి బడ్జెట్‌లో తుది ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


పన్ను చెల్లింపుదార్లు, బ్యాంకులు రెండింటికీ ప్రయోజనం
ఈ సడలింపును బడ్జెట్‌లో ప్రకటిస్తే, దానివల్ల పన్ను చెల్లింపుదార్లతో పాటు బ్యాంకులకు కూడా ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు, పన్ను చెల్లింపుదార్లందరికీ ఏదో ఒక బ్యాంకులో సేవింగ్స్‌ అకౌంట్‌ ఉంది. సేవింగ్స్ ఖాతాల్లో ఉంచిన డబ్బుపై వడ్డీ రూపంలో బ్యాంకులు డిపాజిటర్లకు రాబడి అందిస్తాయి. పొదుపు ఖాతాలపై వడ్డీ రేటు అత్యల్పంగా ఉంది. సేవింగ్స్‌ అకౌంట్స్ విషయంలో టాక్స్‌ బెనిఫిట్‌ పెంచితే, పన్ను చెల్లింపుదార్లు పొదుపు ఖాతాల్లో మరింత ఎక్కువ డబ్బు డిపాజిట్‌ చేయడానికి, ఎక్కువ కాలం హోల్డ్‌ చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇది డిపాజిట్ల రూపంలో బ్యాంక్‌ల దగ్గరకు ఎక్కువ డబ్బు వస్తుంది, ఇది బ్యాంకులకు లాభదాయకమైన పరిస్థితి.


ప్రస్తుతం ఎంత తగ్గింపు లభిస్తోంది?
ఆదాయ పన్ను చట్టం ప్రకారం, ప్రస్తుతం, పొదుపు ఖాతాల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లింపుదార్లు పొందుతున్న ప్రయోజనం పరిమితంగా ఉంది. సెక్షన్ 80TTA ప్రకారం, పొదుపు ఖాతాలపై వడ్డీ ఆదాయంపై రూ. 10,000 వరకు పన్ను నుంచి మినహాయిపు లభిస్తోంది. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఈ పన్ను మినహాయింపు పరిమితి రూ. 50 వేలుగా ఉంది, ఇందులో సెక్షన్ 80 TTB కింద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై (FD) వచ్చే వడ్డీ ఆదాయం కూడా కలిసి ఉంది. పాత పన్ను విధానంలో (Old Tax Regime) మాత్రమే మినహాయింపు ప్రయోజనం అందుతుంది, కొత్త పన్ను విధానంలో వర్తించదు.


కొత్త పన్ను విధానంలో అందుబాటులో ఉన్న ప్రయోజనాలు
కొత్త పన్ను విధానంలో (New Tax Regime), పొదుపు ఖాతా వడ్డీ రాబడిపై పన్ను మినహాయింపు ఉండదు. అయితే... పోస్టాఫీసులో పొదుపు ఖాతాలు ఉన్న పన్ను చెల్లింపుదార్లు కొత్త పన్ను విధానంలోనూ కొన్ని ప్రయోజనాలను పొందొచ్చు. వ్యక్తిగత ఖాతాలపై ఏడాదికి రూ. 3,500 వరకు వడ్డీ ఆదాయంపై, ఉమ్మడి ఖాతాలపై రూ. 7,000 వరకు వడ్డీ ఆదాయంపై పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: బడ్జెట్‌ ముందు తెరపైకి గ్యాస్‌ సిలిండర్లు - త్వరలో రేట్లు మారతాయా?