Bank FD Rates 2024: మన దేశంలో డబ్బును పెట్టుబడిగా పెట్టడానికి చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి. గోల్డ్ నుంచి గవర్నమెంట్ స్కీమ్స్ వరకు; స్టాక్ మార్కెట్ నుంచి స్థిరాస్తి వరకు చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. ఇప్పుడు, 6.50% వద్ద గరిష్ట స్థాయిలో ఉన్న
రెపో రేట్ కారణంగా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs) మంచి ఆదాయ వనరులుగా మారాయి.
వివిధ ప్రభుత్వ పథకాలపై వడ్డీ రేట్లు
ప్రస్తుతం, ప్రభుత్వ పథకమైన సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌పై 8.20 శాతం వడ్డీ రేటును (Sukanya Samriddhi Yojana Interest Rate) కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ మీద 7.10 శాతం (PPF Interest rate) వడ్డీ; నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ కింద 7.70 శాతం (NSC Interest rate) వడ్డీ రేటు; కిసాన్ వికాస్ పత్ర పథకం కింద 7.50 శాతం (KVP Interest rate) వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. పోస్టాఫీస్ సీనియర్ సిజిజన్ సేవింగ్ స్కీమ్ మీద 8.20 శాతం (SCSS Interest rate) వడ్డీ ఆదాయం అందుకోవచ్చు, 60 ఏళ్ల వయస్సు దాటిన వాళ్లే దీనికి అర్హులు. ఇక పోస్టాఫీస్ పొదుపు ఖాతా నుంచి 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్ వరకు 4.00 శాతం నుంచి 7.50 శాతం వరకు వడ్డీ సంపాదించొచ్చు.
పీపీఎఫ్‌ను మించిన వడ్డీ ఆదాయం
అయితే.. రెండు బ్యాంక్‌లు మాత్రం అంతకుమించి ఇంట్రస్ట్ చెల్లిస్తామని చెబుతున్నాయి. ఆ రెండు బ్యాంకులు - యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Unity Small Finance Bank), సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Suryoday Small Finance Bank).
ఫిక్స్‌డ్ డిపాజిట్ల మీద కస్టమర్లకు చెల్లించే వడ్డీ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సాధారణ పెట్టుబడిదార్లకు (60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వ్యక్తులు) ఈ బ్యాంక్ కనిష్టంగా 4.50% నుంచి గరిష్టంగా 9.00% వరకు వడ్డీ ఆఫర్ ప్రకటించింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాల పరిమితి (Maturity) గల డిపాజిట్లకు ఈ రేట్లు వర్తిస్తాయి. సీనియర్ సిటిజన్ల (60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులు) కోసం అంతకుమించి ప్రకటించిన బ్యాంక్, గరిష్టంగా 9.50% వార్షిక వడ్డీని చెల్లిస్తోంది. 1001 రోజుల కాల వ్యవధి గల ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు ఈ స్పెషల్ రేట్‌ను బ్యాంక్ నిర్ణయించింది.
అధిక వడ్డీ రేట్ల రేస్‌లో సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా పోటీలో ఉంది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాల పరిమితి గల ఎఫ్‌డీలపై సాధారణ ప్రజలకు 4.00% నుంచి 9.10% వరకు ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయాన్ని చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్లకు మరింత పెద్ద పీట వేసి, 7 రోజుల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ డిపాజిట్ల మీద 4.50% నుంచి 9.60% వరకు, మరింత ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తోంది. ఐదేళ్ల లాక్-ఇన్ డిపాజిట్ మీద సాధారణ పెట్టుబడిదార్లు 9.10% వడ్డీ పొందితే, అదే టైమ్ పిరియడ్‌లో సీనియర్ సిటిజన్లు 9.60% వడ్డీ ఆదాయం సంపాదిస్తారు.
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు షేర్ మార్కెట్ పెట్టుబడుల్లా టెన్షన్ పెట్టవు. స్టాక్ మార్కెట్‌తో లింక్ ఉండదు, స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. కాబట్టి, ఆదాయం విషయంలో ఎఫ్‌డీ ఇన్వెస్టర్లకు భయం ఉండదు.
మరో ఆసక్తికర కథనం: లోన్లపై వసూలు చేసిన వడ్డీని కస్టమర్లకు తిరిగి ఇచ్చేయండి - బ్యాంక్‌లకు పెద్దన్న ఆదేశం