Atal Pension Yojana Rules: ఆదాయ పన్ను చెల్లింపు దారులకు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది! 2022, అక్టోబర్ 1 నుంచి అటల్ పెన్షన్ యోజన (APY)లో చేరేందుకు అనుమతి నిరాకరించింది. అసంఘటిత కార్మికులు, పేదలు, ఎలాంటి సామాజిక భద్రత లేనివారికి అధిక ప్రయోజనం కల్పించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో 2016, జూన్ 1న కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ఆరంభించింది. ఈ పథకంలో చేరిన చందాదారులకు 60 ఏళ్లు దాటాక కనీస పింఛను అందిస్తుంది. వారు జమ చేసిన మొత్తాన్ని బట్టి నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు చెల్లిస్తుంది.
'2022, అక్టోబర్ 1 నుంచి ఆదాయపన్ను చెల్లిస్తున్న వారు అటల్ పెన్షన్ యోజనలో చేరేందుకు అర్హులు కారు' అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. అంతకు ముందు విడుదల చేసి నోటిఫికేషన్‌ను సవరించింది. '2022, అక్టోబర్ 1 నుంచి ఆదాయపన్ను చెల్లింపుదారులు ఏపీఐ స్కీమ్‌లో చేరేందుకు అర్హులు కారు. పేదలు, అసంఘటిత కార్మికులకు పింఛను ప్రయోజనాలు దక్కేందుకే దీనిని సవరిస్తున్నాం. అక్టోబర్ 1 కన్నా ముందు చేరిన వారు పథకంలో యథావిధిగా కొనసాగుతారు' అని ఆర్థిక శాఖ వెల్లడించింది.
ఉదాహరణకు 2022, అక్టోబర్ 1 తర్వాత ఎవరు చేరినా ఆదాయపన్ను చెల్లిస్తున్నారో లేదో పరిశీలిస్తారు. ఎవరైనా టాక్స్ పేయర్ ఉన్నట్టు తెలిస్తే వారి ఏపీవై ఖాతా (APY Account) ముగిస్తారు. అప్పటి వరకు జమ చేసిన డబ్బును చందాదారుడికి ఇస్తారు. ఆదాయపన్ను చట్టం ప్రకారం ఏడాదికి రూ.2.5 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నవారు ప్రస్తుతం ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదన్న సంగతి తెలిసిందే. 18-40 ఏళ్ల మధ్య ఉన్న భారతీయులు అటల్ పెన్షన్ యోజనలో చేరేందుకు అర్హులు. బ్యాంకు లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉంటే చాలు.
అటల్ పెన్షన్ యోజనలో చేరిన వారిని ప్రోత్సహించేందుకు మొత్తం కంట్రిబ్యూషన్‌లో ప్రభుత్వం 50 శాతం లేదా ఏడాదికి రూ.1000 జమ చేస్తుంది. 2015 జూన్ నుంచి 2016 మార్చిలో చేరిన వారికే ఈ ప్రయోజనం దక్కుతుంది. అయితే చందాదారుడికి ఎలాంటి సామాజిక భద్రతా పథకంలో సభ్యత్వం ఉండకూడదు. ఆదాయపన్ను చెల్లిస్తుండొద్దు. అలాంటి వారికే ప్రభుత్వం ఐదేళ్లు డబ్బు జమ చేస్తుంది. గతేడాది 99 లక్షలకు పైగా ఏపీఐ ఖాతాలు తెరిచారు. దాంతో 2022, మార్చి నాటికి మొత్తం చందాదారుల సంఖ్య 4.01 కోట్లకు చేరుకుంది.