ATM Interchange Fee Applicable From May 2025: డబ్బు అవసరమైనప్పు దగ్గరలో కనిపించిన ఏటీఎంకు వెళ్లి విత్‌డ్రా చేసే ముందు ఓసారి ఆలోచించండి. ఈ ఏడాది మే 01వ తేదీ నుంచి, ATM నుంచి డబ్బు విత్‌డ్రా చేయడం మీ జేబుకు భారంగా మారవచ్చు. ATM ఇంటర్‌ఛేంజ్ రుసుములు పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. ఈ కారణంగా, ఇతర బ్యాంక్‌ ATMలను ఉపయోగించే కస్టమర్లు నగదు ఉపసంహరించుకోవడం లేదా నగదు నిల్వ తనిఖీ (Cash balance checking) వంటి పనులు ఇప్పుడు మరికొంచెం ఖరీదైన వ్యవహారంగా మారతాయి.


ATM ఇంటర్‌ఛేంజ్ ఫీజ్‌ అంటే?
సొంత బ్యాంక్‌ కాకుండా, వేరే బ్యాంక్ ఏటీఎంలో లావాదేవీలుల నిర్వహిస్తే విధించే రుసుమును ఇంటర్‌ఛేంజ్ ఫీజ్‌ అంటారు. ఉదాహరణకు, మీ దగ్గర SBI ATM కార్డ్‌ ఉంటే, ఆ కార్డ్‌ను ఉపయోగించి మీరు ఇతర బ్యాంక్‌ ఏటీఎంలో డబ్బు తీయడం, బ్యాలెన్స్‌ చెక్‌ చేయడం వంటివి చేస్తే కొంత రుసుము చెల్లించాలి. అయితే, కొన్ని ఉచిత లావాదేవీల తర్వాత ఈ ఫీజ్‌ వర్తిస్తుంది.


ఉచిత లావాదేవీల పరిమితి
మీరు ఒక నెలలో ఉచిత లావాదేవీల పరిమితిని దాటినప్పుడు మాత్రమే ATM ఇంటర్‌ఛేంజ్ ఛార్జీ చెల్లించాలి. మెట్రో నగరాల్లో.. హోమ్ బ్యాంక్ కాకుండా ఇతర బ్యాంకుల ATMల నుంచి ఐదు (5) ఉచిత లావాదేవీలు నిర్వహించవచ్చు. మెట్రోయేతర నగరాల్లో.. ఉచిత లావాదేవీల పరిమితి మూడు (3). పెరుగుతున్న ఏటీఎం నిర్వహణ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చేసిన ఈ ప్రతిపాదనకు రిజర్వ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి, వైట్ లేబుల్ ATM ఆపరేటర్లు ఇంటర్‌ఛేంజ్ ఫీజులు పెంచమని చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే పాత ఫీజులు సరిపోవని వాళ్లు వాదిస్తున్నారు. 


వైట్ లేబుల్ ATM అంటే?
చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థల చట్టం 2007 ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ "వైట్ లేబుల్ ATM"(White Label ATM)లను ఏర్పాటు చేసింది. దేశంలోని మారుమూల ప్రాంతాలు & చిన్న పట్టణాలలో ATMలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈ వ్యవస్థను ప్రారంభించింది. ఇందులో, ఒక బ్యాంక్‌ తరపున మరో ప్రైవేట్‌ సంస్థ ATM ఏర్పాటు చేసి, నిర్వహిస్తుంది. ఇందుకోసం సదరు బ్యాంక్‌ ఆ సంస్థకు కొంత డబ్బు చెల్లిస్తుంది. బ్యాంక్‌ కాకుండా ఇతర సంస్థలు ఏర్పాటు చేసి, నిర్వహించే ఏటీఎంను వైట్ లేబుల్ ATM అంటారు. డెబిట్/క్రెడిట్ కార్డు నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం, బిల్లుల చెల్లింపు, మినీ స్టేట్‌మెంట్, చెక్ బుక్ అభ్యర్థన, నగదు డిపాజిట్ వంటి అన్ని సౌకర్యాలు  వైట్ లేబుల్ ATMలో అందుబాటులో ఉంటాయి. 


ATM ఛార్జీలు ఎంత పెరుగుతాయి?
మే 01 నుంచి, ఇతర బ్యాంక్‌ల ఏటీఎంలో ఉచిత పరిమితి దాటిన ప్రతి లావాదేవీకి రూ. 17-19 రుసుము చెల్లించాలి. 
బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి ప్రతి లావాదేవీకి రూ. 6-7 ఛార్జ్ ఉంటుంది. 


చిన్న బ్యాంకులపై పెద్ద ప్రభావం
పరిమిత మౌలిక సదుపాయాలు, తక్కువ ATMలను కలిగి ఉండటం వలన ATM ఇంటర్‌ఛేంజ్ ఫీజుల ఒత్తిడి చిన్న బ్యాంకులపై పడుతుంది. ఇవి, సాధారణంగా, ఇతర బ్యాంకుల ATM నెట్‌వర్క్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. ఒక బ్యాంక్‌, తన కస్టమర్ మరొక బ్యాంకు ATMను ఉపయోగించినప్పుడు, ఆ బ్యాంక్‌కు కొంత ఫీజ్‌ చెల్లించాలి. కాబట్టి, ప్రధానంగా చిన్న బ్యాంక్‌లపై ప్రభావం పడుతుంది. అంతేకాదు, ఇప్పటికీ నగదు లావాదేవీలపై ఆధారపడే ప్రజలపైనా భారం పెరుగుతుంది.