How To Became Crorepati: సాధారణంగా, సంపాదించే ప్రతి వ్యక్తి తన నెలవారీ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు లేదా పెట్టుబడిగా మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. దీనివల్ల, సుదీర్ఘకాలంలో అతనితో పాటు అతని కుటుంబం ఆర్థిక భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉంటుంది. అయితే, అరకొర సంపాదన & పెరుగుతున్న ధరల నడుమ ప్రతి నెలా డబ్బు ఆదా చేయడం కష్టమైన విషయం. మన దేశంలో అందరికీ ఇది సులభ సాధ్యం కాదు. అలాగని, పొదుపు చేయడం అసాధ్యం కూడా కాదు. మీరు పక్కా ప్లానింగ్‌తో బడ్జెట్ వేసుకుని, దానిని ఖచ్చితంగా పాటించి ప్రతి నెలా 5000 రూపాయలు ఆదా చేయాలి. అలా ఆదా చేసిన డబ్బును పెట్టుబడిగా మారిస్తే చాలు. మీరు పెట్టుబడి పెట్టే డబ్బే తిరిగి డబ్బును సంపాదించడం మొదలు పెడుతుంది & కోటీశ్వరుడు కావాలనే మీ కల కూడా నెరవేరుతుంది.
SIP చేసే మ్యాజిక్ ఇదీ
మన దేశంలో అందరికీ అందుబాటులో ఉన్న మంచి పెట్టుబడి సాధనాల్లో ఒకటి "సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్" (Systematic Investment Plan). షార్ట్ కట్‌లో దీనిని "సిప్" (SIP) అంటారు. SIP ద్వారా మ్యూచవల్ ఫండ్స్ (Mutual Funds)లో మీ డబ్బును పెట్టుబడిగా పెట్టవచ్చు & అద్భుతమైన రాబడిని సంపాదించి కొన్ని సంవత్సరాల్లోనే కోటీశ్వరుడు కావచ్చు. మీరు ఏ మ్యూచువల్ ఫండ్ SIPని ఎంచుకున్నా, మీ పెట్టుబడిపై రాబడి సంవత్సరానికి సగటున 12 శాతం ఉండాలి, ఇంతకంటే తగ్గకూడదు. ఈ సందర్భంలో... మీరు 27 సంవత్సరాల పాటు ప్రతి నెలా SIPలో పెట్టుబడి పెడితే, 12 శాతం వార్షిక రాబడి రేటుతో మీకు మొత్తం 1 కోటి 8 లక్షల రూపాయలు (రూ. 1.08 కోట్లు) వస్తాయి. ఈ 27 సంవత్సరాల కాలంలో మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 16,20,000 కాగా, 12 శాతం రాబడి ద్వారా వచ్చిన ఆదాయం రూ. 91,91,565 అవుతుంది. మొత్తంగా, మీ ఖాతాలో రూ. 1,08,11,565 కార్పస్ పోగవుతుంది, కోటీశ్వరుల లిస్ట్‌లో మీ పేరు నమోదవుతుంది.
రెట్టింపు పెట్టుబడితో మీ కల వేగంగా నెరవేరుతుంది
మీరు మీ పొదుపును పెంచి పెట్టుబడిని కూడా పెంచితే మీ కలను ఇంకా వేగంగా సాకారం చేసుకోవచ్చు. మీరు ప్రతి నెలా 5,000 రూపాయలకు బదులుగా SIP 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే, 12 శాతం వార్షిక రాబడి రేటుతో మీరు కేవలం 21 సంవత్సరాలలో కోటీశ్వరుడు అవుతారు. ఈ 21 సంవత్సరాల కాలంలో మీరు పెట్టుబడి మొత్తం రూ. 25,20,000 అవుతుంది. దీనిపై 12 శాతం రాబడి ప్రకారం ద్వారా వచ్చే ఆదాయం రూ. 79,10,067 అవుతుంది. ఈ లెక్కన, మీరు 21 సంవత్సరాలలో రూ. 1,04,30,067 (1.04 కోట్లు) సంపాదిస్తారు. మీరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం ప్రారంభించి & ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే మీకు అంత ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే, చాలా మంది నిపుణులు, తక్కువ వయస్సు నుంచే పెట్టుబడిని ప్రారంభించాలని ప్రజలకు సిఫార్సు చేస్తుంటారు. తద్వారా మీరు దీర్ఘకాలికంగా కాంపౌండింగ్ పవర్ (చక్రవడ్డీ) ప్రయోజనాలను పొందుతారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. "abp దేశం" ఎవరికీ, ఎప్పుడూ పెట్టుబడి సలహాలు ఇవ్వదు. పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మంచిది.