Most Wanted IPO: దేశంలో అతి పెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ "నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌" (NSE) ప్రతిపాదిత "ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌" ‍(IPO)కు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI నుంచి త్వరలో గ్రీన్ సిగ్నల్ లభించవచ్చు. NSE IPO ఆలస్యానికి గల కారణాలను పరిశీలిస్తామని SEBI చీఫ్ తుహిన్ కాంత్ పాండే చెప్పారు. IPOను లాంచ్‌ చేయడానికి నియంత్రణ సంస్థ సెబీ వద్ద NSE 2016లోనే ముసాయిదా పత్రాలు దాఖలు చేసింది. 

తుహిన్ కాంత్ పాండే కీలక వ్యాఖ్యలుతుహిన్ కాంత్ పాండే అధ్యక్షతన సెబీ మొదటి బోర్డు సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో, తుహిన్ కాంత్ పాండేను ఎన్‌ఎస్‌ఈ ఐపీవో జాప్యం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ విషయాన్ని తాము ఖచ్చితంగా పరిశీలిస్తామని, సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని, అడ్డంకులను ఎలా తొలగించవచ్చో తెలుసుకుంటామని చెప్పారు. మార్కెట్ వాటా పరంగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ NSE దేశంలోనే అతి పెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్. ఈ ఎక్సేంజ్‌తో పాటు ఇన్వెస్టర్లు కూడా గత తొమ్మిది సంవత్సరాలుగా IPO కోసం ఎదురు చూస్తున్నారు.

IPO ఆలస్యానికి NSEదే బాధ్యత: సెబీనేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ IPO ప్రక్రియ, షేర్‌ ధరలు & షేర్‌ లిస్టింగ్‌కు సంబంధించిన విషయాలు అప్పుడప్పుడు వార్తల్లో కనిపిస్తున్నప్పటికీ, పెట్టుబడిదార్లు ఎదురు చూస్తున్న కాలం ఏటికేడు కొత్త అంకెను నమోదు చేస్తోంది. గత సంవత్సరం, ఒక కేసు విచారణ సందర్భంగా, NSE తన లిస్టింగ్‌కు సంబంధించి 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) కోసం కొత్తగా ఎటువంటి డిమాండ్ చేయలేదని SEBI దిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఐపీఓ ప్రక్రియలో జాప్యానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ స్వయంగా బాధ్యత వహించాలని సెబీ స్పష్టం చేసింది. NSE IPOను త్వరగా ఆమోదించాలని సెబీని ఆదేశించాలని కోరిుతూ గతంలో దిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.  వాస్తవానికి, NSE తన ప్రతిపాదిత IPO & మార్కెట్‌లో షేర్ల లిస్టింగ్ కోసం 9 సంవత్సరాల క్రితమే SEBI నుంచి అనుమతి పొందింది. NSE 2016లో SEBI దరఖాస్తు సమర్పించినప్పుడే, నియంత్రణ సంస్థ సూత్రప్రాయంగా ఆమోదించింది. కానీ తరువాత ఆ ముసాయిదా తిరుగుటపాలో వచ్చింది. కో-లొకేషన్ సౌకర్యాల విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, సెబీ 2019లో NSE ముసాయిదా పేపర్లను వెనక్కు పంపింది. కో-లొకేషన్ సౌకర్యాల విషయంపై దర్యాప్తు పూర్తయిన తర్వాత మళ్లీ కొత్తగా IPO ముసాయిదాను దాఖలు చేయమని సూచించింది. చివరకు, 2024 ఆగస్టులో, NSE 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) కోసం SEBIకి దరఖాస్తు చేసుకుంది.

అతి పెద్ద మార్కెట్‌ వాటాను ఎంజాయ్‌ చేస్తున్న NSE, అత్యంత లాభదాయకమైన సంస్థ కూడా. దీంతో, ఈ కంపెనీ అన్‌లిస్టెడ్‌ మార్కెట్‌ నుంచి లిస్టెడ్‌ మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందా అని ఇన్వెస్టర్లు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.