Aadhar Enabled Payment System: మన దేశం క్రమంగా డిజిటల్‌ చెల్లింపుల వైపు మారిపోతోంది. ప్లేట్‌ బజ్జీలు కొన్నా, పెద్ద బెంజ్‌ కార్‌ కొన్నా డిజిటల్‌ మోడ్‌లో పేమెంట్‌ చేయడానికే జనం ఇష్టపడుతున్నారు. దేశంలో దాదాపుగా అన్ని పనులు, కొనుగోళ్లు ఇప్పుడు ఆన్‌లైన్ పేమెంట్‌ ద్వారా జరుగుతున్నాయి. దీనివల్ల, ప్రజలు ఎక్కువ నగదును (Physical Currency) మోసుకెళ్లాల్సిన అవసరం తప్పింది. కానీ, ఇప్పటికీ కొన్ని పనులకు ఫిజికల్‌ కరెన్సీ అవసరం పడుతోంది. భౌతిక నగదు అవసరమైనప్పుడు, ఏటీఎం పక్కనే ఉన్నప్పటికీ చేతిలో డెబిట్‌ కార్డ్‌ లేనప్పుడు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సందర్భంలో ఇంటికి వెళ్లి డెబిట్‌ కార్డ్‌ తెచ్చుకుంటున్నారు లేదా బ్యాంక్‌ ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్తున్నారు.


సాధారణంగా, డబ్బులు విత్‌డ్రా చేయాలంటే బ్యాంక్‌ లేదా ఏటీఎంకు వెళ్లాల్సిందే. ఇది కాకుండా మరొక సులభమైన పద్ధతి కూడా ఉంది. మీ ఆధార్ కార్డు ద్వారా కూడా నగదు తీసుకోవచ్చు. 


ఆధార్ కార్డ్‌ను ఉపయోగించి డబ్బును ఇలా విత్ డ్రా చేయండి
మీ ఆధార్‌ కార్డ్‌ చేతిలో ఉంటే, లేదా ఆధార్‌ నంబర్‌ మీకు తెలిసివుంటే.. డబ్బు విత్‌డ్రా చేయడానికి బ్యాంకు లేదా ఏటీఎం సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ కార్డే మీకు డబ్బు ఇప్పిస్తుంది. అయితే, ఈ సర్వీస్‌ ఉపయోగించుకోవాలంటే రెండు చిన్నపాటి షరతులు ఉన్నాయి. 


1.  మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానమై (Aadhaar Card – Bank Account Link) ఉండాలి. 
2.  ఆధార్‌తో లింక్‌ అయిన బ్యాంక్‌ ఖాతాలో విత్‌డ్రా మొత్తానికి సరిపడా డబ్బు ఉండాలి. 


ఈ రెండు షరతులు పాటిస్తేనే మీరు ఈ కొత్త ఫెసిలిటీని ఉపయోగించుకోగలరు. 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (NPCI), ఆధార్ కార్డ్‌ను ఉపయోగించి మీ బ్యాంక్‌ ఖాతా డబ్బును విత్ డ్రా చేసుకునేందుకు 'ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్' (AEPS)ను ప్రారంభించింది. ఈ ఫెసిలిటీ వల్ల, మీ ఆధార్ కార్డ్‌ను ఉపయోగించి & వేలిముద్ర వేయడం ద్వారా ఏ మైక్రో ATM నుంచయినా డబ్బు తీసుకోవచ్చు. 


డబ్బు తీసుకునే విధానం
1.  ముందుగా, మైక్రో ఏటీఎంలో మీ 12 అంకెల ఆధార్ కార్డ్ నంబర్‌ను ఎంటర్‌ చేయండి
2.  ఆ తర్వాత, ధృవీకరణ కోసం వేలిముద్ర స్కానర్‌లో మీ బొటనవేలిని ఉంచండి 
3.  ఇప్పుడు, మైక్రో ఏటీఎం స్క్రీన్‌ మీద మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి 
4.  వాటిలో, నగదు బదిలీ లేదా నగదు ఉపసంహరణ ఆప్షన్లు కూడా ఉంటాయి 
5.  డబ్బు తీసుకోవాల్సి వస్తే, విత్‌డ్రా క్యాష్‌ ఆప్షన్‌ మీద క్లిక్ చేయండి 
6.  ఇప్పుడు, మీరు తీసుకోవాలనుకున్న మొత్తాన్ని నమోదు చేయాలి. ఇక్కడితో ఈ ప్రాసెస్‌ చాలా సింపుల్‌గా పూర్తవుతుంది.


మైక్రో ఏటీఎంను నిర్వహించే బ్యాంక్ ఆపరేటర్ మీరు విత్‌డ్రా చేసిన డబ్బు ఇస్తాడు. మీ బ్యాంక్‌ ఖాతా నుంచి ఆ డబ్బు డెబిట్‌ అవుతుంది. జరిగిన లావాదేవీ, డబ్బు కట్‌ అయిన విషయం గురించి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS ద్వారా సమాచారం అందుతుంది. 


ఆధార్‌ కార్డ్‌ను ఉపయోగించి ఎంత డబ్బు తీసుకోవచ్చు?
ఆధార్ కార్డును ఉపయోగించి డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి వివిధ బ్యాంకులు వేర్వేరు పరిమితులను విధించాయి. కొన్ని బ్యాంకుల్లో ఈ పరిమితి రూ.10 వేలుగా ఉంది. మరికొన్ని బ్యాంకులు రూ.50 వేల వరకు అనుమతిస్తున్నాయి. భద్రత కారణాల దృష్ట్యా కొన్ని బ్యాంకులు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌ను అంగీకరించడం లేదు.


మరో ఆసక్తికర కథనం: రతన్ టాటా జీతం ఎంత? నిమిషానికి ఎంత సంపాదించేవారు?