Big Savings With Home Loan Refinancing: చాలా మంది ప్రజల సొంత ఇంటి కలను తీర్చడంలో గృహ రుణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సొంత ఇల్లు ఉంటే ఆర్థికంగా భద్రంగా ఉన్నామని ప్రజలు భావిస్తుంటారు. అంటే, ఇంటి యాజమాన్యానికి - ఆర్థిక భద్రతకు లంకె ఉంది. ఆస్పిరేషన్ ఇండెక్స్ పేరుతో ఇటీవల నిర్వహించిన సర్వేలో, భారతీయుల చిరకాల వాంఛల్లో సొంత ఇల్లు కూడా ఒకటని తేలింది, దీనికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు.
అయితే, 2022 మే నెల నుంచి 2023 ఫిబ్రవరి మధ్య కాలంలో రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు (2.50%) పెంచిన రిజర్వ్ బ్యాంక్ (RBI), ఈ నెలలో జరిగిన MPC మీటింగ్‌లోనూ వడ్డీ రేట్లను తగ్గించలేదు. అధిక స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లు చాలా మంది రుణగ్రహీతలకు భారంగా మారాయి, అధిక EMI కట్టేలా చేస్తున్నాయి. ప్రస్తుతం వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నందున, రుణగ్రహీతలు తమ రుణ భారాన్ని తగ్గించుకునే మార్గాలను అన్వేషించడం తెలివైన పని. ఈ మార్గాల్లో రీఫైనాన్సింగ్ ఒకటి.
హోమ్ లోన్ రీఫైనాన్సింగ్ అంటే ఏమిటి?
రీఫైనాన్సింగ్ లేదా బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అనేది మీ ప్రస్తుత లోన్‌ను కొత్త బ్యాంక్/ రుణదాత వద్దకు బదిలీ చేసే ప్రక్రియ. ఇది మీ రుణాన్ని తక్కువ వడ్డీ రేటుకు, తక్కువ EMIకి, సరళమైన నిబంధనలోకి మారుస్తుంది. దీనిని ఒక వ్యూహంలా భావించాలి. రీఫైనాన్సింగ్‌ను సరిగ్గా ఉపయోగించుకుంటే, లోన్‌ను తక్కువ వడ్డీ రేటుకు మారడం లేదా మీ లోన్ కాల పరిమితిని తగ్గడం జరుగుతుంది. తద్వారా మీకు చాలా డబ్బు అదా అవుతుంది. అయితే, రీఫైనాన్సింగ్ కోసం కొత్త బ్యాంక్/ రుణదాత ప్రాసెసింగ్ ఫీజ్ వంటి అదనపు ఛార్జీలు విధిస్తుంది. కానీ ఓవరాల్‌గా చూసుకుంటే మీకు మిగిలే మొత్తమే ఎక్కువగా ఉంటుంది.
రీఫైనాన్సింగ్ మీకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?
రీఫైనాన్సింగ్ మీ డబ్బును ఎలా ఆదా చేస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మీ హోమ్ లోన్ ఇంకా రూ. 25 లక్షలు మిగిలి ఉందని అనుకుందాం. దీనిపై 9.50 శాతం వడ్డీ రేటుతో, టెన్యూర్ ఇంకా 9 సంవత్సరాలు ఉందని భావిద్దాం. ఈ మిగిలిన 9 సంవత్సరాల్లో మీరు రూ. 34,523 EMI చెల్లించాలి. వడ్డీ రూపంలోనే రూ. 12,28,527 చెల్లించాలి. ఈ లోన్‌ను 8.50 శాతానికి కొత్త బ్యాంక్/రుణదాత దగ్గర రీఫైనాన్స్ చేశారని అనుకుందాం. ఇలా చేస్తే, 9 సంవత్సరాల్లో మీరు కట్టాల్సిన వడ్డీ రూ. 10,85,425 అవుతుంది. రీఫైనాన్సింగ్ కోసం రూ. 25,000 ఫీజ్ చెల్లించారని అనుకుంటే, మీకు వడ్డీ రూపంలో రూ. 1,18,102 (12,28,527 - 10,85,425 - 25,000) మిగులుతుంది. కొత్త రుణదాతకు చెల్లించాల్సిన EMI రూ. 33,198 అవుతుంది. ఇక్కడ, మీకు నెలకు EMI రూపంలో రూ. 1,325 (34,523 - 33,198) ఆదా అవుతుంది. మొత్తం సేవింగ్స్ పర్సంటేజీ 9.6% అవుతుంది.
అదనపు లాభం
ఇలా ఆదా చేసిన డబ్బును మీరు షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇంకేదైనా మార్గంలో పెట్టుబడి పెడితే, మీ హోమ్ లోన్ తీరేసరికి (9 సంవత్సరాల్లో) మీ పెట్టుబడి విలువ భారీగా పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ డబ్బుతో మీ లోన్‌ను ఇంకా ముందుగానే తీర్చేయొచ్చు లేదా ఇతర ఆర్థిక అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. అంటే, ఈ రూపంలోనూ మీకు అదనపు లాభం కలుగుతుంది.
మరో ఆసక్తికర కథనం: ఆసుపత్రి బిల్లుకు భయపడొద్దు - మిమ్మల్ని కూల్‌గా ఉంచే ఉపాయాలు ఇవే!