Common Mistakes To Avoid In Share Market: భారతీయ స్టాక్ మార్కెట్‌లో 70 శాతానికి పైగా రిటైల్ ఇన్వెస్టర్లు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. అయినప్పటికీ, మన దేశంలో పెట్టుబడి కోసం ఆర్థిక సలహాదారుల సాయం తీసుకునే పెట్టుబడిదారులు 12 శాతం మాత్రమే ఉన్నారు. చాలా సందర్భాల్లో, అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు కూడా ఇన్వెస్ట్ చేసే ముందు కేవలం మూడు విషయాలను అర్థం చేసుకోవడంలో విఫలమై నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ మూడు విషయాలు ఏంటి?.


అర్ధం చేసుకోవాల్సిన 3 విషయాలు:
2018 ET వెల్త్ సర్వే రిపోర్ట్‌ ప్రకారం, స్టాక్ మార్కెట్‌లో 70 శాతానికి పైగా రిటైల్ ఇన్వెస్టర్లు డబ్బును కోల్పోయి మార్కెట్ నుంచి నిష్క్రమిస్తున్నారు. పెట్టుబడి పెట్టే ముందు కొన్ని విషయాలపై శ్రద్ధ చూపకపోవడమే ఇందుకు కారణమని సర్వేలో తేలింది. అవి..


1. పెట్టుబడిదారులు సరైన పద్ధతిలో ఆస్తి కేటాయింపు (Asset allocation) చేయలేదు. అంటే, ఏ రకమైన ఆస్తి వర్గంలో (Asset Class) ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలన్న విషయంపై అవగాహన లేదు.


2. అదాటు లాభాల కోసం అధిక రిస్క్ (High Risk) తీసుకుంటున్నారు.


3. పెట్టుబడి పెట్టే ముందు షేర్లకు సంబంధించిన అన్ని అంశాలపై దృష్టి పెట్టడం లేదు.


పెట్టుబడి పెట్టేటప్పుడు ఏమి చూడాలి?
ది ఫైనాన్షియల్ అనలిస్ట్ జర్నల్ ప్రకారం, పెట్టుబడి ద్వారా మీరు పొందే లాభంలో 91.5% డబ్బు ఆస్తి కేటాయింపుపై ఆధారపడి ఉంటుంది, 7% కంటే తక్కువ లాభం స్టాక్ ఎంపికపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. మీ పెట్టుబడి నుంచి 20% లాభం పొందితే, దానిలో 18.3% ఆస్తి కేటాయింపు ద్వారా & 1.7% మార్కెట్‌ టైమింగ్‌, దాని సెలక్షన్‌ నుంచి వస్తుంది. అంటే.. పెట్టుబడి నుంచి లాభం సంపాదించాలంటే అసెట్‌ అలొకేషన్‌ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఇక్కడ అర్ధం అవుతుంది. అయినప్పటికీ, చాలా మంది పెట్టుబడిదారులు ట్రెండింగ్ స్టాక్స్‌లో లేదా వాళ్లకు తెలిసినవాళ్లు చెప్పిన షేర్లలో డబ్బు పెట్టుబడిగా పెడుతున్నారు. ఇలాంటి కేసుల్లో లాభాలు వచ్చినప్పటికీ నష్టపోయే ప్రమాదం కూడా ఉంది. సరైన ఆస్తి కేటాయింపు వల్ల రాబడిని కళ్లజూడడమే కాదు, నష్టపోయే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అంతేకాదు.. స్టాక్‌ మార్కెట్‌లో ఎంట్రీతో పాటు ఎగ్జిట్‌ కూడా తెలిసి ఉండాలి. పెట్టుబడి కోసం మార్కెట్లోకి ప్రవేశించడానికే కాదు, నిష్క్రమించే సమయాన్ని గుర్తించడం కూడా ముఖ్యం.


చాలా మంది ఈ పొరపాటు కూడా చేస్తున్నారు
స్మార్ట్ అసెట్ ఫైనాన్షియల్ అసెట్ సర్వే ప్రకారం, పెట్టుబడి పెట్టడంలో ప్రజలు చేసే అతి పెద్ద తప్పు సరైన సమయం కోసం ఎదురుచూడడమే అని 52% మంది ఆర్థిక సలహాదారులు చెబుతున్నారు. మీరు దీర్ఘకాలిక పెట్టుబడిదారు అయితే,  మార్కెట్లో మార్పులను అంచనా వేయడానికి బదులుగా వెంటనే పెట్టుబడిని ప్రారంభించాలి. మార్కెట్‌లో ఒడుదొడుకులను పట్టించుకోకుండా దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయగలిగితే నష్టపోయే అవకాశం అతి స్వల్పంగా, లాభపడే అవకాశం అత్యంత గరిష్టంగా ఉంటుందన్నది నిపుణుల సలహా.


స్టాక్‌ మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ (SEBI) గణాంకాల ప్రకారం, ఎక్కువ మంది పెట్టుబడిదారులు గరిష్టంగా ఐదేళ్ల వరకు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారు. 71% మంది రెండేళ్ల లోపే తమ డబ్బును ఉపసంహరించుకుంటున్నారు. చాలా మంది పెట్టుబడిదారులు సరైన అవగాహన లేకుండా తప్పుడు సమయంలో మార్కెట్ నుంచి నిష్క్రమిస్తున్నారు. దీన్ని బట్టి చాలా తక్కువ మంది ఇన్వెస్టర్లు మాత్రమే దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేస్తారని స్పష్టమవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ చరిత్రను బట్టి, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు కచ్చితంగా లాభాలు సంపాదిస్తారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: సిగరెట్లు, కూల్‌డ్రింక్స్‌, బట్టల రేట్లు పెంపు! - కొత్త ఏడాదిలో పన్ను పోటు