New Banking Rules From 1st April 2025ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంకానుంది. అందుకే ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న రూల్స్‌ ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మిగతా రూల్స్ ఎలా ఉన్నప్పటికీ బ్యాకింగ్ రూల్స్‌ గురించి మాత్రం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేకుంటే ఆర్థికంగా మీరు ఇబ్బంది పడతారు. కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ ఖాతా నుంచి డబ్బులు ఫైన్‌గా కట్ అవుతాయి. అలాంటివి లేకుండా ఉండాలంటే 2025 ఏప్రిల్‌ 1 నుంచి మారే ఆరు సంగతులు కచ్చితంగా తెలుసుకోవాలి. 


ఏప్రిల్ 1, 2025 నుంచి ATM నుంచి నగదు తీసుకునే విషయంలో, కనీస బ్యాలెన్స్ మెంటెయిన్ చేయడంలో, పొదుపు ఖాతా వడ్డీ రేట్లు, డిజిటల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ప్రోత్సాహకాలపై చాలా ప్రభాతం చేసే రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. పాజిటివ్ పే సిస్టమ్ (PPS) లావాదేవీ భద్రత పెంచుతుంది. 


1. పెరగనున్న ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలు(Changes in ATM Withdrawal Charges)
చాలా బ్యాంకులు ఏటీఎం విత్‌డ్రా విధానంలో మార్పులు తీసుకొచ్చాయి. నెలలో ఏటీఎం నుంచి నగదు తీసుకునే విత్‌డ్రాల సంఖ్యను తగ్గించేశాయి. ఇకపై ఖాతాదారులు ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎంలో కాకుండా వేరే బ్యాంకు ఏటీఎంలలో కేవలం మూడుసార్లే డబ్బును ఉచితంగా తీసుకోగలరు. ఆ తర్వాత తీసుకునే ప్రతి విత్‌డ్రాకు ఫీజులు వసూలు చేస్తాయి బ్యాంకులు. ఇలా మూడు కంటే అదనంగా విత్‌డ్రా చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్‌కు 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 20 రూపాయలు మాత్రమే వసూలు చేసే వాళ్లు. ఇప్పుడు దాన్ని పాతిక రూపాయలు పెంచారు. 


2. కనీస బ్యాలెన్స్‌ నిర్వహణలో మార్పులు 
ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, కెనరాల బ్యాంకు లాంటి ప్రధానమైన బ్యాంకులు వాటి మినిమమ్‌ బ్యాలెన్స్ రూల్స్ మార్చాయి. ఇప్పటి వరకు ఎక్కడ బ్యాంకు అకౌంట్ ఉన్నప్పటికీ అందరికీ సమానంగా కనీస బ్యాలెన్స్ ఉంచాల్సి వచ్చేది. ఇప్పుడు దానిలో చాలా మార్పులు చేశారు. ఇకపై ఆయా ప్రాంతాలను బట్టి మినిమమ్‌ బ్యాలెన్స్ ఖాతాలో ఉంచాలి. 


పట్టణ ప్రాంతాల్లో మినిమమ్‌ బ్యాలెన్స్ ఎక్కువ ఉంచాల్సి ఉంటుంది. అదే సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో సాధారణ స్థాయిలో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బ్యాంకుల్లో ఖాతా ఉంటే మినిమమ్‌ బ్యాలెన్స్ తక్కువగానే ఉంటుంది. ఇలా కనీసం డబ్బులు ఖాతాల్లో ఉంచకపోతే మాత్రం ఫైన్ వేస్తారు. 


3. పాజిటివ్ పే సిస్టమ్‌(PPS) అమలు 
ఈ మధ్య కాలంలో ఎక్కువ బ్యాంకు అక్రమాలు జరుగుతున్న వేళ బ్యాంకులు పాజిటివ్‌ పే సిస్టమ్‌ను అమలు చేయనున్నారు. ఇది ముఖ్యంగా 5000 రూపాయల దాటిన చెక్ పేమెంట్స్‌ విషయంలో ఇంప్లిమెంట్ చేస్తారు. చెక్‌ ట్రాన్సాక్షన్‌ విషయంలో జరిగే ఫ్రాడ్‌ను నివారించేందుకు చెక్‌ నెంబర్‌, తేదీ, ఎవరికి పే చేస్తున్నాం, అమౌంట్ ఎంత అనేది మస్ట్‌గా ఒకటికి పదిసార్లు చూసుకోవాలని సూచిస్తున్నారు. 


4. డిజిటల్ బ్యాంకింగ్‌ ఫీచర్స్‌ పెంపుదల 
దేశంలో డిజిటల్ బ్యాంకింగ్‌ సేవలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. అందుకే దీన్ని మరింత సేఫ్‌గా ఉండేలా మరిన్ని ఫీచర్స్‌ జోడించనున్నాయి బ్యాంకులు. ఏఐతో పని చేసే చాట్‌బోట్స్‌ను వినియోగదారుల కోసం ప్రవేశపెట్టనున్నారు. రెగ్యులర్‌గా ఎదుర్కొనే సమస్యలను ఏఐ ద్వారా పరిష్కరిస్తారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌లో అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్ తీసుకొస్తున్నారు. ముఖ్యంగా భద్రత విషయంలో కీలక నిర్ణయాలు ఉంటాయి. టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్, బయోమమెట్రిక్ లాంటి ఫీచర్స్‌ మరిన్ని విభాగాల్లో తీసుకొస్తారు.  


5. పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ల వడ్డీ రేట్లలో మార్పులు 
చాలా బ్యాంకులు పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ల వడ్డీ రేట్లలో మార్పులు తీసుకురాబోతున్నాయి. సేవింగ్స్‌ అకౌంట్‌పై ఇప్పటి వరకు ఇచ్చే వడ్డీ రేటులో మారుస్తున్నారు. మీ ఖాతాలో ఉన్న నగదును ఆధారంగా చేసుకొని సేవింగ్స్‌ ఖాతాలపై వడ్డీ రేటు నిర్ణయిస్తారు. ఎక్కువ బ్యాలెన్స్ ఉన్న వాళ్లకు ఎక్కువ వడ్డీ వస్తుంది. లేని వాళ్లకు తక్కువ వడ్డీ వస్తుంది. పొదుపు ఆలోచనలు పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 


6. క్రెడిట్ కార్డు ఆఫర్స్‌ మదింపు 
SBI, IDFC ఫస్ట్ బ్యాంక్‌తో సహా చాలా బ్యాంకులు తమ కో-బ్రాండెడ్ విస్తారా క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలను మదింపు చేయనున్నాయి. ఇకపై ఈ కార్డులపై టికెట్ వోచర్లు ఇవ్వబోరు. పునరుద్ధరణ ప్రోత్సాహకాలు తొలగించనున్నారు. మైల్‌స్టోన్ రివార్డులను కూడా దశలవారీగా తగ్గించేయనున్నారు.