మీరు కొత్తగా ఉద్యోగంలో చేరారా?  చాన్నాళ్లుగా కొలువులో ఉన్నారా? వచ్చిన జీతం వచ్చినట్టే అయిపోతోందా?  వేతనంలో కొంతైనా ఆదా చేసుకోలేకపోతున్నారా? అయితే ఇది మీ కోసమే! జీతం చేతికందగానే ఈ 11 నియమాలు పాటిస్తే మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఆనందంగా జీవించొచ్చు.


బడ్జెటింగ్‌
మీ నగదు నిర్వహణ బాగుండాలంటే మొదట మీరు చేయాల్సిన పని బడ్జెటింగ్‌. అంటే క్యాష్‌ ఫ్లో ప్లాన్‌ అన్నమాట. ప్రస్తుతం మీరున్న ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని మీ ఖర్చులేంటో చూసుకోవాలి. ఉదాహరణకు విద్య, వైద్యం, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇతరత్రా అవసరాలేంటో రాసిపెట్టుకోవాలి. ఇలా చేసినప్పుడు మీరు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో అర్థమవుతుంది. ఎందుకంటే ఆరోగ్యకరమైన నగదు రాబడి నిర్వహణకు బడ్జెట్‌ ఒక మార్గసూచిలా ఉపయోగపడుతుంది.


రాబడి మార్గాలేంటి
మీకు వచ్చిన డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారన్నదీ ముఖ్యమే.  అలాగే మీకు ఏయే రూపంలో డబ్బు వస్తుందో గమనించాలి. కొందరు ఆస్తుల ద్వారా  నిరంతరం ఆదాయం పొందితే కొందరు ఖర్చుల కోసమే సంపాదిస్తూ ఇబ్బంది పడుతుంటారు.


స్పష్టమైన లక్ష్యాలు
నగదు నిర్వహణ ప్రణాళికలో మరో ముఖ్యమైన సూత్రం సాధించగల లక్ష్యాలను నిర్దేశించుకోవడం. మొదట మీ లక్ష్యాలేంటో పేపర్‌ పైన రాసిపెట్టుకోవాలి. నిరంతరం మనల్ని పనిచేసేలా, ప్రేరణ కల్పించేలా ఉండే లక్ష్యాలను ఎంచుకోవాలి. లక్ష్యసాధనలో పురోగతి ఎలా ఉందో నిరంతరం పరిశీలిస్తుండాలి. లక్ష్యాలు పెట్టుకొనేటప్పుడు వయసు, ఆరోగ్యం, ఆదాయం, స్వల్పకాల అవసరాలు, దీర్ఘ కాల అవసరాలు, ఇతర ఆర్థిక అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి.


మిగులు నిర్వహణ
మంచి నగదు రాబడి నిర్వహణకు ఉదాహరణ ఏంటంటే మీ సంపాదనలో ఎంత మిగులుతోంది అనేదే. వచ్చే నెల వేతనం పడేలోపు మీ వద్ద ఎంత నగదు మిగులుతుందనేది చాలా ముఖ్యం. అప్పుడే వాటిని పెట్టుబడులకు  మళ్లించగలం. ఎందుకంటే అదనపు ఆదాయం ఇచ్చే స్వేచ్ఛ ఎంతో ముఖ్యం.


ఖర్చుల పద్ధతి
మీకు జీతం చేతికందే నాటికే ఎలాంటి ఖర్చులుంటాయో తెలుసుకోవడం కీలకం. ఉదాహరణకు ప్రతి నెలా ఇంటి అద్దె, నెలవారీ అవసరాలు, కిరాణా, ఆహారానికి అయ్యే నిర్దేశిత ఖర్చులు అందరికీ ఉంటాయి. కొన్నిసార్లు అనుకోని ఖర్చులు ఎదురవుతుంటాయి. ఇలాంటివాటిపై ముందస్తు అవగాహన ఉంటే ఇబ్బందులు ఉండవు.


ట్రాక్‌ చేయడం
ఒక రూపాయి మిగుల్చుకోవడం ఒక రూపాయి సంపాదించుకోవడమే! అందుకే మీ ఖర్చులపై ఓ కన్నేయాలి. ఒక్కోసారి కొంతే ఖర్చు చేద్దామనుకున్నా అది ఎక్కువే అవ్వొచ్చు. కొన్నిసార్లు తెలియని, అత్యవసర ఖర్చులు వస్తుంటాయి. అప్పుడు మీ బడ్జెట్‌ను మించి ఖర్చు అవుతుంది.  నిరంతరం వీటిని ట్రాక్‌ చేయకపోతే పరిస్థితి నియంత్రణలో ఉండదు. 


అనవసరంగా వద్దు
చాలామంది చేసే పొరపాటు ఒకటుంది. భరించగలిగే శక్తి ఉంది కదా అనవసరమైనవి, కొత్త ఖర్చులు చేస్తుంటారు. అవసరం లేకున్నా, ఆకర్షణీయంగా ఉన్నాయని కొందరు రుణాలు తీసుకుంటారు. చాలా ఆర్థిక సంస్థలు మీ వేతనం చూసే రుణాలు ఇస్తుంటాయి. మీ ఖర్చులేంటో వాటికి తెలియవు. అందుకే అనవసరంగా రుణాలు తీసుకోవద్దు.


క్రెడిట్‌ కార్డు అవసరమైతేనే
నెల జీతం అయిపోగానే చాలామంది క్రెడిట్‌ కార్డులపై ఆధారపడతారు. అయితే వాటిని ఉపయోగించి అదనంగా వడ్డీ కట్టడం అవసరమో కాదో ఆలోచించుకోండి. వచ్చే నెల జీతం పడగానే అవసరం అనుకున్న వస్తువు కొనుక్కోవచ్చో లేదో పరిశీలించండి. ఎందుకంటే క్రెడిట్‌ కార్డులను అత్యవసరానికే ఉపయోగిస్తే మేలు.


అలవాట్లు నెమ్మదిగా
రోమ్‌ నగరాన్ని ఒక్క రోజులోనే నిర్మించలేదని తెలుసుకోండి. ప్రతిదానికీ కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మీ నగదు రాబడి నిర్వహణ అనేది ఒక ప్రక్రియ. ఒకేసారి అందులో నిపుణులు కాలేరు. క్రమం తప్పకుండా నియమాలు పాటిస్తే నెమ్మదిగా మంచి ఆర్థిక అలవాట్లు అవుతాయి. దాంతో మీరు మెరుగ్గా రాబడిని నియంత్రించుకోగలరు.


తెలివిగా..
మీ డబ్బును తెలివిగా ఉపయోగించుకోండి. ఏవైనా కొనుగోలు చేసేటప్పుడు రాయితీలు, కూపన్లు,  ఆఫర్లు ఉన్నాయేమో కనుక్కోండి. మీరు ఖర్చు చేస్తున్న డబ్బుపై ఎక్కువ రాబడి వచ్చేలా చూసుకోండి.


నిపుణుల సలహాలు
ఒకవేళ మీరు నగదు ప్రవాహాన్ని నియంత్రించుకోలేకపోతే నిపుణుల సలహాలు తీసుకోండి. మెరుగ్గా పెట్టుబడులు ఎలా పెట్టాలి? వేటికి ఎంత ఖర్చు చేయాలి? వంటివి తెలుసుకోండి. ఆర్థిక నిపుణులు మీ ఖర్చులు, అవసరాలు, లక్ష్యాల ఆధారంగా మంచి ప్రణాళికలు ఇస్తారు. దాంతో సులువుగా మీ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు.