Fraudulent Loan Apps: టెక్నాలజీ పెరిగే కొద్దీ మోసాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. జనం చేతిలో స్మార్ట్ ఫోన్, దాని నిండుగా డేటా ఉండడంతో మోసం చేయడానికి కేటుగాళ్లకు ఎక్కువ అవకాశం దొరుకుతోంది. ఆన్‌లైన్ మోసాల్లో రుణాలకు సంబంధించిన కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి.
ఆన్‌లైన్ లోన్ యాప్స్ (Online Loan Apps) ద్వారా నిమిషాల్లోనే డబ్బు దొరుకుతుంది, ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. దీంతో, ప్రజలు, ముఖ్యంగా యువత ఈ ఇన్‌స్టాంట్ లోన్ యాప్స్ (Instant Loan Apps) మాయలో పడి అప్పుల ఊబిలోకి జారిపోతున్నారు.
ఆన్‌లైన్ లోన్ యాప్స్ ముసుగులో నకిలీ లోన్ యాప్స్ (fraudulent loan apps) కూడా పని చేస్తున్నాయి. వీటి సంఖ్య వేలల్లో ఉంది. ఇవి, రుణం కోసం అప్లై చేసుకున్న వ్యక్తి డబ్బును, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నాయి, తిరిగి రుణగ్రస్తుడినే బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి.
గూగుల్ ప్లే స్టోర్ నుంచి 2,500 యాప్‌లు తొలగింపు
నకిలీ లోన్ యాప్ మోసాల కేసులు పెరుగుతుండడంతో, అలాంటి యాప్‌లపై భారత ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ప్రభుత్వ ఆదేశంతో, గూగుల్ తన ప్లే స్టోర్ (Google Play Store) నుంచి అలాంటి 2,500 యాప్‌లను తొలగించింది. ఈ విషయాన్ని, ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో (Winter Sessions of Parliament) ప్రభుత్వం వెల్లడించింది.
4,000 యాప్‌ల రివ్యూ
తన ప్లే స్టోర్ నుంచి 2,500 పైగా మోసపూరిత రుణ యాప్‌లను గూగుల్ (Google) తొలగించిందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్) లోక్‌సభకు తెలిపారు. గూగుల్, 2021 ఏప్రిల్ - 2022 జులై మధ్య ఈ చర్య తీసుకుందని వివరించారు. తన ప్లే స్టోర్‌లో ఉన్న 3,000-4,000 లెండింగ్ యాప్‌లను (Lending apps) సమీక్షించిన తర్వాత గూగుల్ ఈ కఠిన చర్య తీసుకుందని వెల్లడించారు. లోక్‌సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి లిఖితపూర్వక సమాధానం రూపంలో ఈ సమాచారాన్ని అందించారు. మోసం రుణ యాప్‌పై తీసుకున్న చర్యల గురించి కూడా అదే సమాధానంలో పార్లమెంటుకు తెలియజేశారు.
ఇలాంటి నకిలీ రుణ యాప్‌లను అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ (RBI), ఇతర రెగ్యులేటరీ బాడీలతో కలిసి భారత ప్రభుత్వం నిరంతరం పని చేస్తోందని ఆర్థిక మంత్రి సీతారామన్ చెప్పారు. ఆర్థిక స్థిరత్వం & అభివృద్ధి మండలి (FSDC) సమావేశాల్లో ఈ అంశంపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని, లోన్ యాప్స్‌ను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. FSDC అంటే.. ఆర్థిక మంత్రి అధ్యక్షతన పని చేసే ఇంటర్-రెగ్యులేటరీ ఫోరమ్.
కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పిన ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఒక లీగల్ యాప్‌ల వైట్ లిస్ట్‌ను (Whitelist of legal apps) సిద్ధం చేసింది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆ జాబితాను గూగుల్‌కు పంపింది. RBI తయారు చేసిన వైట్ లిస్ట్ ఆధారంగా మాత్రమే గూగుల్ తన యాప్ స్టోర్‌లో రుణ పంపిణీ యాప్‌లను ఆమోదిస్తుంది. ఈ విధంగా నకిలీ లోన్ యాప్‌లను అరికట్టేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
ఇక్కడో విషయాన్ని మనం గమనించాలి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, నకిలీ లోన్ యాప్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ప్రజల అత్యాశే వీటి పుట్టుకకు కారణమన్నది కఠోర వాస్తవం.
మరో ఆసక్తికర కథనం: మీ క్రెడిట్ స్కోర్ చాలా తక్కువగా ఉన్నా క్రెడిట్ కార్డ్ పొందే దారుంది!