Onion Price Hike: సామాన్యుడి జేబుకు టామాటా పెట్టిన చిల్లు అలాగే ఉంది, ఇప్పుడు మరో చిల్లు చేయడానికి ఉల్లి ఉరకలేస్తోంది. ప్రస్తుతం, రిటైల్‌ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలు ₹25-30 వరకు పలుకుతున్నాయి. దేశంలోని ప్రధాన మార్కెట్‌లలోకి ఆనియన్‌ సప్లై క్రమంగా తగ్గుతోంది, రేటు మెల్లగా పెరుగుతోంది. గత నాలుగు నెలలుగా ఉల్లిపాయల రేట్లు సామాన్యుడికి అందుబాటులోనే ఉన్నాయి. 


ఉల్లిపాయల రేటు ఎందుకు పెరుగుతుంది?
సాధారణంగా... ఏటా ఆగస్టు, సెప్టెంబర్ నెలలు ఉల్లికి కరవు కాలం లాంటిది. పంట వేయడం-దిగుబడి రావడం మధ్య ఉండే టైమ్‌ ఇది. కాబట్టి, ఈ రెండు నెలల్లో సప్లై తగ్గుతుంది, రేట్లు పెరుగుతాయి. ఉల్లి పంట కోతలు అక్టోబర్‌లో స్టార్ట్‌ అవుతాయి. ఆ నెల నుంచి మార్కెట్‌లోకి మళ్లీ సప్లై పెరిగి, ఉల్లి ఘాటు తగ్గుతుంది. ఇది ఏటా జరిగే విషయమే.   


శీతాకాలంలో పండించే ఉల్లి పంట, దేశవ్యాప్త వార్షిక డిమాండ్‌లో 70%ను తీరుస్తుంది. కొన్ని నెలలుగా రేట్లు ఆశాజనకంగా లేకపోవడంతో, ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజనులో రైతులు ఉల్లిని తక్కువగా సాగు చేశారు. సాగు విస్తీర్ణం 8 శాతం మేర తగ్గింది. ఉల్లి దిగుబడి 5 శాతం తగ్గుతుందని అంచనా. ఈ ఏడాది మొత్తం ఉత్పత్తి 29 మిలియన్‌ టన్నులకు (MMT) చేరొచ్చని లెక్కలు వేశారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి సాగు అంత గొప్పగా లేదని ఉల్లి వ్యాపారులు కూడా చెబుతున్నారు. 


పంటను తుడిచి పెట్టిన వర్షాలు
దీనికి తోడు, రైతులు నిల్వ చేసిన ఉల్లిపాయలు గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పాడైపోయాయి, ఆసియాలో అతి పెద్ద ఆనియన్‌ మార్కెట్ అయిన లాసల్‌గాన్ మార్కెట్‌లోకి సప్లై తగ్గింది. మున్ముందు ఉల్లి రేట్లు పెరుగుతాయన్న అంచనాలతో, బడా బాబులు ముందుగానే ఆనియన్స్‌ కొని నిల్వ చేసుకున్నారు. దీంతో, సెప్టెంబర్‌ చివరి వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉండాల్సిన రబీ స్టాక్‌, ఈసారి త్వరగా ఖాళీ అయింది, నిల్వ కాలం 1-2 నెలలు తగ్గింది. మిగిలివున్న కొద్దిపాటి సరుకు కూడా ఈ నెలాఖరుకు ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.


ఈ నెల చివరి నాటికి, రిటైల్ మార్కెట్‌లో ఆనియన్‌ రేటు పెరుగుతుంది, సెప్టెంబర్‌లో అధిక స్థాయికి చేరుతుందని క్రిసిల్‌ కూడా ఇటీవలే రీసెర్చ్‌ చేసి చెప్పింది. ఉల్లి సరఫరాలో కొరత రేటు పెరగడానికి కారణం అవుతుంది. వచ్చే నెలలో కిలో ఉల్లిపాయలు 60 రూపాయల నుంచి 70 రూపాయలు వరకు చేరే అవకాశం ఉందని తన రిపోర్ట్‌లో వెల్లడించింది. 


గవర్నమెంట్‌ వెర్షన్‌ ఇది
భారత ప్రభుత్వం దగ్గర దాదాపు 2,50,000 టన్నుల ఉల్లి నిల్వలు ఉన్నాయి. దేశీయంగా సప్లై తగ్గినప్పుడు వీటిని మార్కెట్‌లోకి వదులుతుంది. దేశంలో ఉల్లి డిమాండ్ & సప్లైని కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, మార్కెట్‌లో దిగడానికి తగినంత స్టాక్స్‌ గవర్నమెంట్‌ దగ్గర ఉన్నాయని, జనం ఆందోళన పడొద్దని అధికారులు చెబుతున్నారు. ఉల్లి సంక్షోభం వచ్చినప్పుడు, భారతదేశం ఆనియన్స్‌ దిగుమతి చేసుకుంటుంది. అయితే, 2021-22, 2022-23 మాత్రం ఎలాంటి ఇంపోర్ట్స్‌ చేయలేదు.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఇవాళ్టి రేట్లివి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial