Energy Markets: చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాల సమాఖ్య, అనుబంధ (OPEC+, ఒపెక్ ప్లస్) దేశాలు పిడుగులాంటి నిర్ణయం తీసుకున్నాయి. దీంతో, ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ముడి చమురు రేట్లు పెరిగి, ఆ ప్రభావం మన దేశం మీదా పడనుంది. సోమవారం సమావేశమైన ఒపెక్ ప్లస్ దేశాలు, వచ్చే నెల (అక్టోబర్) నుంచి ఉత్పత్తిలో కోతకు నిర్ణయించాయి. తీవ్ర అస్థిరంగా కదులుతున్న ఇంధన ధరలను స్థిరీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
అక్టోబర్ నుంచి రోజుకు సుమారు 1,00,000 బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్ ప్లస్ నిర్ణయించింది. ఉత్పత్తిలో 'కేవలం' లక్ష బ్యారెళ్ల కోత పెట్టబోతున్నట్లు ఆ సమాఖ్య వెల్లడించింది. ఒపెక్ దేశాల్లోని రోజువారీ ఉత్పత్తితో పోలిస్తే ఈ లక్ష బ్యారెళ్లు ఒక మూలకు కూడా రావు. అందుకే 'కేవలం' అన్న పదాన్ని ఒపెక్ ఉపయోగించింది.
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ విజ్ఞప్తి మేరకు, చమురు ఉత్పత్తిని సెప్టెంబర్‌లో రోజుకు 'కేవలం' 1,00,000 బ్యారెళ్లు పెంచడానికి గత నెలలో ఒపెక్ ప్లస్ అంగీకరించింది. అప్పట్లో భారీగా పెరిగిన చమురు ధరలను చల్లబరచాలని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సాయం చేయాలని అమెరికా చేసిన విన్నపాన్ని అంగీకరించాయి.
ఇప్పుడు అదే లక్ష బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించడానికి, ఆగస్టు ఉత్పత్తి స్థాయికి తిరిగి రావాలని నిర్ణయించాయి. అమెరికా విజ్ఞప్తి మేరకు పెంచిన ఉత్పత్తి సెప్టెంబర్‌కు మాత్రమే వర్తిస్తుంది.
OPEC+ తదుపరి సమావేశం అక్టోబర్ 5న జరగనుంది. పరిస్థితుల్లో ఏమైనా మార్పులు ఉంటే, దానికి అనుగుణంగా అక్టోబర్ 5 నాటి సమావేశంలో మళ్లీ నిర్ణయం తీసుకుంటారు, లేదా పాత నిర్ణయానికే కట్టుబడి ఉంటారు.
ఒపెక్ ప్లస్ దేశాలు ఇచ్చిన షాక్‌తో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు బాగా పెరిగాయి. అంతర్జాతీయ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2.5% పెరిగి బ్యారెల్ ధర $95.54 వద్ద ఉండగా, U.S. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ఫ్యూచర్స్ 2.6% పెరిగి బ్యారెల్ $89.16 వద్దకు చేరాయి.
ఫైనల్‌గా చూస్తే, ముడి చమురు అవసరాల్లో 80%పైగా దిగుమతి చేసుకుంటున్న మన దేశంలోనూ పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే, సామాన్యులకు మళ్లీ చుక్కలు కనిపించే రోజులు దగ్గర పడ్డాయి.
మార్చిలో మల్టీ-ఇయర్ గరిష్టాలను తాకిన బ్యారెల్ ముడి చమురు ధర, జూన్ ప్రారంభం నుంచి దాదాపు 25% పడిపోయాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల దూకుడైన నిర్ణయాలు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వడ్డీ రేట్ల పెంపు, చైనాలో కొన్ని ప్రాంతాల్లో కొత్తగా విధిస్తున్న లాక్‌డౌన్లు, కొవిడ్ సంబంధిత ఆంక్షలు వంటివి ప్రపంచ ఆర్థిక వృద్ధిని నెమ్మదింపజేస్తాయని, చమురు డిమాండ్‌ను తగ్గిస్తాయని వేసిన అంచనాల వల్ల రేట్లు పడిపోయాయి. ఒక దశలో దాదాపు 140 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్ ధర, జూన్ నుంచి తగ్గి 90 డాలర్లకు దిగొచ్చింది. ఆ తర్వాత మళ్లీ దాదాపు 100 డాలర్ల చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఈ అస్థిరతను తగ్గించడానికే ఒపెక్ ప్లస్ దేశాలు చమురు ఉత్పత్తిలో కొద్దిపాటి కోత పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాయి.