Bank Nominee Rules: మోదీ సర్కార్ మెుదటి టర్మ్ వచ్చినప్పటి నుంచి దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రతి పౌరుడికి బ్యాంక్ ఖాతా నుంచి డిజిటల్ చెల్లింపులను దేశమంతటా విస్తరించటం వరకు అనేక మార్పులకు ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సంయుక్తంగా తీసుకొచ్చాయి. అయితే ఈ సారి అనేక ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు పరిష్కారం చూపాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయించారు. ఈ క్రమంలోనే శుక్రవారం లోక్‌సభలో బ్యాంకింగ్ చట్టాల సనవరణ బిల్లును ప్రవేశపెట్టారు.


ఈ క్రమంలో వాస్తవానికి దేశంలోని బ్యాంకుల వద్ద ప్రజలకు సంబంధించిన అన్ క్లెయమ్డ్ డిపాజిట్లు నిరంతరం పెరగటంపై ఈసారి మోదీ సర్కార్ దృష్టి సారించింది. రిజర్వు బ్యాంక్ అందించిన వివరాల ప్రకారం మార్చి 31, 2024 చివరి నాటికి వార్షిక ప్రాతిపదికన బ్యాంకుల వద్ద ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్ము 26 శాతం పెరిగి రూ.78,213 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడైంది. ఈ సొమ్ము ఏటేటా పెరగటంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే తమ పూర్వీకులకు సంబంధించిన అన్ క్లెయిమ్ డిపాజిట్లను చట్టబద్దమైన వారసులు తీసుకునేందుకు వెసులుబాటు సైతం కల్పించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సమస్య రావటానికి కారణం బ్యాంకులు దశాబ్ధాల కిందట నామినీ, కేవైసీ వివరాలు వంటి వాటిని ఇప్పటి మాదిరిగా పాటించకపోవటమేనని గ్రహించింది.


ఈ సమస్యను పరిష్కరించేందుకు తాజా బ్యాంకింగ్ చట్టాల సనవరణ బిల్లు, 2024లో ఒక ఖాతాకు కస్టమర్లు నలుగురు నామినీలను ఎంపిక చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. దీనికి ముందు వరకు ఒక ఖాతాకు కేవలం ఒక నామినీని మాత్రమే కస్టమర్లు ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉండేది. కొత్త చట్టాలు అమలులోకి వస్తే తదనుగుణంగా నామినీలను నివియోగదారులు పెంచుకోవచ్చు. ఇది సదరు ఖాతాదారులు మరణించిన సమయంలో చట్టపరంగా డిపాజిట్లు లేదా ఇతర మెుత్తాన్ని క్లెయిమ్ చేసుకోవటానికి పొందుపరచబడిన నామినీలకు అవకాశం కల్పించబడుతుంది. ఇది భారీగా పెరుగుతున్న అన్ క్లెయిమ్డ్ డబ్బు పెరుగుదలను నివారిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నమ్ముతోంది. 


ఈ క్రమంలో శుక్రవారం లోక్‌సభలో బ్యాంకింగ్ చట్టాల సనవరణ బిల్లును ప్రవేశగా కొందరు విపక్ష సభ్యులు ఈ బిల్లును సభలో వ్యతిరేకించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏకకాలంలో 4 చట్టాలను సవరించాలని ప్రయత్నించటాన్ని ఆర్ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది గత సాంప్రదాయాలకు పూర్తి వ్యతిరేకంగా ఉందని వారు వారించారు. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, బ్యాంకింగ్ కంపెనీల చట్టం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలో కొన్ని సవరణలను ప్రతిపాదించారు.