Additional Tax On Rich People: దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తగ్గించడానికి సంపన్నులపై ప్రత్యేక పన్ను విధించాలనే డిమాండ్ భారత్‌లో పెరుగుతోంది. ధనిక వర్గంపై అదనపు పన్ను లేదా సూపర్ రిచ్ టాక్స్‌ (Super Rich Tax On Wealthy) విధించడాన్ని ఎక్కువ మంది భారతీయులు సమర్థిస్తున్నారని ఓ సర్వే వెల్లడించింది.


'ఎర్త్4ఆల్', 'గ్లోబల్ కామన్స్ అలయన్స్' సంస్థలు కలిసి నిర్వహించిన సర్వే ప్రకారం... దేశంలోని ఆదాయ అసమానతలు, ఆర్థిక అసమానతలు (Income inequalities, Economic inequalities) తొలగించడానికి కోటీశ్వరులపై సంపద పన్ను (Wealth Tax) విధించడం సబబేనని 74 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. అంటే, ప్రతి నలుగురిలో ముగ్గురు భారతీయులు సూపర్ రిచ్ పన్ను విధించడాన్ని సమర్థిస్తున్నారు. జీ20 దేశాల్లో ఇలాంటి వారి వాటా 68 శాతం.


సంపద పన్ను విధించేందుకు G20లో ప్రతిపాదన
జీ20 (G20) కూటమి సమావేశాలకు ఈ ఏడాది బ్రెజిల్‌ అతిథ్యం ఇస్తోంది. వచ్చే నెలలో, ఆ దేశంలో జీ20 దేశాల ఆర్థిక మంత్రులు సమావేశం అవుతున్నారు. అత్యంత ధనవంతులపై (Super Rich) వెల్త్‌ టాక్స్‌ విధించే అంశం కూడా ఈ సమావేశం అజెండాలో ఉంది. సంపద పన్నుపై జీ20 ఆర్థిక మంత్రుల నుంచి ఉమ్మడి ప్రకటన వెలువడేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, వెల్త్‌ టాక్స్‌ విధింపు ప్రతిపాదనపై భారత్‌ సహా అన్ని జీ20 సభ్య దేశాల్లో సర్వే చేశారు, మొత్తం 22 వేల మంది పౌరులను ప్రశ్నలు అడిగారు. ఆ సర్వే వెల్లడించిన ప్రకారం... జీ20 సభ్య దేశాల్లోని 68 శాతం మంది ప్రజలు సూపర్‌ రిచ్‌ టాక్స్‌ ప్రతిపాదనకు మద్దతిస్తున్నారు. మన దేశంలో ఈ నంబర్‌ ఏకంగా 74 శాతంగా ఉండడం విశేషం.


వివిధ సమస్యలపై గళం విప్పిన భారతీయులు
సర్వే ఫలితాల ప్రకారం... ఆకలి, ధనికులు-పేదల మధ్య అంతరం, పర్యావరణ పరిరక్షణ వంటి సమస్యలపై భారతీయ ప్రజలు గళం విప్పారు. పర్యావరణం, ప్రకృతి పరిరక్షణ కోసం వచ్చే పదేళ్లలో అన్ని ఆర్థిక రంగాల్లో సమగ్ర మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని 68 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. ఎక్కువ కాలుష్యం వెలువరిస్తున్న వారి నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేయాలని సూచించారు. సార్వత్రిక ప్రాథమిక ఆదాయ వ్యవస్థ ఉండాలని 71 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించే విధానాలు ఉండాలని 74 శాతం మంది చెప్పారు. పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం చాలా ముఖ్యమని 76 శాతం మంది ఇండియన్స్‌ భావిస్తున్నారు.


భారతదేశంలోనే కాదు, అన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక అసమానతలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా, కొవిడ్ తర్వాత ఈ అంతరాలు అధికమయ్యాయి, దానిని తగ్గించే ప్రయత్నాలపైనా చర్చలు పెరిగాయి. సూపర్ రిచ్ టాక్స్‌ విధించాలన్న అభిప్రాయాలు చాలా దేశాల్లో వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ డిమాండ్ ఊపందుకుంది. సంపద పన్నుపై 2013 నుంచి చర్చలు జరుగుతున్నాయి. 


ప్రస్తుతం G20కి అధ్యక్షత వహిస్తున్న బ్రెజిల్‌ దేశం, సూపర్ రిచ్ ట్యాక్స్‌పై ఎక్కువ గళం విప్పుతోంది. జులై నెలలో జరిగే జీ20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో సూపర్ రిచ్ ట్యాక్స్‌పై సంయుక్త ప్రకటన తీసుకురావడానికి ఆ దేశం ప్రయత్నాలు చేస్తోంది.


మరో ఆసక్తికర కథనం: పసిడి, వెండి నగలు మరింత చౌక - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి