Tata Group Firms Shares: టాటా గ్రూప్‌లోని చాలా కంపెనీల స్టాక్స్‌ కొన్ని వారాలుగా సూపర్‌ పెర్ఫార్మ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (TIC), టాటా రాబిన్స్‌ ఫ్రేజర్‌లో (TRF) వేగం ఎక్కువగా కనిపిస్తోంది. ఇవాళ్టి (గురువారం) ఇంట్రా డే ట్రేడ్‌లో, మల్టీ ఇయర్‌ గరిష్ట స్థాయిని ఇవి టచ్‌ చేశాయి. గత వారం రోజుల్లోనే ఈ రెండు కౌంటర్లు 60 శాతం వరకు లాభపడ్డాయి.


Tata Investment Corporation
టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, తాజా రికార్డు గరిష్ట స్థాయి (కొత్త 52 వారాల గరిష్ట స్థాయి) రూ. 2,886.50 ను తాకింది, ఈరోజు 9 శాతం పెరిగింది. గత వారం రోజుల్లో, BSE సెన్సెక్స్‌లో 2 శాతం పెరుగుదలతో పోలిస్తే, ఈ స్క్రిప్‌ రూ.1,786 స్థాయి నుంచి 60 శాతం పెరిగింది.


గత నెల రోజుల్లోనే ఈ కౌంటర్‌ 80 శాతం లాభడింది. గత ఆరు నెలల్లో దాదాపు రెట్టింపు (97.69%) ర్యాలీ చేసింది. గత ఏడాది కాలంలో రెట్టింపు పైగా (111.80%) పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) 92 శాతం ఎగబాకింది.


'టాటా సన్స్' ప్రమోట్ చేస్తున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) ఈ టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్. ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కేటగిరీ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్‌ అయింది. టాటా గ్రూప్‌లోని కంపెనీలతోపాటు, వివిధ రంగాల్లోని టాటాయేతర కంపెనీలు, మ్యూచువల్ ఫండ్లు, లిస్టెడ్ &అన్‌ లిస్టెడ్ షేర్లలో, డెట్ ఇన్‌స్ట్రుమెంట్లలో ఇది పెట్టుబడులు పెడుతుంది.


Tata Robins Fraser Ltd
TRF షేర్లు వరుసగా మూడో రోజు కూడా అప్పర్ సర్క్యూట్‌లో లాక్ అయ్యాయి, BSEలో 10 శాతం పెరిగి రూ.267.35 వద్ద ఉన్నాయి. మూడు రోజుల క్రితం అంటే ఈ నెల 12న ఉన్న రూ.168.80 నుంచి ఇప్పటి వరకు 58 శాతం పెరిగింది. 2018 ఏప్రిల్ తర్వాత, మళ్లీ ఇప్పుడు గరిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. రెండు ఎక్స్ఛేంజీలు (NSE, BSE) ఈ స్టాక్ సర్క్యూట్ పరిమితిని 20 నుంచి 10 శాతానికి మార్చాయి, నేటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. 


ఈ స్క్రిప్‌, గత నెల రోజుల్లో 67 శాతం, గత ఆరు నెలల్లో 81 శాతం, గత ఏడాది కాలంలో 122 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) 96 శాతం ర్యాలీ చేసింది.


TRF ప్రమోటర్ అయిన టాటా స్టీల్‌కు (TSL) ఈ ఏడాది జూన్ 30 నాటికి ఈ కంపెనీలో 34.11 శాతం వాటా ఉంది.


విద్యుత్, నౌకాశ్రయాలు, ఉక్కు కర్మాగారాలు, సిమెంట్, ఎరువులు, మైనింగ్ వంటి మౌలిక సదుపాయాల రంగాల్లో మెటీరియల్ హ్యాండ్లింగ్ టర్న్‌కీ ప్రాజెక్ట్‌లను TRF చేపడుతుంది. జంషెడ్‌పూర్‌లోని తయారీ కేంద్రంలో ఇలాంటి మెటీరియల్ హ్యాండ్లింగ్ పరికరాలను ఉత్పత్తి చేస్తుంది. ఇంకాస డిజైన్ & ఇంజినీరింగ్, పర్యవేక్షణ వంటి సేవలను కూడా అందిస్తుంది.


ఈ ఏడాది ఆగస్ట్‌లో, TRF దీర్ఘకాలిక రేటింగ్‌ను 'నెగటివ్' నుంచి 'స్టేబుల్'కి కేర్‌ రేటింగ్స్‌ అప్‌గ్రేడ్‌ చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.