Stock Market Weekly Review: భారత ఈక్విటీ మార్కెట్లు ఈ వారం ఇన్వెస్టర్లకు మిశ్రమ ఫలితాలు ఇచ్చాయి. మొదట్లో వరుసగా పతనమై ఇబ్బంది పెట్టినా వీకెండ్‌లో మాత్రం అందరినీ హ్యాపీగా మార్చేశాయి. ఆఖరి రోజు దాదాపుగా మూడు శాతం వరకు ఎగిశాయి. ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేశాయి. మరి ఈ వారంలో బెంచ్‌ మార్క్‌ సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఎలా మొదలై ఎలా ముగిశాయో చూసేద్దాం!


BSE Sensex


మొత్తంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వరుసగా ఐదో వారం నష్టాల్లోనే ముగిసింది. మిగతా వారాలతో పోలిస్తే ఈసారి కాస్త తక్కువ నష్టపోవడం సంతోషకరం. మే 15న 52,793 వద్ద మొదలైంది. 52,636 వద్ద వారంతపు కనిష్ఠాన్ని అందుకుంది. 54,793 వద్ద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. మొత్తంగా 509 పాయింట్లు (0.93 శాతం) నష్టపోయి 54,326 వద్ద ముగిసింది. గతవారం ఇన్వెస్టర్లు రూ.10 లక్షల కోట్లు పోగొట్టుకోగా ఈ సారి రూ.50వేల కోట్లకే ఈ నష్టం పరిమితమైంది.


NSE Nifty


సెన్సెక్స్‌ స్వల్పంగా నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మాత్రం 3.07 శాతం వరకు లాభపడింది. మే 15న 15,848 వద్ద ఆరంభమైంది. 15,743 వద్ద వారంతపు కనిష్ఠ స్థాయిని చేరుకుంది. 16,399 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 16,266 వద్ద ముగిసింది. మే 19న నిఫ్టీ 2.65 శాతం నష్టపోయినా మే 17, 20న వరుసగా 2.63, 2.89 శాతం పెరగడంతో లాభాలు వచ్చాయి.


కారణాలు ఇవీ


2022, మే 16 నుంచి 20 వరకు మార్కెట్లు నడిచాయి. రెండు రోజులు నష్టపోగా మూడు రోజులు లాభపడ్డాయి. ఇన్వెస్టర్లకు కాస్త ఉపశమనం కల్పించాయి. ఈ వారం మార్కెట్ల ఒడుదొడుకులకు అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం రిటైల్‌ ఇన్వెస్టర్లలో గుబులు రేపుతోంది. ముడి వనరుల ధరలు పెరగడం కంపెనీల ఫలితాలపై ప్రభావం చూపనుంది. కొన్ని కంపెనీల ఫలితాలూ నిరాశపరిచాయి.


అమెరికా, ఐరోపా మార్కెట్లు రాత్రికి రాత్రే పతనమవ్వడం భారత మార్కెట్లపైనా ప్రభావం చూపించింది. అయితే చైనాలో లాక్‌డౌన్లు ఎత్తేస్తుండటం, కొన్ని దేశాలు వంటనూనె ఎగుమతులపై నిషేధం ఎత్తివేయడం సానుకూలంగా మారింది. ఇండియన్‌ ఎకానమీ గ్రోత్‌రేట్‌ అంచనా పెరుగుదల ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంటును చూపించింది.


Also Read: గుడ్‌ న్యూస్‌! జూన్‌ నుంచి తగ్గనున్న వంట నూనె ధరలు


Also Read: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ


Also Read: ఈ-ముద్రా ఐపీవోకు తొలిరోజు 47% స్పందన, రిటైల్‌ కోటాలో 90% బుక్‌!