ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి వర్గాలపై వరాల జల్లు కురిపించింది. పెరుగుతున్న ధరాభారం నుంచి రక్షించేందుకు ముందుకొచ్చింది. ద్రవ్యోల్బణం ప్రభావం పేదలపై పడకుండా చర్యలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడమే కాకుండా గ్యాస్ సిలిండర్‌పై రూ.200 వరకు సబ్సిడీ ప్రకటించింది. శనివారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు.
అడ్డు, అదుపు లేకుండా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యుడు అల్లాడుతున్న సంగతి తెలిసిందే. నవంబర్లోనే కేంద్ర ఎక్సైజ్ సుంకం కొంత తగ్గించినప్పటికీ ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో మళ్లీ ధరలు పెరగాయి. దీంతో మరోసారి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. లీటర్ పెట్రోలుపై రూ.8, డీజిల్‌పై రూ.6 సుంకం తగ్గించారు. దీంతో లీటర్ పెట్రోలు రూ.9.5, లీటర్ డీజిల్ రూ.7 మేరకు తగ్గనుందని చెప్పారు. ప్రధానమంత్రి ఉజ్వలా యోజన కిందున్న 9 కోట్ల మందికి గ్యాస్‌బండ భారం తగ్గించారు. 12 సిలిండర్ల వరకు ఒక్కో సిలిండర్‌పై రూ.200 సిబ్సిడీ ప్రకటించారు.
'నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పేదలు, ప్రజల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. పేదలు, మధ్య తరగతి వర్గాల కోసం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నాం. దాంతో ఇంతకు ముందున్న ప్రభుత్వాలతో పోలిస్తే మా హయాంలో సగటు ద్రవ్యోల్బణం తక్కువగానే ఉంది. ప్రస్తుతం ప్రపంచం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రపంచం ఇప్పటికీ కొవిడ్ నష్టాల నుంచి రికవరీ అవుతూనే ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో సరఫరా గొలుసు సమస్యలు ఏర్పడ్డాయి. దాంతో చాలా ఉత్పత్తులు, వస్తువుల కొరత ఏర్పడింది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి అనేక దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి' అని నిర్మల తెలిపారు.
కొవిడ్ మహమ్మారి సమయంలోనూ తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకుందని నిర్మల పేర్కొన్నారు. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభించాయని తెలిపారు. అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్నా నిత్యావసర సరకుల కొరత రాకుండా కృషి చేశామన్నారు. నిత్యావసర సరకుల ధరలు తక్కువగా ఉండేలా నియంత్రించామని వెల్లడించారు.
అంతర్జాతీయంగా ఎరువల ధరలు పెరుగుతున్నా వాటి భారం నుంచి మన రైతులను రక్షించామని నిర్మల తెలిపారు. బడ్జెట్‌లో ఇప్పటికే ప్రకటించిన రూ.1.05 లక్షల కోట్ల సబ్సిడీకి అదనంగా మరో రూ.1.10 లక్షల కోట్ల సబ్సిడీని ప్రకటించారు. సామాన్యుడికి ఉపశమనం కలిగేలా పనిచేయాలని పభుత్వంలోని అన్ని విభాగాలను ఆదేశించామన్నారు. పేదలు, మధ్యతరగతిని ఆదుకొనేందుకే నేడు నరేంద్రమోదీ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని తెలిపారు.
నవంబర్లోనే పెట్రోలు, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకం తగ్గించామని నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ ప్రకటిస్తున్నామని చెప్పారు. నవంబర్లో కొన్ని రాష్ట్రాలు ధరను తగ్గించకుండా సామాన్యులపై భారం కొనసాగించాయని తెలిపారు. ఇప్పటికైనా వారు పన్ను తగ్గించాలని సూచించారు. ఏటా రూ.6100 కోట్ల భారం పడుతున్నా గ్యాస్‌పై సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. ప్లాస్టిక్ ఉత్పత్తుల దిగుమతిపై భారత్ ఎక్కువగా ఆధారపడింది. అందుకే ముడి సరుకులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గిస్తున్నామని చెప్పారు. దాంతో తయారైన వస్తువులు, ఉత్పత్తుల ధరలు తగ్గుతాయని వెల్లడించారు. ఐరన్, స్టీల్ రా మెటీరియల్స్ పైనా సుంకం తగ్గిస్తున్నామని ప్రకటించారు. ఎగుమతి చేస్తున్న కొన్ని స్టీల్ ఉత్పత్తులపై ఎక్స్‌పోర్ట్ డ్యూటీ వేస్తామన్నారు.
తగినంత సిమెంటు అందుబాటులోకి వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. లాజిస్టిక్స్‌ను మెరుగుపరిచి సిమెంట్ ధర తగ్గేలా చూస్తామన్నారు. మీడియా సమావేశం ముగిసిన గంటలోనే తాము ప్రకటించిన అంశాల వివరాలతో నోటిఫికేషన్ వస్తుందని ఆమె వెల్లడించారు.