Stock Market Update: ఈ వారం నుంచి Q2 ఆదాయాల సీజన్ ప్రారంభమైంది. నాన్‌ కమొడిటీ కంపెనీలు ఈ త్రైమాసికంలో బాగా పెర్ఫార్మ్‌ చేస్తాయని దేశీయ బ్రోకరేజ్‌ యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. ధరలు పడిపోవడం వల్ల, మెటల్స్‌, ఆయిల్‌ & గ్యాస్‌ రంగాలను డౌన్‌గ్రేడ్‌ చేసింది. ఆటో, కన్జ్యూమర్స్‌, బీఎఫ్‌ఎస్‌ఐ, ఇండస్ట్రియల్స్‌ సెక్టార్స్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. మొత్తంగా నిఫ్టీ50 ఆదాయాలు పెద్దగా పెరగవు, పెద్దగా తగ్గవని లెక్కగట్టింది.


చాలా బ్రోకింగ్‌ కంపెనీలు కూడా నిఫ్టీ ఆదాయాలు ఫ్లాట్‌గా ఉంటాయని అంచనా వేశాయి. అయితే.. బలమైన దేశీయ డిమాండ్ కారణంగా కొన్ని మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు మార్కెట్‌ను ఆశ్చర్యపరిచేంత ఆదాయాలు, లాభాలను ప్రకటించవచ్చని చెబుతున్నాయి. 2022లో ఇప్పటివరకు (YTD) నిఫ్టీ దాదాపు 5% లాభపడగా, నిఫ్టీ మిడ్‌ క్యాప్ సూచీ 9% పైగా ర్యాలీ చేసింది.


హెల్త్‌కేర్ 
Q2లో, హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్ HCG పన్ను తర్వాతి లాభం (PAT) 2,800% పెరిగి రూ.11.6 కోట్లకు చేరుకోవచ్చన్నది ఎడెల్‌వీస్ సెక్యూరిటీస్ అంచనా. ఆంకాలజీ సేవలు, మంచి ఆపరేటింగ్‌ నంబర్లు, ఆర్థిక క్రమశిక్షణ కారణంగా వృద్ధి వేగాన్ని HCG కొనసాగిస్తుందని ఈ బ్రోకరేజ్‌ ఆశిస్తోంది.


స్మాల్‌ క్యాప్ స్టాక్‌ GMDC Q2 PAT ఐదు రెట్లు పెరిగి రూ.201 కోట్లకు చేరుకోవచ్చని కూడా ఈ బ్రోకరేజ్‌ అంచనా వేసింది. ఎబిటా/టన్ను గణాంకం రూ.1,499 స్థాయికి చేరడానికి హయ్యర్‌ రియలైజేషన్ (97% YoY వృద్ధితో రూ.4,227కు) సాయం చేస్తుందని తెలిపింది.


రియల్‌ ఎస్టేట్‌
ఇళ్ల అమ్మకాలు పెరగడం వల్ల, సెప్టెంబర్‌ త్రైమాసికంలో గోద్రెజ్ ప్రాపర్టీస్ (Godrej Properties) నికర లాభం 1,303% జంప్ చేసి రూ.500 కోట్లకు చేరుకుంటుందని ఎడెల్‌వీస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. బ్రిగేడ్ (Brigade) PAT 8 రెట్లు పెరుగుతుందని భావిసోంది. ఇదే రంగంలో ఉన్న సన్‌టెక్‌ ‍(Sunteck) అంచనా లాభం 216% కాగా, శోభ‍‌ (Sobha) విషయంలో ఇది 281%.


స్పెషాలిటీ కెమికల్స్
స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీలు గెలాక్సీ సర్ఫాక్టాంట్స్‌ ‍(Galaxy Surfactants‌), ఫైన్‌ ఆర్గానిక్స్‌ (Fine Organics) ఎడెల్‌వీస్‌ టాప్ పిక్స్‌లో ఉన్నాయి. గెలాక్సీ PAT ఐదు రెట్లు పెరిగి రూ.83.7 కోట్లకు; ఫైన్ ఆర్గానిక్స్ లాభం 3 రెట్ల వృద్ధితో రూ.170.4 కోట్లకు చేరుకోవచ్చని అంచనా.


ఆటో సెక్టార్‌
ఆటో రంగంలోని కంపెనీల్లో.. మదర్సన్ సుమీ సిస్టమ్స్ ‍‌(Motherson Sumi Systems) Q2 లాభం 240% జూమ్‌ అయి రూ.318.4 కోట్లకు చేరుకోవచ్చని బ్రోకరేజ్‌ చెబుతోంది. QoQ ప్రాతిపదికన రాబడి తగ్గినప్పటికీ, ఖర్చు నియంత్రణ మీద కంపెనీ దృష్టి పెట్టడం ఎబిటా ‍(EBITDA) పెరగవచ్చట.


మిడ్‌ క్యాప్ స్టాక్ సోలార్ ఇండస్ట్రీస్ ‍‌(Solar Industries) కూడా ఈ త్రైమాసికంలో తన PATని రెట్టింపు చేసి రూ.161 కోట్లకు చేర్చగలదని అంచనా.


హోటల్స్‌
ఎడెల్‌వీస్ అంచనాల ప్రకారం ఇండియన్ హోటల్స్, లెమన్ ట్రీ లాభాలు 3 రెట్లు జంప్ చేసే అవకాశం ఉంది.


పాలీప్లెక్స్ కార్పొరేషన్ (Polyplex Corporation) PAT కూడా రెండింతలకు పైగా పెరిగి రూ.203 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. ముడి సరుకుల ధరలు తగ్గడం వల్ల, ఈ కంపెనీ రాబడి YoYలో 37%, మార్జిన్లు QoQలో 150 బేసిస్‌ పాయింట్లు పెరుగుతాయని ఎడెల్‌వీస్ సెక్యూరిటీస్ లెక్కలు వేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.