Investors richer by Rs 21 trillion in a month : ఒకవైపు రూపాయి విలువ క్షీణిస్తోందని అంతా గగ్గోలు పెడుతున్నారు! దేశ ఆర్థిక వ్యవస్థకు ఏదో అయిపోతోందని ఆందోళన చెందుతున్నారు! మరోవైపు ఈక్విటీ మార్కెట్లేమో సంపదను మరింత పెంచుతున్నాయి. 2022 జూన్‌లో 52 వారాల కనిష్ఠానికి తగ్గిన సూచీలు ఇప్పుడు పుంజుకున్నాయి. దాంతో నెల రోజుల వ్యవధిలోనే ఇన్వెస్టర్లు రూ.21 లక్షల కోట్లు ఆర్జించారు. రూపాయి బలహీనంగా ఉన్న తరుణంలో ఇలాంటి లాభాలంటే మామూలు విషయం కాదు!


సూచీల రికవరీ


ప్రపంచ మార్కెట్లు ఇప్పుడు రికవరీ బాట పట్టాయి. ముడి చమురు, వంటనూనె ధరల తగ్గుదల, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాలు నెమ్మదించడం, ద్రవ్యోల్బణం అలవాటైపోవడం మార్కెట్లో సానుకూల సెంటిమెంటును పెంచాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, క్యాపిటల్‌ గూడ్స్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఇండస్ట్రియల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, రియాల్టీ, పవర్‌ షేర్ల కొనుగోళ్లు సూచీల మూమెంటమ్‌ను అమాంతం పెంచేశాయి. గత నెల్లో ఈ రంగాల సూచీలన్నీ 10-17 శాతం వరకు ఎగిశాయి. బ్యాంకు సూచీ 9 శాతం లాభంతో తర్వాతి స్థానంలో ఉంది.


నెల రోజుల్లో రూ.21 లక్షల కోట్లు


2022, జూన్‌ 17న బెంచ్‌ మార్క్‌ సూచీలు 52 వారాల కనిష్ఠాన్ని తాకాయి. అప్పట్నుంచే రికవరీ మొదలైంది. హయ్యర్‌ హై, హయ్యర్‌ లో ఫార్మేషన్స్‌ కనిపించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు. కొన్ని రోజుల క్రితం లక్షల కోట్ల సంపదను పోగొట్టుకున్న మదుపర్లు ఇప్పుడు నెలరోజుల్లోనే రూ.21 లక్షల కోట్లను ఆర్జించారు. జూన్‌ 17న రూ.234 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్‌ఈ మార్కెట్‌ విలువ ఇప్పుడు రూ.256 లక్షల కోట్లకు పెరిగింది.



ఎఫ్‌ఐఐలకు పోటీగా డీఐఐలు


'2021 అక్టోబర్‌ నుంచి ఎఫ్‌పీఐ సెల్లింగ్‌ మార్కెట్‌ను దెబ్బతీసింది. ఇప్పటికీ వెనక్కి తీసుకుంటున్నా కొన్ని రంగాల్లో విలువ కనిపించడంతో కొందరు కొనుగోళ్లు మొదలు పెట్టారు' అని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ వీకే విజయ్‌ కుమార్‌ అంటున్నారు. దిద్దుబాటుకు గురైన ఐటీ కంపెనీల షేర్లు ఇప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత నెలలో ఎఫ్‌ఐఐలు రూ.10వేల కోట్ల కన్నా ఎక్కువగా అమ్మకాలు చేపట్టినా డీఐఐలు రూ.8200 కోట్ల కొనుగోళ్లతో మార్కెట్లను స్థిరంగా ఉంచుతున్నారు. 2021, మార్చి నుంచి స్వదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు నెట్‌ బయర్లుగా ఉంటున్న సంగతి తెలిసిందే.


మెరుగవుతున్న పరిస్థితులు


ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, ప్రాంతీయ రాజకీయ అనిశ్చితి తొలగిపోవడం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఆఖరికి చేరుకోవడం వంటివి మార్కెట్ల పెరుగుదలకు సానుకూలత ఇస్తున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఆల్‌ టైం కనిష్ఠానికి క్షీణించినా మిగతా కరెన్సీల కన్నా మెరుగ్గా ఉండటం ధీమానిస్తోంది. పరిస్థితులు మెరుగుపడితే రానురాను మార్కెట్లు మరింత పుంజుకుంటాయి.