Stock Market Closing 15 February 2023: 


స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో ఉదయం సూచీలు ఎరుపెక్కాయి. మధ్యాహ్నం వరకు ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఆఖర్లో మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో గరిష్ఠాలకు చేరాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 86 పాయింట్లు పెరిగి 18,015 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 242 పాయింట్ల లాభంతో 61,275 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు బలహీనపడి రూ.82.80 వద్ద స్థిరపడింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 61,032 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,990 వద్ద మొదలైంది. 60,750 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 61,352 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 242 పాయింట్ల లాభంతో 61,275 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


మంగళవారం 17,929 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,896 వద్ద ఓపెనైంది. 17,853 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,034 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 86 పాయింట్ల లాభంతో 18,015 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ స్వల్పంగా లాభపడింది.  ఉదయం 41,674 వద్ద మొదలైంది. 41,455 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,795 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 82 పాయింట్లు పెరిగి 41,731 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 37 కంపెనీలు లాభాల్లో 13 నష్టపోయాయి. టెక్‌ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్‌, ఐచర్‌ మోటార్స్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు లాభపడ్డాయి. హిందుస్థాన్‌ యునీలివర్‌, సన్‌ ఫార్మా, ఓఎన్‌జీసీ, ఎల్‌టీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా సూచీలు ఎరుపెక్కాయి. ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి. 


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరల్లో ఎక్కువ మార్పేమీ లేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు  రూ.57,160గా ఉంది. కిలో వెండి రూ.450 తగ్గి రూ.69,950 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.660 తగ్గి రూ.24,720 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.