Infosys Shares: ఇవాళ్టి (శుక్రవారం) ఇంట్రా డే ట్రేడ్‌లో, ఇన్ఫోసిస్ షేర్లు BSEలో 5 శాతం ర్యాలీ చేసి రూ.1,494 కి చేరుకున్నాయి. మార్కెట్‌ అంచనాల కంటే మెరుగైన Q2 ఫలితాలను ఈ IT మేజర్ ప్రకటించడంతోపాటు, FY23 అంచనాల కూడా పెంచడంతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. అంతేకాదు, రూ.9,300 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించడం కూడా సెంటిమెంట్‌కు తోడైంది.


బయ్‌ రేటింగ్‌
ఇన్ఫోసిస్‌, తన Q2 పనితీరుతో మార్కెట్‌ను ఆశ్చర్యపరిచిందని బ్రోకింగ్‌ హౌస్‌ జెఫరీస్‌ (Jefferies) చెప్పింది. ఒక్కో షేరుకు రూ.1,700 టార్గెట్ ధరతో 'బయ్‌' రేటింగ్‌ కొనసాగించింది. 


ప్రైస్‌ ట్రెండ్‌
ఫలితాల నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం నుంచి ఇన్ఫోసిస్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. గత మూడు వారాల్లో ఈ స్టాక్‌ 9 శాతం పుంజుకుంది. అయితే, ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FII) అమ్మకాల కారణంగా గత ఆరు నెలల కాలంలో దాదాపు 9 శాతం నష్టపోయింది. ఇదే కాలంలో BSE సెన్సెక్స్‌ 2 శాతం వరకు లాభపడింది. 


గత ఏడాది కాలంలో, సెన్సెక్స్‌లో దాదాపు 6 శాతం విలువను కోల్పోతే, ఈ కౌంటర్ 14 శాతం వరకు నష్టపోయింది. 


Q2 లాభంలో 11% వృద్ధి
సెప్టెంబరు త్రైమాసికంలో, ఇన్ఫోసిస్‌ ఏకీకృత ఆదాయం రూ.36,538 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.29,602 కోట్ల ఆదాయంతో పోలిస్తే, ఇప్పటి ఆదాయం 23.4 శాతం పెరిగింది. ఏకీకృత నికర లాభం రూపంలో రూ.6,021 కోట్లను ఈ కంపెనీ మిగుల్చుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికం లాభం రూ.5,421 కోట్లతో పోలిస్తే ఇది 11 శాతం వృద్ధి. 


బైబ్యాక్‌
ఒక్కో షేరుకు గరిష్టంగా రూ.1850 ధరతో, రూ.9,300 కోట్ల విలువైన షేర్‌ బైబ్యాక్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ గరిష్ట ధర వద్ద 5.02 కోట్ల షేర్లను కంపెనీ కొనుగోలు చేయవచ్చు. BSEలో గురువారం షేరు ముగింపు ధర రూ.1,419.70తో పోలిస్తే, బైబ్యాక్‌ ధర 30 శాతం ఎక్కువ. గత రెండు బైబ్యాక్‌ల తరహాలోనే ఈసారి కూడా ఓపెన్‌ మార్కెట్‌ మార్గాన్నే ఇన్ఫోసిస్‌ ఎంచుకుంది. 


డివిడెండ్‌
ఒక్కో షేరుకు మధ్యంతర డివిడెండుగా రూ.16.50 చెల్లించేందుకు ఇన్ఫోసిస్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేసింది. దీనికోసం రూ.6,940 కోట్లను కంపెనీ కేటాయించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన మధ్యంతర డివిడెండు కంటే ఇది 10 శాతం ఎక్కువ. మధ్యంతర డివిడెండ్ రికార్డు తేదీగా ఈ నెల 28ని, చెల్లింపు తేదీగా నవంబర్ 10ని నిర్ణయించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.