Paytm Shares:
డిజిటల్ చెల్లింపులు, పేమెంట్ బ్యాంకింగ్ కంపెనీ పేటీఎం చాన్నాళ్ల తర్వాత ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. పేరెంట్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ షేర్ల ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఐదు శాతం పెరిగాయి. ఈ వారంలో 24 శాతం గెయిన్ అయి పది నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. దాంతో బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ 'న్యూట్రల్' నుంచి 'బయ్' రేటింగ్ ఇచ్చింది. రెవెన్యూ మూమెంటమ్ జోరు అందుకుందని పేర్కొంది.
శుక్రవారం పేటీఎం షేర్లు (Paytm Shares) రూ.778 వద్ద మొదలయ్యాయి. రూ.809 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు రూ.30 లాభంతో రూ.802 వద్ద కొనసాగుతున్నాయి. చివరి ఐదు ట్రేడింగ్ సెషన్లలో వన్97 కమ్యూనికేషన్ షేర్లు 12 శాతం లాభపడ్డాయి. 2022, ఆగస్టు 22 తర్వాత గరిష్ఠ స్థాయిలో చలిస్తున్నాయి. ఇక ఏడాది ప్రాతిపదికన ఈ షేర్లు 57 శాతం, చివరి ఆరు నెలల్లో 47 శాతానికి పైగా రాణించాయి. 2022, నవంబర్ 24న 52 వారాల కనిష్ఠమైన రూ.439 నుంచి 85 శాతం బౌన్స్ బ్యాక్ అయ్యాయి.
మార్కెట్లో పేటీఎంకు పోటీ పరిమితంగా ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా (Bofa) సెక్యూరిటీస్ అనలిస్టులు అంటున్నారు. ఇందుకే షేర్లు ఇప్పుడు 'స్వీట్ స్పాట్'లో ఉన్నాయని పేర్కొన్నారు. 'దేశంలో చాలా ఫిన్‌టెక్ కంపెనీలు ఫండింగ్ లేక ఇబ్బంది పడుతున్నాయి. ఆర్బీఐ నిబంధనలు కఠినతరం చేయడం, డిస్కౌంట్లు తగ్గించడంతో గత ఆరు నెలలుగా పేటీఎం పోటీదారులు చల్లబడ్డారు. మార్కెట్లో నమోదైన కంపెనీల్లో యూపీఐ లావాదేవీలు, ఓఎన్‌డీసీ ట్రాక్షన్‌తో ప్రయోజనం పొందేది పేటీఎం ఒక్కటే' అని బ్యాంక్ ఆఫ్ అమెరికా తెలిపింది.
వేగం తగ్గినప్పటికీ బీఎన్‌పీఎల్, మర్చంట్ లెండింగ్‌లో పేటీఎం మూమెంటమ్ కొనసాగిస్తోందని బ్యాంక్ ఆఫ్ అమెరికా పేర్కొంది. 2023-26 ఆర్థిక సంవత్సరాల్లో రెవెన్యూ సీఏజీఆర్ 34 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. దాంతో పేటీఎం షేర్లు మరింత పెరుగుతాయని హీలియోస్ క్యాపిటల్ ఫౌండర్, ఫండ్ మేనేజర్ సమీర్ అరోరా అంటున్నారు. ప్రస్తుతం స్టాక్ బుల్ మోడ్‌లో ఉందని, స్ట్రాంగ్ మూమెంటన్ కనిపిస్తోందని అన్నారు. 743-745 లెవల్స్‌లో కఠినమైన నిరోధాన్ని దాటేసిందని త్వరలోనే 840-850 లెవల్స్‌కు చేరుకుంటుందని అంచనా వేశారు. సమీప కాలంలో 880-950 స్థానికి పరీక్షిస్తుందని వెల్లడించారు. చాలామంది అనలిస్టులు 900 వరకు టార్గెట్ ఇస్తున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.