Nifty Record High:
ఇన్వెస్టర్లు ఫుల్ కుష్! ఇండియా ఫుల్ కుష్! భారత స్టాక్ మార్కెట్లు బుధవారం సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చరిత్రలో తొలిసారి 19000 మైలురాయిని దాటేసింది. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న లక్ష్యాన్ని అందుకుంది. మార్కెట్ వర్గాల్లో ఆనందం నింపింది. మరోవైపు బీఎస్‌ఈ సెన్సెక్స్ 64,000 మార్క్‌ను దాటేసింది. వరుసగా మూడు సెషన్లలో సూచీలు ఒక రేంజ్‌లో పెరగడంతో ఇన్వెస్టర్లు మరో రూ.3 లక్షల కోట్ల సంపద ఆర్జించారు.ఈ బుల్ రన్ వెనక కొన్ని కారణాలు ఉన్నాయి.
డెరివేటివ్స్ యాక్టివిటీ
సూచీలు పైస్థాయిలో బ్రేక్‌అవుట్ కావడంతో జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ ముందు ట్రేడర్లు షార్ట్ పొజిషన్లు కవర్ చేసుకున్నారు. ఇది మార్కెట్లో భారీ ర్యాలీకి దారితీసింది. ఇక నిఫ్టీ 50 జులై సిరీస్ సైతం మూడు నెలల సగటు మీదే ఉన్నాయి. ఇన్వెస్టర్లు లాంగ్ పొజిషన్లు తీసుకున్నారు. నిఫ్టీ 50 రోల్‌ఓవర్స్ ఎక్కువగా ఉండగా నిఫ్టీ బ్యాంకు డెరివేటివ్స్ సిరీస్ తక్కువగా ఉన్నాయి.
ఎఫ్ఐఐల పెట్టుబడి
మార్కెట్ ఈ మధ్య బాగా ర్యాలీ చేయడానికి మరో కారణం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం. భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతానికి పైగా దూసుకెళ్లడం, స్థానిక వ్యాపారాలు మెరుగ్గా ఉండటం, ప్రపంచ వ్యాప్తంగా మందగమనం ఉండటంతో ఎఫ్‌ఐఐలు భారత్ వైపు చూస్తున్నారు. కేవలం జూన్ నెలలోనే మూడు బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టారు. చివరి నాలుగు నెలల్లో 11 బిలియన్ డాలర్లుకు పైగా ఇన్వెస్ట్ చేశారు. 2020లో చేసిన మొత్తం ఇన్వెస్ట్‌మెంట్‌లో ఇది సగం.
కురుస్తున్న వర్షాలు
రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో జూన్ ఆరంభంలో సూచీలు కన్సాలిడేట్ అయ్యాయి. ఎప్పుడైతే వర్షాలు కురవడం మొదలైందో మదుపర్లలో సానుకూల సెంటిమెంట్ పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 11.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ సగటు 7.5 మి.మీ. కన్నా ఇదెంతో ఎక్కువ కావడం విశేషం. వర్షాలు కురిసి పంటలు పండితేనే చాలా రంగాలకు మేలు జరుగుతుంది. మ్యాక్రో ఎకానమీ మెరుగవుతుంది. ఎప్పట్లాగే సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలియడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడుతున్నారు.
పెద్ద కంపెనీల ర్యాలీ
నిఫ్టీ50 సూచీ దేశంలోని 50 అతిపెద్ద కంపెనీలను ప్రతిబింబిస్తుంది. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్సీ బ్యాంకులకు ఎక్కువ వాటా ఉంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీ, మెటల్స్, కన్జూమర్ డ్యురబుల్స్ రంగాల కంపెనీల్లో పెట్టుబడులు పెరగడంతో సూచీ పరుగులు పెట్టింది.
అదానీ పరుగు!
కొన్నేళ్లుగా అదానీ కంపెనీల షేర్లు నిఫ్టీ కదలికకు ప్రాణంగా మారాయి. హిండెన్‌బర్గ్ సుడిగుండం తర్వాత అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో జీక్యూజీ పార్ట్‌నర్స్ పెట్టుబడులు పెట్టడంతో ఆయా కంపెనీల షేర్లు మళ్లీ పెరగడం మొదలుపెట్టాయి. మదుపర్లలో ఇది సానుకూల సెంటిమెంటుకు దారితీసింది. అమెరికా, చైనా మార్కెట్లూ మెరుగవుతుండటం, ఐరోపా కంపెనీ ఈక్విటీలు పెరుగుతుండటం మన సూచీలకు బూస్ట్‌గా మారింది.