Mahindra & Mahindra Financial Shares: మహీంద్ర & మహీంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ (M & M Financial Services) షేర్లు ఇవాళ్టి (శుక్రవారం) ఇంట్రా డే ట్రేడ్‌లో ఘోరంగా దెబ్బతిన్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొట్టిన దెబ్బకు ఈ కంపెనీ మైండ్‌ బ్లాంక్‌ అయిందనే చెప్పాలి.


ఇవాళ్టి ట్రేడ్‌లో ఈ కౌంటర్‌ 14 శాతం నష్టపోయి రూ.192కు చేరింది. మధ్యాహ్నం 2.10 గంటల సమయం వరకు ఇదే ఇవాళ్టి గరిష్ట పతనం, కనిష్ట స్థాయి.


ఎందుకు ఈ భారీ పతనం?
పేరుకు తగ్గట్లుగా, వాహనాల కొనుగోలు కోసం అప్పులిచ్చే వ్యాపారాన్ని ఈ కంపెనీ చేస్తోంది. ఆ అప్పుల్ని, వడ్డీతో సహా వసూలు చేసే బాధ్యతను ఒక థర్డ్‌ పార్టీ ఏజెన్సీలకు అప్పగించింది. ఒక రికవరీ ఏజెంట్‌ వేధింపుల వల్ల, గత వారం, ఝార్ఖండ్‌ హజారీభాగ్‌ జిల్లాలో ఒక గర్భిణీ ట్రాక్టర్‌ కింద పడి మృతి చెందింది. ఈ నేపథ్యంలో, మహీంద్ర & మహీంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద ఆర్‌బీఐ కన్నెర్ర చేసింది. రుణాల రికవరీ కోసం థర్డ్‌ పార్టీ ఏజెంట్లను వినియోగించడాన్ని ఆపేయమంటూ ఆదేశం జారీ చేసింది. ఈ ఆజ్ఞ తక్షణమే అమల్లోకి వస్తుందని, థర్డ్‌ పార్టీ ఏజెంట్ల ద్వారా రికవరీల మీద మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే, సొంత ఉద్యోగుల ద్వారా రికవరీ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని వెసులుబాటు ఇచ్చింది. గర్భిణి మృతికి కారణమైన థర్డ్‌ పార్టీ రికవరీ ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్‌బీఐ ఆదేశాల నేపథ్యంలో, ఇవాళ ఈ స్టాక్‌ ఫేట్‌ పెటాకులైంది.


మధ్యాహ్నం 2:10 గంటల సమయానికి ఈ స్టాక్ 12.90 శాతం తగ్గి, ఒక్కో షేరు రూ. 194.85 వద్ద ట్రేడవుతోంది. ఆ సమయానికి NSE, BSEలో కలిపి 3.7 కోట్ల షేర్లు చేతులు మారాయి.


ఇదిలా ఉండగా, థర్డ్ పార్టీ ఏజెన్సీలు, సొంత ఉద్యోగుల ద్వారా నెలకు 4,000 నుంచి 5,000 వాహనాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. RBI ఆదేశాలను తక్షణమే అమలు చేయడం వల్ల, ఈ సంఖ్య తాత్కాలికంగా నెలకు 3,000 నుంచి 4,000 వరకు తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.


నెగెటివ్‌ సెంటిమెంట్‌
దీన్ని బట్టి, కంపెనీ రికవరీ ప్రక్రియ సమీప కాలంలో ప్రభావితం అవుతుందని, పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ నెగెటివ్‌ డైరెక్షన్‌లోకి మారుతుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లోని విశ్లేషకులు (ICICI Securities) భావిస్తున్నారు.


మహీంద్ర & మహీంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. తన వెహికల్ ఫైనాన్స్ వ్యాపారంలో రికవరీ కార్యకలాపాలను ఏ థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అవుట్‌సోర్స్ చేయలేదని, అందువల్ల ఈ వ్యాపారంలో కలెక్షన్ల మీద ఎలాంటి ప్రభావం ఉండదని ఆశిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.


ఇవాళ బాగా నష్టపోయినప్పటికీ, ఇప్పటికీ ఇది లాభాల స్టాకే. గత ఆరు నెలల కాలంలో 25 శాతం పెరిగిన M&M ఫైనాన్షియల్, ఓవరాల్‌ మార్కెట్‌ను అధిగమించింది. ఇదే కాలంలో నిఫ్టీ50 కేవలం ఒక్క శాతం పెరిగింది. 


ఈ నెల 15వ తేదీన రూ.235 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని ఈ షేరు తాకింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.