Loan Against Mutual Funds: 


అర్జెంటుగా డబ్బు అవసరం పడింది! బ్యాంకు అకౌంట్లోనేమో చిల్లిగవ్వలేదు! అలాంటప్పుడు మనందరికీ తట్టే ఆలోచన ఒక్కటే! తెలిసిన వాళ్లను బదులు అడగడం. ఎవ్వరూ ఇవ్వకపోతే బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థల్లో అధిక వడ్డీకి లోన్లు తీసుకోవడం! దీన్నించి తప్పించుకోవడానికి మరో మార్గం ఉంది. అదే మ్యూచువల్‌ ఫండ్‌ను తనఖా పెట్టి రుణం తీసుకోవడం. అతి తక్కువ వడ్డీతో పాటు నెలసరి వాయిదాల బాధ లేకపోవడం వీటి స్పెషల్‌!!


స్వల్ప కాలానికి బెస్ట్‌


ప్రస్తుతం దేశంలో మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Fund) ఇండస్ట్రీ మంచి వృద్ధి రేటుతో పయనిస్తోంది. ఉద్యోగులు, వ్యక్తులు, కుటుంబాలు వివిధ ఫండ్లలో పెట్టుబడి పెట్టడమే కారణం. ఇందులో క్రమానుగత పెట్టుబడి విధానం (SIP) అనుసరిస్తున్న వాళ్లే ఎక్కువ. స్వల్ప కాలంలో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ సుదీర్ఘ కాలంలో ఫండ్లు 15-30 శాతం వరకు రిటర్న్‌ అందిస్తాయి. అందుకే మీకు స్వల్ప కాలంలో నగదు అవసరం ఏర్పడినప్పుడు మ్యూచువల్‌ ఫండ్‌ను తనఖా పెట్టి రుణం తీసుకోవడం మంచిది.


తక్కువ వడ్డీ


మ్యూచువల్‌ ఫండ్‌పై రుణాలు (Loan against MF) ఇచ్చేందుకు ఎన్‌బీఎఫ్‌సీలు పోటీ పడుతున్నాయి. బ్యాంకులు వెనకాముందు ఆడినా బ్యాంకింగేతర కంపెనీలు మాత్రం అగ్రెసివ్‌గా మార్కెటింగ్‌ చేస్తున్నాయి. ఫండ్లను కొలాట్రల్‌గా పెట్టుకొని 12 నెలల కాల పరిమితితో రుణాలు మంజూరు చేస్తున్నాయి. సాధారణంగా బంగారం పెట్టి రుణం తీసుకుంటే 9-20 శాతం వరకు వడ్డీ (Interest Rate) చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తిగత రుణాలైతే 9-18 శాతం వరకు ఇంట్రెస్ట్‌ తప్పదు. అదే మ్యూచువల్‌ ఫండ్‌పై తీసుకుంటే 9-10 శాతమే వడ్డీ వసూలు చేస్తున్నారు. పైగా నెలసరి వాయిదాల బెడద లేదు. 12 నెలల వ్యవధిలో ఎప్పుడు డబ్బులు చేతికొచ్చినా వెంటనే కట్టేసి రుణం నుంచి బయటపడొచ్చు. ప్రీక్లోజర్‌ పెనాల్టీలేమీ ఉండవు.


ఫండ్‌లో సగం వరకే


మీ మ్యూచువల్‌ ఫండ్‌ రకాన్ని బట్టి ఇచ్చే రుణం మారుతుంది. ఉదాహరణకు హైబ్రీడ్‌, ఈక్విటీ ఫండ్లు తనఖా పెడితే ఆ విలువలో 50 శాతం మేరకే రుణం మంజూరు చేస్తారు. డెట్‌ ఫండ్లు అయితే 80 శాతం వరకు ఇస్తున్నారు. ఉదాహరణకు హైబ్రీడ్‌ ఫండ్‌పై కనీసం రూ.10,000 నుంచి మొదలవుతుంది. గరిష్ఠంగా 20 లక్షల వరకే ఇస్తారు. డెట్‌ ఫండ్లపై మాత్రం రూ.5 కోట్ల వరకు మంజూరు చేస్తారు. 12 నెలల తర్వాత అవసరమైతే రుణాన్ని రెనివల్‌ చేసుకోవచ్చు. స్వల్ప కాల నగదుకు ఇవి చక్కని పరిష్కారంగా ఉన్నాయి. పైగా డబ్బు కోసం ఎంఎఫ్ యూనిట్లు అమ్మాల్సిన పన్లేదు. షార్ట్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ చెల్లించాల్సిన అవసరం లేదు.


జాగ్రత్తలు తప్పవు!


మ్యూచువల్‌ ఫండ్లపై రుణం తీసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. స్టాక్‌ మార్కెట్లలో ఒడుదొడుకులు అత్యంత సహజం. అలాంటప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్‌ విలువ హెచ్చు తగ్గులకు లోనవుతుంది. ఒకవేళ మీరు తనఖా పెట్టాక ఫండ్‌ విలువ తగ్గితే ఆ మేరకు డబ్బులు చెల్లించాల్సిందిగా బ్యాంకులు మిమ్మల్ని కోరతాయి. మరోవైపు ఫండ్‌ మేనేజర్లు యూనిట్లు అమ్మేందుకు ఇష్టపడరు. వారు అనవసరంగా రుణాలు తీసుకోవాలని బలవంతం చేస్తే మీరు వెంటనే అప్రమత్తం అవ్వాలి.


Also Read: ఐటీ నోటీసు వచ్చిందని వణికిపోవద్దు! ముందు ఈ పని చేయండి!