Rs 250 SIP In Mutual Funds: మన దేశంలో 140 కోట్ల జనాభా ఉంటే, కనీసం 10 కోట్ల మంది కూడా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం లేదన్నది ఒక అంచనా. ఈ విషయంలో, అభివృద్ధి చెందిన మార్కెట్లతో పోలిస్తే ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ చాలా వెనుకబడి ఉంది. అదే సమయంలో, మార్కెట్‌ ఎదగడానికి చాలా ఎక్కువ అవకాశం కూడా ఉంది.


స్టాక్‌ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ (SEBI), స్టాక్‌ మార్కెట్‌ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని అనుకుంటోంది. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే కంటే, రిస్క్‌ తక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో (MFs) పెట్టుబడులు పెట్టేలా సాధారణ ప్రజలను ప్రోత్సహించాలని భావిస్తోంది. ఇందుకోసం మ్యూచువల్ ఫండ్స్‌లో కనీస పెట్టుబడి పరిమితిని రూ.250కి తగ్గించాలని సెబీ ఒక ప్లాన్‌ రెడీ చేసింది. ఇది అమల్లోకి వస్తే, మ్యూచువల్‌ ఫండ్స్‌ వైపు ఎక్కువ మందిని ఆకర్షించవచ్చు. చాలా చిన్న పెట్టుబడిదారు కూడా ప్రతి నెల SIP (Systematic Investment Plan) ద్వారా పెట్టుబడిని సులభంగా ప్రారంభించవచ్చు. సెబీ ఛైర్‌పర్సన్ మధబి పురి బుచ్ ‍‌(Madhabi Puri Buch), ఇటీవల ఒక కార్యక్రమంలో ఈ ప్లాన్‌ గురించి వెల్లడించారు.


మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ విలువ దాదాపు రూ.50 ట్రిలియన్లు (AUM of Mutual Fund Industry)
మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ విలువ ఇప్పుడు రూ.49 లక్షల కోట్లు దాటింది, రూ.50 లక్షల కోట్ల మార్క్‌ వైపు వేగంగా వెళుతోంది. ఈ తరుణంలో సెబీ చీఫ్ ఈ ప్రకటన చేశారు. కొత్త ప్రణాళికను అమలు చేస్తే, ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌ను అది పరుగులు పెట్టిస్తుంది. అందువల్ల, రూ.250 SIP అవకాశాన్ని అమలు చేసే ఏ ఒక్క అవకాశాన్ని సెబీ వదిలిపెట్టాలని అనకోవడం లేదు. మ్యూచువల్ ఫండ్స్‌ను నడుపుతున్న కంపెనీలతోనూ సెబీ మాట్లాడుతోంది. ఈ SIP ప్లాన్‌ను ఉనికిలోకి తెచ్చేందుకు అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సెబీ సిద్ధంగా ఉందని పురి ప్రకటించారు.


ప్రస్తుతం రూ.500 నుంచి ప్రారంభం (Minimum Investment Limit in Mutual Funds/SIP) 
ప్రస్తుతం కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో కనీసం రూ. 100 పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. కానీ, వాటిలో చాలా తక్కువ ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ పద్ధతి పాపులర్ కాలేదు. ప్రస్తుతం, అతి తక్కువ SIP రూ.500. అన్నీ అనుకూలిస్తే, త్వరలోనే రూ.250 సిప్‌ చూడవచ్చు. ఇది కాకుండా, కొత్త అసెట్‌ క్లాస్‌ను సెబీ సృష్టించబోతోంది. అధిక రిస్క్ తీసుకునే పెట్టుబడిదార్లకు ఇందులో అవకాశం లభిస్తుంది.


నవంబర్‌లో రికార్డ్‌ స్థాయికి SIP పెట్టుబడులు
తాజా నివేదిక ప్రకారం, SIP ద్వారా వచ్చిన పెట్టుబడులు 2023 నవంబర్‌లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తొలిసారిగా, సిప్ ద్వారా రూ.17,000 కోట్లకు పైగా డబ్బు మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చింది. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు సిప్‌ పద్ధతిని ఎక్కువ మంది పెట్టుబడిదార్లు ఇష్టపడుతున్నారు. నవంబర్‌లో 14.1 లక్షల కొత్త ఖాతాలు తెరవడంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య 7.44 కోట్లకు పెరిగింది, ఇది చరిత్రాత్మక స్థాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.