IndusInd Bank Q2 Results: 2022 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (Q2FY23), ప్రైవేట్ రంగ లెండర్ ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఏకీకృత నికర లాభం 57 శాతం పెరిగి రూ. 1,805.22 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ. 1,146.67 కోట్ల లాభాన్ని ప్రకటించింది. 


2022-23 జులై-సెప్టెంబర్ కాలంలో మొత్తం ఆదాయం రూ. 10,719.20 కోట్లకు పెరిగిందని, 2021-22 అదే కాలంలో రూ. 9,791.65 కోట్లుగా ఉందని ఇండస్ఇండ్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.


వడ్డీ ఆదాయం ‍‌(Interest income) గత ఏడాదిలోని రూ. 7,650 కోట్ల నుంచి 14 శాతం పెరిగి రూ. 8,708 కోట్లకు చేరింది. ఇతర వనరుల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 1,841 కోట్ల నుంచి రూ. 2,011 కోట్లకు పెరిగింది.


ఈ ఏకీకృత ఆదాయాల్లో.. అనుబంధ సంస్థ భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్‌ (Bharat Financial Inclusion Ltd) నంబర్లు, అసోసియేట్ కంపెనీ ఇండస్ఇండ్ మార్కెటింగ్ &ఫైనాన్షియల్ సర్వీసెస్ ‍‌(IndusInd Marketing and Financial Services) నంబర్లు కూడా ఉన్నాయి.


స్టాండలోన్‌ బేసిస్‌
స్వతంత్ర ప్రాతిపదికన (Standalone basis)... గత ఏడాది జులై- సెప్టెంబరు కాలంలో రూ. 1113.53 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్‌ ఆర్జించగా, ఈ ఏడాది 60.5 శాతం పెంచుకుని రూ. 1786.72 కోట్లను సాధించింది. ఆదాయం రూ. 9,491.15 కోట్ల నుంచి రూ. 10,718.85 కోట్లకు చేరింది. 


అసెట్‌ క్వాలిటీ
సెప్టెంబర్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ ఆస్తుల నాణ్యత మెరుగు పడింది. స్థూల నిరర్థక ఆస్తులు (GNPAs) Q2FY21లోని 2.77 శాతం నుంచి ఇప్పుడు 2.11 శాతానికి తగ్గాయి. నికర నిరర్ధక ఆస్తులు (NNPAs) కూడా ఇదే విధంగా 0.80 శాతం నుంచి 0.61 శాతానికి తగ్గాయి. దీంతో, మొండి బకాయిల (Bad loans) కోసం చేసే కేటాయింపులు ‍‌(Provisions), ఆకస్మిక నిధిని (Contingencies) కూడా బ్యాంక్‌ తగ్గించింది. ఈ మొత్తం, గతేడాదిలోని రూ. 1707 కోట్ల నుంచి ఈసారి రూ. 1141 కోట్లకు పరిమితమైంది. 


షేరు ధర
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్ షేరు ధర బుధవారం BSEలో 0.40 తగ్గి రూ. 1,218.35 వద్ద ముగిసింది. గురువారం రూ. 1,214 వద్ద ఓపెన్‌ అయింది.


ALSO READ: క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు కట్టాల్సిన తేదీ దాటిందా? RBI కొత్త రూల్‌తో నో వర్రీస్‌!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.