Income Tax on Diwali Gift: మన దేశంలోని అతి పెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి సమయంలో ఏదోక రూపంలో బహుమతులు ఇవ్వడం, తీసుకోవడం జరుగుతుంటుంది. బంధుమిత్రుల దగ్గర్నుంచి మిఠాయిలు మొదలుకుని స్థిర, చరాస్థుల వరకు ఎవరి తాహతుకు తగ్గట్లు వాళ్లు గిఫ్ట్‌లు పొందుతారు, తిరిగి ఇస్తారు. కొన్ని సంస్థల ఉద్యోగస్తులు తమ యాజమాన్యాల నుంచి ఏటా దీపావళి కానుకలు అందుకుంటుంటారు.
అయితే, కొన్ని ఖరీదైన బహుమతుల మీద పన్ను ప్రభావం ఉంటుందని చాలా మందికి తెలీదు. గిఫ్ట్ విషయంలో సరిగా రిపోర్ట్ చేయకపోతే ఆదాయ పన్ను శాఖ ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న బహుమతులను "ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం"గా పరిగణించి, స్లాబ్ రేటు ప్రకారం పన్ను విధిస్తారు.
ఎంత మొత్తానికి పన్ను కట్టాలి?
ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న బహుమతుల మొత్తం విలువ 50 వేల రూపాయలు దాటితే పన్ను చెల్లించాల్సిందేనని ఐటీ అధికారులు చెబుతున్నారు.
మినహాయింపులు ఉన్నాయా?
దీపావళి సందర్భంగా తీసుకునే అన్ని కానుకల మీదా పన్ను మోత ఉండదు. కొన్ని రకాల గిఫ్ట్స్‌ను మాత్రమే టాక్స్ పరిధిలోకి తెచ్చారు. దీపావళి బహుమతి రూపంలో అందే నగదు, చరాస్తులు, స్థిరాస్తులకు పన్ను కట్టాలి. కానుకగా తీసుకున్న నగలు, షేర్లు, సెక్యూరిటీలు, పురాతన వస్తువులు, పెయింటింగ్స్, శిల్పాలు వంటివి కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. క్రిప్టో అసెట్స్, NFTs సహా వర్చువల్ డిజిటల్ అసెట్స్ మీద కూడా ఆదాయ పన్ను కట్టాలి. ఈ లిస్ట్‌లో లేని ఏ ఇతర కానుకలపైనా ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. మన లాంటి సామాన్యులకు పేద్ద బహుమతులేవీ రావు కాబట్టి, మనమంతా హ్యాపీస్.
ఎవరి నుంచి తీసుకున్నా పన్ను కట్టాల్సిందేనా?
ఈ విషయంలోనూ ఆదాయ పన్ను చట్టం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అత్యంత సమీప బంధువుల నుంచి అందే గిఫ్ట్స్‌కు మినహాయింపు ఉంటుంది. అత్యంత సమీప బంధువులు అంటే ఎవరో కూడా సెక్షన్ 56(2)లో సూచించారు. ఈ లిస్ట్‌లో ఉన్నవాళ్ల దగ్గరి నుంచి ఎంత విలువైన దీపావళి బహుమతి అందుకున్నా, మీరు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అత్యంత సమీప బంధువుల లిస్ట్‌లో ఉన్నవాళ్లు.. భార్య/భర్త; తల్లిదండ్రులు; సోదరి/సోదరుడు; జీవిత భాగస్వామి సోదరి/సోదరుడు; సోదరి/సోదరుడి జీవిత భాగస్వామి; తల్లిదండ్రుల సోదరుడు/సోదరి; తాతయ్య/నాన్మమ్మ/అమ్మమ్మ.
ఈ లిస్ట్‌లో లేని ఎవరి నుంచైనా మీరు బహుమతి/బహుమతులు అందుకుంటే, ఒక ఆర్థిక సంవత్సరంలో వాటి మొత్తం విలువ రూ.50 దాటితే, ఆ బహుమతుల మొత్తంపై ఆదాయ పన్ను కట్టాల్సి ఉంటుంది.
ఉద్యోగస్తుల మాటేమిటి?
కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు దీపావళి బోనస్ కాకుండా ప్రత్యేక బహుమతులు ఇస్తుంటాయి. కొన్ని కంపెనీలు తమ సిబ్బందికి ఖరీదైన వాచ్‌లు, నగలు, కార్లు, ఫ్లాట్లు గిఫ్ట్‌గా ఇచ్చిన సంఘటనలూ మనకు తెలుసు. ఇలా ఒక కంపెనీ నుంచి అందే బహుమతుల మొత్తం విలువ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేలు దాటితే, అది పన్ను పరిధిలోకి వస్తుంది.