HDFC Bank Q2 Results: బ్యాంకింగ్ సెక్టార్ జెయింట్ HDFC బ్యాంక్, ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (Q2FY23) బలమైన నికర లాభాన్ని ప్రకటించింది. ఆదాయం విషయంలోనూ ఆరోగ్యకరమైన తీరును ప్రదర్శించింది. రుణాలలో బలమైన వృద్ధి, ఆస్తుల నాణ్యత మెరుగుదల కారణంగా బాటమ్‌లైన్‌లో (నికర లాభం) రెండంకెల వృద్ధి సాధ్యమైంది.
ఈ ప్రైవేట్ లెండర్ Q2FY23 ఫలితాల్లో గమనించాల్సిన 5 కీలక హైలైట్స్ ఇవి:
1. బలమైన నికర లాభం
2022-23 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో, బ్యాంక్ పన్ను తర్వాతి లాభం (PAT) 20.1 శాతం పెరిగి రూ.10,605.8 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.8,834.3 కోట్లుగా ఉంది.
రెండో త్రైమాసికంలో నికర లాభం 16 శాతం పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. బ్యాంక్ సాధించిన లాభ వృద్ధి ఈ అంచనాల కంటే ఎక్కువగా ఉంది.
"ఆర్జించిన వడ్డీ - చెల్లించిన వడ్డీ" మధ్య వ్యత్యాసం లేదా నికర వడ్డీ ఆదాయం (NII) గత ఏడాదిలోని రూ.17,684.4 కోట్ల నుంచి సమీక్ష కాల త్రైమాసికంలో దాదాపు 19 శాతం పెరిగి రూ. 21,021.2 కోట్లకు చేరుకుంది.
ఈ త్రైమాసికానికి 17 శాతం (YoY) NII వృద్ధిని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది. ఈ అంచనాలను కూడా బ్యాంక్ బీట్ చేసింది.
2. బలమైన క్రెడిట్ వృద్ధి
2022 సెప్టెంబర్ 30 నాటికి HDFC బ్యాంక్ ఇచ్చిన మొత్తం అడ్వాన్సులు రూ.14.4 లక్షల కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే 23.4 శాతం పెరిగింది. బ్యాలెన్స్ షీట్ మొత్తం పరిమాణం రూ.22.3 లక్షల కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.18.4 లక్షల కోట్లుగా ఉంది, దాదాపు 21 శాతం వృద్ధిని నమోదు చేసింది.
అన్ని రుణ సెగ్మెంట్‌లలో పురోగతి కనిపించింది. దేశీయ రిటైల్ రుణాలు 21.4 శాతం, వాణిజ్య & గ్రామీణ బ్యాంకింగ్ రుణాలు 31.3 శాతం, కార్పొరేట్ & ఇతర హోల్‌సేల్ లోన్స్ 27 శాతం పెరిగాయి. మొత్తం అడ్వాన్సుల్లో ఓవర్సీస్ వాటా 3.1 శాతంగా లెక్క తేలింది.
3. అప్‌బీట్ డిపాజిట్ గ్రోత్
మొత్తం డిపాజిట్లు ఆరోగ్యకరమైన వృద్ధిని కనబరిచి సెప్టెంబర్ చివరి నాటికి రూ.16.73 లక్షల కోట్లకు చేరాయి. గత సంవత్సరం కంటే ఇది 19 శాతం వృద్ధి. మిగిలిన బ్యాంకులు డిపాజిట్లను సమీకరించడానికి కష్టపడుతున్న సమయంలో ఈ లెండర్ డిపాజిట్లలో పెరుగుదలను సాధించింది.
"కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్" (CASA -కాసా) డిపాజిట్స్ 15.4 శాతం పెరిగాయి. పొదుపు ఖాతా డిపాజిట్ల మొత్తం రూ.5.30 లక్షల కోట్లకు, కరెంట్ ఖాతా డిపాజిట్ల మొత్తం రూ.2.3 లక్షల కోట్లకు చేరింది.
4. మెరుగైన ఆస్తి నాణ్యత
రుణదాత ఆస్తి నాణ్యత కూడా బాగా మెరుగుపడింది. గ్రాస్ అడ్వాన్సుల్లో స్థూల నిరర్ధక ఆస్తుల (GNPAs) వాటా 2021 సెప్టెంబర్ 30 నాటికి 1.35 శాతంగా ఉండగా.. 2022 సెప్టెంబర్ 30 నాటికి 1.23 శాతానికి దిగి వచ్చాయి. అంటే, మొండి బాకీలు భారీగా తగ్గాయి. ఈ త్రైమాసికంలో, నికర అడ్వాన్స్‌ల్లో నికర నిరర్థక ఆస్తులు (NNPAs) 0.33 శాతంగా ఉన్నాయి.
బ్యాడ్ లోన్స్ కోసం చేసే కేటాయింపులు (Provisions), ఆకస్మిక మొత్తాలు (Contingencies) కూడా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలోని రూ.3,924.7 కోట్ల నుంచి ఇప్పుడు రూ.3,240.1 కోట్లకు పడిపోయాయి.
5. ఆరోగ్యకరమైన మూలధన నిష్పత్తులు
బాసెల్ III మార్గదర్శకాల ప్రకారం క్యాపిటల్ అడిక్వసీ రేషియో (CAR) 18 శాతంగా ఉండాలన్న నిబంధన ఉంది. సెప్టెంబర్ చివరి నాటికి HDFC బ్యాంక్ CAR చాలా మెరుగ్గా 11.7 శాతానికి చేరింది. టైర్ 1 CAR గతేడాది 18.7 శాతంతో పోలిస్తే 17.1 శాతంగా ఉంది. కామన్ ఈక్విటీ టైర్ 1 క్యాపిటల్ రేషియో 16.3 శాతంగా ఉంది. రిస్క్‌లో ఉన్న ఆస్తులు రూ.14.78 లక్షల కోట్లు.
శుక్రవారం సెషన్‌లో 3.76% లాభపడిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు ధర రూ.1,446 వద్ద ముగిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.