BLS International Services Shares: ప్రముఖ ఇన్వెస్టర్‌ శంకర్‌ శర్మ NSEలో ట్రేడ్‌ అవుతున్న ఒక మల్టీ బ్యాగర్‌ స్టాక్‌లో శుక్రవారం భారీ షాపింగ్ చేశారు. 


NSE బల్క్ డీల్స్ డేటా ప్రకారం... బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్‌లో (BLS International Services) వాటాను కొనుగోలు చేశారు.


బల్క్ డీల్ ద్వారా, కంపెనీకి చెందిన 11.5 లక్షల షేర్లను ఈ మార్కెట్ వెటరన్ కొన్నారు. సగటున ఒక్కో షేరు ధర రూ.275 చొప్పున కొనుగోలు చేశారు. అంతకుముందు  రోజు (గురువారం) ముగింపు ధర రూ. 285.05 తో పోలిస్తే, ఒక్కో షేరుకు 10.05 రూపాయల డిస్కౌంట్‌తో ఈ 11.5 లక్షల షేర్లను దక్కించుకున్నారు. 


శుక్రవారం ఈ స్క్రిప్‌ 1.39 శాతం లేదా రూ. 3.95 లాభంతో రూ.289 వద్ద సెటిలైంది. 


ప్రతి త్రైమాసికం ముగింపు తర్వాత, ఆ త్రైమాసికంలో ఆ కంపెనీలో 1 శాతం కన్నా ఎక్కువ వాటా హోల్డ్‌ చేస్తున్న అందరు ఇన్వెస్టర్ల పేర్లతో ఒక జాబితాను కంపెనీ ప్రకటిస్తుంది. NSE డేటా ప్రకారం.. జూన్ త్రైమాసికం ముగింపు నాటికి బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్‌ షేర్‌హోల్డర్ల లిస్ట్‌లో శంకర్ శర్మ పేరు లేదు. అంటే, జూన్‌ త్రైమాసికం ముగింపు నాటికి ఆయనకు ఈ కంపెనీలో ఒక్క షేరు కూడా లేకుండా ఉండాలి, లేదా 1 శాతం కంటే తక్కువ వాటా కలిగి ఉండాలి. జూన్‌ త్రైమాసికం ముగింపు నాటికి శంకర్‌ శర్మకు ఈ కంపెనీలో షేర్లు లేకపోతే, ప్రస్తుత కొనుగోలు ఫ్రెష్‌ బయ్‌ అవుతుంది. లేదా, 1 శాతం కంటే తక్కువ స్టేక్‌ ఉండివుంటే, సెప్టెంబర్‌ త్రైమాసికంలో తన వాటాను గణనీయంగా పెంచుకున్నట్లు అవుతుంది.
ట్రెండ్‌లైన్ (Trendlyne) డేటా ప్రకారం, శంకర్ శర్మ పోర్ట్‌ఫోలియోలో ఏడు స్టాక్స్‌ ఉన్నాయి. వాటి విలువ సుమారు 117.1 కోట్ల రూపాయలు. ఈ 7 పేర్లలో బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్‌ కూడా ఒకటి.


కంపెనీ బిజినెస్‌
దిల్లీ కేంద్రంగా ఈ కంపెనీ పని చేస్తోంది. మన దేశంలో ఆన్‌లైన్ వీసా దరఖాస్తు కేంద్రాన్ని నిర్వహిస్తోంది. వ్యక్తులు, విద్యార్థులు, కుటుంబాలకు వీసా కన్సల్టెన్సీ సేవలను అందిస్తోంది.


మల్టీ బ్యాగర్‌ స్టాక్
బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్‌ ఒక మల్టీ బ్యాగర్‌ స్టాక్‌. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రెండు రెట్లకు పైగా పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలోని దాదాపు 95 రూపాయల స్థాయి నుంచి పెరిగి శుక్రవారం ట్రేడింగ్ ముగింపు నాటికి 289 రూపాయలకు చేరింది. మార్కెట్‌లోని ఒడిదొడుకులను లెక్క చేయకుండా, ఈ కాలంలో రూ.194 లేదా 205 శాతం పెరిగింది.


గత నెల రోజుల్లో రూ.6.35 లేదా 2.25 శాతం; గత ఆరు నెలల కాలంలో రూ. 124.20  లేదా 75.36 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో చూస్తే.. రూ. 171.12 లేదా 145.16 శాతం పరుగులు తీసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.