Foreign Portfolio Investors: ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) సెక్టార్ నెత్తిన సుత్తి దెబ్బలు పడుతూనే ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్నాంలే అన్న ఆనందం ఈ రంగానికి లేకుండా పోయింది. పెరిగిన ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లతో అమెరికా నుంచి వచ్చే ఐటీ ప్రాజెక్టులు తగ్గిపోతున్నాయి. ఆర్థిక మాంద్యం రూపంలో దాడికి మరో భూతం రెడీ ఉంది. గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture), తన (సెప్టెంబర్-నవంబర్) త్రైమాసికానికి ఆదాయ అంచనాలను తగ్గించి మిగిలిన ఐటీ కంపెనీల్లోనూ గుబులు రేపింది. ఇప్పుడు, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) కూడా ఐటీ సెక్టార్‌కు గుదిబండగా మారారు.
అమెరికాలో మాంద్యం భయం, ఐరోపాలో వృద్ధి మందగించే ప్రమాదం నేపథ్యంలో విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఐటీ రంగానికి ఎక్స్‌పోజర్ తగ్గించారు. అంటే, ఈ రంగంలో పెడుతున్న పెట్టుబడులను ముందు జాగ్రత్తగా తగ్గించుకుంటున్నారు. ఈ నెల మొదటి పక్షం రోజుల్లో (1-15 తేదీల్లో), విదేశీ మదుపుదారుల ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో IT రంగం బరువు తగ్గింది, కోవిడ్ పూర్వ స్థాయి అయిన 10.1 శాతం కంటే దిగువకు పడిపోయింది. NSDL డేటా ఆధారంగా ఈ వివరాలు బయటికొచ్చాయి.
సేల్స్‌లో సగం వాటా
ఈ ఏడాదిలో ఈ నెల 15 వరకు (జనవరి-సెప్టెంబర్ 15 వరకు), ఎఫ్‌పీఐలు అమ్మేసిన ఈక్విటీల విలువ $18 బిలియన్లు కాగా, ఇందులో, IT స్టాక్స్‌ను అమ్మగా వచ్చిన మొత్తమే 10 బిలియన్ డాలర్లు. అంటే, సగానికి పైగా వాటా ఐటీలదే. దీన్ని బట్టి ఐటీ స్టాక్స్‌ను విదేశీయులు ఏ రేంజ్‌లో పగబట్టారో అర్ధం చేసుకోవచ్చు.
సగానికి పైగా విదేశీ ఆదాయం
అమెరికా, యూరప్‌లోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ (BFSI) క్లయింట్ల నుంచి ఇండియన్ IT ఎక్స్‌పోర్ట్ కంపెనీలు సగానికి పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. కాబట్టి, అభివృద్ధి చెందిన మార్కెట్ల్లోని ఒడిదొడుకులకు ఇండియన్ ఐటీ కంపెనీలు నేరుగా ప్రభావితం అవుతాయి. ఆయా సంపన్న మార్కెట్లు వృద్ధి చెందితే మన ఐటీ కంపెనీలకు రెక్కలు వస్తాయి, అక్కడి మార్కెట్లలో మందగమనం కనిపిస్తే మన ఐటీ కంపెనీలు రెక్కలు తెగిన పక్షుల్లా కిందపడతాయి. అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఇప్పుడు అధిక ద్రవ్యోల్బణం, రికార్డ్ స్థాయి వడ్డీ రేట్లు, ఆర్థిక మాద్యం భయాలు ఉన్నాయి కాబట్టి మన ఐటీ కంపెనీలకు ఇది గడ్డుకాలం. విదేశీ ప్రాజెక్టులు తగ్గిపోతాయి. ఇదే పరిస్థితి మరికొన్ని త్రైమాసికాల పాటు కొనసాగే అవకాశం ఉందన్న అంచనాతో ఐటీ స్టాక్స్‌తో ఎఫ్‌పీఐలు తెగదెంపులు చేసుకుంటున్నారు.
అమెరికా GDP వృద్ధిలో భారతీయ ఐటీ రంగానికి 0.56 శాతం సానుకూల సంబంధం ఉంది. ప్రస్తుత త్రైమాసికం నుంచి యుఎస్‌లో మాంద్యం, 2023లో యూరో జోన్ కూడా మందగించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు.
EPS డౌన్ ట్రెండ్
మాంద్యం ముప్పు వల్ల కొన్ని గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలు తమ ఆదాయ అంచనాలను తగ్గించాయి. భారతీయ ఐటీ కంపెనీలకు సంబంధించి, FY24 EPS అంచనాల్లో 10-20 శాతం మేర తగ్గుదల ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
గతేడాది డిసెంబర్‌లో, FPIల పోర్ట్‌ఫోలియోలో ఐటీ ఈక్విటీల విలువ గరిష్టంగా $100 బిలియన్లుగా ఉంది. ఇప్పుడు అది $64 బిలియన్లకు తగ్గింది, 11 శాతం పడిపోయింది.
ఐటీ నుంచి చూపు తిప్పుకున్న విదేశీ మదుపుదారులు ఆటోమొబైల్స్, టెలికాం కంపెనీల స్టాక్‌లపై ఎక్కువ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ రంగాల్లోకి విదేశీ ఇన్ ఫ్లోస్ పెరగడంతో, సెప్టెంబర్ ప్రథమార్థంలో ఈ రంగాల బరువులు (వెయిటేజీ) రికార్డు స్థాయిలో 5.6 శాతం, 2.6 శాతానికి చేరుకున్నాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.