Dalal Street Price: ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు (Stock Markets) వరుసగా పతనం అవుతున్నాయి. ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు పడిపోతాయో అర్థమే కావడం లేదు! సడెన్‌గా లాభపడటం, నిమిషాల్లోనే పతనమవ్వడం ఈ మధ్య అలవాటుగా మారిపోయింది. ఇన్వెస్టర్లలో ఆందోళన పెరగడంతో నెల రోజుల్లోనే రూ.28 లక్షల కోట్ల సంపదను వారు నష్టపోయారని సమాచారం.
భారత స్టాక్ మార్కెట్లు నెల రోజులుగా ఒడుదొడుకుల మధ్య సాగుతున్నాయి. ఎప్పుడు నష్టపోతున్నాయో తెలియడమే లేదు. వరుస నష్టాలతో ఇన్వెస్టర్లు నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.28 లక్షల కోట్ల సంపదను నష్టపోయారు. మంగళవారం రూ.248.42 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్‌ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ (BSE M Cap) బుధవారం నాటి పతనంతో రూ.246.46 లక్షల కోట్లకు చేరుకుంది. దాంతో ఏప్రిల్ 11న రూ.275.11 లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్ విలువ రూ.28 లక్షల కోట్ల వరకు క్షీణించింది.
మార్కెట్ల నష్టాలకు చాలా కారణాలు ఉన్నాయి. ఇన్వెస్టర్లు చాన్నాళ్లుగా ఆచితూచి పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. సీపీఐ, ఐఐసీ డేటా కోసం ఎదురు చూస్తున్నారు. ద్రవ్యోల్బణం పరిస్థితిని అంచనా వేయాలని అనుకుంటున్నారు. అంతర్జాతీయంగానూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. అమెరికా సీపీఐ (US CPI Data) ద్రవ్యోల్బణం డేటా కోసం చూస్తున్నారు. దాదాపుగా 38 ఏళ్ల గరిష్ఠ స్థాయికి అక్కడ ద్రవ్యోల్బణం చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత్‌లో 7-8 శాతం వరకు ఇన్‌ఫ్లేషన్ ఉంటుందని అంచనా.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం (Russia Ukrain war) ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. దాంతో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. పొద్దుతిరుగుడు, పామాయిల్ రేట్లు కొండెక్కనున్నాయి. ఇక క్రూడ్ ఆయిల్ పరిస్థితీ అలాగే ఉంది. ముడి చమురు సరఫరా కొరతతో ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుంది. పైగా యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లు పెంచుతుండటంతో ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులు వెనక్కి తీసుకుంటున్నారు. అమెరికా బాండ్లలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారు. ఇవన్నీ నష్టాలకు కారణం అవుతున్నాయి.
Stock Market Closing Bell: ఇక భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) వరుసగా నాలుగో సెషన్లో నష్టపోయాయి. ఈ వారం సీపీఐ, ఐఐపీ డేటా వస్తుండటంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. అంతర్జాతీయంగా మార్కెట్లలో అస్థిరత్వం చోటు చేసుకోవడం, ద్రవ్యోల్బణం భయాలు, ఎకానమీ మందగమనంలో ఉండటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,167 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 276 పాయింట్లు నష్టపోయింది.