Ambuja Cements Shares: అంబుజా సిమెంట్స్‌లో రూ.20,000 కోట్ల అదనపు పెట్టుబడి పెట్టాలని అదానీ గ్రూప్ (Adani Group) నిర్ణయించిన నేపథ్యంలో, ఇవాళ్టి (సోమవారం) ఇంట్రా డే ట్రేడింగ్‌లో అంబుజా సిమెంట్స్ షేర్లలో జోష్ కనిపించింది. ఈ స్టాక్ 10 శాతం ర్యాలీ చేసి, BSEలో రూ.572 వద్ద కొత్త గరిష్ట స్థాయిని చేరుకుంది. శుక్రవారం నాటి గరిష్ట స్థాయి రూ.550.15ని ఇవాళ్టి ట్రేడ్‌లో అధిగమించింది.
హర్మోనియా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు (Harmonia Trade and Investment - ప్రమోటర్ ఎంటిటీ) ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన, రూ.419 ధరతో 477.5 మిలియన్ కన్వర్టిబుల్ వారెంట్లను ప్రాధాన్యత ప్రాతిపదికన కేటాయించాలని అంబుజా సిమెంట్స్ కొత్త బోర్డు ఈ నెల 15 నాటి సమావేశంలో ఆమోదించింది. తద్వారా కంపెనీలోకి కొత్తగా రూ.20,000 కోట్లను తీసుకురావాలని భావించింది. ఈ వారెంట్లను 18 నెలల్లోగా ఈక్విటీ షేర్లుగా మార్చుకోవచ్చు.
పెరగనున్న ప్రమోటర్ వాటా
ఈ వారెంట్లను ఈక్విటీ షేర్లుగా మార్చిన తర్వాత, ప్రమోటర్ల వాటా ప్రస్తుతమున్న 63.2 శాతం నుంచి ప్రస్తుతం 70.3 శాతానికి పెరుగుతుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది.
అంబుజా సిమెంట్స్ బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు గౌతమ్ అదానీ స్వీకరించగా, ఆయన పెద్ద కుమారుడు కరణ్ అదానీ, ACC ఛైర్మన్ & నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. అంబుజా సిమెంట్స్‌లోనూ కరణ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటారు.
పంచవర్ష ప్రణాళిక
వచ్చే ఐదేళ్లలో, అదానీ గ్రూప్ సిమెంట్ సామర్థ్యాన్ని రెట్టింపు చేసి, 2030 నాటికి అతి పెద్ద & అత్యంత సమర్థవంతమైన సిమెంట్ కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొత్త ప్రమోటర్లు (అదానీలు) స్పష్టం చేశారు.
అంబుజా సిమెంట్స్ స్టాక్ గత మూడు వారాల్లోనే దాదాపు 29 శాతం ర్యాలీ చేసింది. గత నెల రోజుల్లో 35 శాతం లాభపడింది, గత ఆరు నెలల్లోనే 89 శాతం పెరిగింది. అదానీ గ్రూప్ చేతికి వచ్చిన తర్వాతే ఈ విధంగా పరుగులు తీస్తోంది. అదానీ గ్రూప్ ద్వారా కొనుగోలు లావాదేవీలు పూర్తయిన తర్వాత, పరుగులు వేగం మరింత పెరిగింది.
స్టాక్ టెక్నికల్ వ్యూ
సెంటిమెంట్: పాజిటివ్
సపోర్ట్: రూ.552; ఆ తర్వాత రూ.510
రెసిస్టెన్స్: రూ.578; ఆ తర్వాత రూ.622
వీక్లీ ఛార్ట్‌లో, గత మూడు వారాలుగా బొలింజర్ బ్యాండ్ హైయ్యర్ ఎండ్ పైనే ఈ స్టాక్ కదులుతోంది. ట్రెండ్ ఫుల్ పాజిటివ్‌గా ఉంది కాబట్టి, షేరు ధర కొత్త శిఖరాలను వెదుక్కుంటూ వెళ్లవచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.