Multibagger Stock: స్టాక్‌ మార్కెట్‌ ఎంత ప్రతికూలంగా పని చేసినా కొన్ని షేర్లు మాత్రం మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌ ఇస్తూనే ఉంటాయి, పెట్టుబడిదార్ల డబ్బును రెట్టింపునకు పైగా పెంచుతాయి. ఈ మల్టీబ్యాగర్లలో పేరుమోసిన కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు అన్నీ ఉంటాయి. వీటిలో, కొన్ని చిన్న స్టాక్స్‌ రాబడుల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.


కస్టమర్ల జాబితాలో అతి పెద్ద పేర్లు
గత 10 సంవత్సరాల్లో, పెట్టుబడిదార్లకు సాటిలేని రాబడిని అందించిన స్టాక్ యునో మిండా లిమిటెడ్‌ (UNO Minda Ltd). దీని గురించి చాలామంది వినే అవకాశం లేదు. కానీ, ఈ కంపెనీ కస్టమర్ల పేర్లను మాత్రం మీరు వినే ఉంటారు. BMW, ఫోర్డ్‌, నిస్సాన్‌, కవాసాకి వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు యునో మిండా లిమిటెడ్‌కు కస్టమర్‌ కంపెనీలు.


ఈ కంపెనీ.. ప్రొప్రైటర్ ఆటోమోటివ్ సొల్యూషన్స్‌లో టైర్-1 సరఫరాదారు. BMW, ఫోర్డ్‌, నిస్సాన్‌, కవాసాకి వంటి ప్రపంచ స్థాయి కార్ కంపెనీలు ఈ దేశీయ కంపెనీ నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేస్తాయి. విపరీతమైన రాబడిని ఇవ్వగల ఈ స్టాక్‌ సామర్థ్యం బడా ఇన్వెస్టర్లకు బాగా నచ్చింది. ఇందులో మ్యూచువల్ ఫండ్స్‌కు 15.69 శాతం, విదేశీ ఇన్వెస్టర్లు 6.23 శాతం వాటా ఉంది.


ఇది కూడా చదవండి: Stock Market Opening: 62వేల పైనే సెన్సెక్స్‌ - ఆల్‌టైమ్‌ హై రికార్డు బ్రేక్‌ చేస్తుందా? 


కంపెనీ మార్కెట్‌ విలువ
కంపెనీ షేర్‌హోల్డింగ్ సరళిని పరిశీలిస్తే, ప్రమోటర్ల వద్ద గరిష్టంగా 70.06 శాతం వాటా ఉంది. మిగిలిన 29.94 శాతం (దాదాపు 30 శాతం) పబ్లిక్ ఇన్వెస్టర్ల చేతిలో ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ కంపెనీలో దాదాపు 5.2 శాతం షేర్లు ఉన్నాయి. ఈ కంపెనీ BSE 200లో ఒక భాగం. అంటే, మార్కెట్ విలువ పరంగా, BSEలో లిస్ట్‌ అయిన టాప్-200 కంపెనీలలో ఇది ఒకటి. కంపెనీ ప్రస్తుత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 32,363 కోట్లు.


సిసలైన మల్టీబ్యాగర్ స్టాక్‌
కంపెనీ షేర్ల గురించి చెప్పాలంటే, గత దశాబ్ద కాలంలో ఈ షేర్‌ ధరలు సుమారు 8 వేల శాతం పైగా పెరిగాయి. ఒక ఇన్వెస్టర్, 10 సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌లో కేవలం రూ. 10,000 మాత్రమే ఇన్వెస్ట్ చేసి ఉంటే, అప్పుడు అతని పెట్టుబడి విలువ రూ. 8 లక్షలకు చేరి ఉండేది. గత 5 సంవత్సరాల్లో ఈ షేరు ధర 1,200 శాతం పెరిగింది. అదేవిధంగా, గత 3 సంవత్సరాలలో దీని ధర సుమారు 611 శాతం పెరిగింది.


ఇది కూడా చదవండి: Ex-Dividend Stocks: ఈ వారంలో ఎక్స్‌-డివిడెండ్‌ స్టాక్స్‌ - డబ్బులు సంపాదించవచ్చు! 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.