Vitamin B12:పోషకాహార లోపం అనేది కేవలం పిల్లల్లోనే కాదు పెద్దల్లో కూడా వస్తుంది. ఎక్కువగా పెద్దల్లో విటమిన్ B12 లోపించే అవకాశం ఉంది. ఇది లోపించినప్పుడు శరీరానికి కోలుకోలేని నష్టం జరుగుతుంది. కాబట్టి విటమిన్ బి12 లోపం ఉందని తెలియగానే ఆ విటమిన్ కలిగిన ఆహారాలను తీసుకోవడం ఉత్తమం.  ఒకవేళ విటమిన్ బి12 లోపం ఉన్నప్పటికీ దానికి తగ్గ ఆహారం, సప్లిమెంట్లు తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ లోపం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చు.


1. విటమిన్ బి12 లోపం దీర్ఘకాలంగా కొనసాగితే జ్ఞాపకశక్తి కోల్పోతారు. మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాళ్లలో జలదిరింపులు కూడా వస్తాయి.


2. నడక స్థిరంగా ఉండదు. సమన్వయంతో కాళ్లు పనిచేయలేవు. దీన్ని అటాక్సియా అంటారు. విటమిన్ బి12 లోపం వల్ల అటాక్సియా వచ్చే అవకాశం ఉంది. దీన్ని ‘సెన్సరీ అటాక్సియా’ అని కూడా అంటారు. 


3. విటమిన్ బి12 లోపం వల్ల రోగనిరోధక వ్యవస్థ మరింతగా క్షీణిస్తుంది. పొట్టలోని ఆరోగ్య కణాలపై రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తుంది. దీని వల్ల పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. 


4. ఈ లోపం వల్ల నరాలు దెబ్బతింటాయి. కంటిలోని ఆప్టిక్ నరం దెబ్బ తినే అవకాశం ఉంది. దీనివల్ల దృష్టి కోల్పోవచ్చు.


5. విటమిన్ బి12 లోపిస్తే ముఖ్యంగా కనిపించే లక్షణం తీవ్ర అలసట. శరీరంలో ఆక్సిజన్ తీసుకెళ్లడానికి ఎర్ర రక్తకణాలు సరిపడా లేనప్పుడు ఇలా తీవ్రంగా అలసిపోయి బలహీనంగా మారతారు.


6. తలనొప్పి తరచూ వస్తూ ఉంటే అది విటమిన్ బి12వ లోపం వల్లేమో అని చెక్ చేయించుకోవాలి


7. విరేచనాలు, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు విటమిన్ బి12 లోపం వల్లే వస్తాయి. వీటికి చికిత్స అందించాల్సిన అవసరం ఉంది.


ఏం తినాలి?
వైద్యులు టెస్టుల ద్వారా విటమిన్ బి12 ఎంత మేరకు ఉందో చెక్ చేస్తారు. మరీ తక్కువగా ఉంటే సప్లిమెంట్లను రాస్తారు. ఎలాంటి ఆహారాన్ని తినాలో సూచిస్తారు. విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని రోజూ తినడం వల్ల ఈ లోపం తీరుస్తుంది. చేపలు అధికంగా తినడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా సార్టినెస్, టూనా, సాల్మన్ వంటి చేపలు తినాలి. లేత మాంసాన్ని తినాలి. రొయ్యలు, మటన్, చికెన్ వంటివి తింటూ ఉండాలి. రోజుకో గుడ్డు మెనూలో ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు,పనీర్ వంటివి తింటూ ఉండాలి. తృణధాన్యాలు కచ్చితంగా రోజువారీ ఆహారంలో ఉండాలి. పాలకూర వంటి ఆకుకూరలు కచ్చితంగా తినాలి. పుట్టగొడుగులు, బీట్ రూట్, బంగాళాదుంపలు వంటివి రోజు వారీ మెనూలో చేర్చుకోవాలి. 



Also read: జాగ్రత్త, నెయిల్ పాలిష్ వల్ల ప్రాణాంతకమైన అలెర్జీ - కదలికలు కోల్పోయిన చేతి వేళ్ళు













గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.