Decathlon: భారత బిలియనీర్ ముఖేష్ అంబానీ భారతదేశంలోని తన వ్యాపార సామ్రాజ్యాన్ని రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే ఉన్న అనేక వ్యాపారాలతో పాటుగా కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెడుతోంది. తనదైన శైలిలో కస్టమర్లను ఆకర్షించటంలో అంబానీకి మించిన వ్యాపారవేత్త ఉండరని మనందరికీ తెలిసిందే.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ముఖేష్-ఇషా అంబానీల నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ ఫ్రెంచ్ రిటైలర్ డెకాథ్లాన్ వ్యాపారంపై టార్గెట్ చేస్తోంది. కరోనా తర్వాత దేశంలో పెరుగుతున్న అథ్లెయిజర్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని అంబానీ కొత్త స్పోర్ట్స్ ఫార్మాట్‌తో భారతీయ మార్కెట్లోని వినియోగదారులను టార్గెట్ చేసేందుకు సిద్ధమౌతోందని తెలుస్తోంది. తమ స్పోర్ట్స్ బ్రాండ్ పేరును రిలయన్స్ ఇప్పటికే ప్రకటించనప్పటికీ.. అనేక అగ్ర నగరాల్లోని వ్యాపార ప్రదేశాల్లో 8,000-10,000 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంటోంది.
అంబానీ సంస్థ ఫ్రెంచ్ బ్రాండ్ డెకాథ్లాన్ విజయవంతమైన మోడల్‌ను అనుకరించాలనుకుంటుందని తెలుస్తోంది. వాస్తవానికి ఈ బ్రాండ్ 2009లో ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలో 2023 ఆర్ఖిక సంవత్సరంలో కంపెనీ భారత విక్రయాలు భారీగా పెరిగి రూ.3,955 కోట్లకు చేరుకున్నాయి. దీనికి తోడు పేరుగాంటిన మరికొన్ని స్పోర్ట్స్ బ్రాండ్స్ పూమా, అడిడాస్, స్కెచర్స్, యాసిక్స్ సైతం కొవిడ్ తర్వాత పెరిగిన వ్యాపారాన్ని చూస్తున్నాయి. ఈ కంపెనీలు 2023 ఆర్థిక సంవత్సరంలో వ్యాపారం 100 శాతం వృద్ధితో సంయుక్తంగా రూ.11,617 కోట్ల మేర విక్రయాలను నమోదు చేశాయి.
మార్చిలో ఇండియాలో జరిగిన సమావేశంలో పాల్గొన్న డెకాథ్లాన్ చీఫ్ రిటైల్ అండ్ కంట్రీస్ ఆఫీసర్ స్టీవ్ డైక్స్ తమకు భారత్ ప్రాధాన్యత మార్కెట్లలో ఒకటని చెప్పారు. కంపెనీకి ఇది ప్రపంచవ్యాప్తంగా టాప్-5 మార్కెట్లలో ఒకటని పేర్కొన్నారు. డెకాథ్లాన్ స్థానిక ప్రాధాన్యతలకు అనుగుణంగా పరిమాణంలో మారుతూ సంవత్సరానికి 10 దుకాణాలను ప్రారంభించే స్థిరమైన వేగాన్ని కొనసాగించాలని యోచిస్తోందని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో ప్రతినగరం ప్రత్యేకంగా ఉంటుందని అందువల్ల తాము అక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆఫర్లను రూపొందిస్తున్నట్లు డైక్స్ వివరించారు.
భారతదేశంలో తన డిజిటల్ పాదముద్రను బలోపేతం చేయడానికి డెకాథ్లాన్ తన ఆన్‌లైన్ వ్యాపారాన్ని సైతం వేగంగా విస్తరిస్తోంది. కంపెనీ వ్యూహంలో పెద్ద అవుట్‌లెట్‌లకు మద్దతు ఇచ్చే చిన్న శాటిలైట్ స్టోర్‌లు ఉన్నాయి. రాబోయే వారాల్లో రిలయన్స్ రిటైల్ చైనీస్ ఫాస్ట్-ఫ్యాషన్ లేబుల్ షీన్‌ను కూడా దేశానికి తీసుకువస్తున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. షీన్ అనేది ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాల్లో వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో చైనీస్ యాప్‌లపై అణిచివేత మధ్య 2020లో భారతదేశంలో నిషేధించబడింది. నాలుగేళ్ల విరామం తర్వాత షీన్ భారత మార్కెట్‌లోకి తిరిగి వచ్చినట్లే.