Mukesh Ambani: మెస్సీని ఆదర్శంగా తీసుకుందాం, మర్రిచెట్టులా విస్తరిద్దాం అంటూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్‌ అంబానీ తన తర్వాతి తరానికి దిశానిర్దేశం చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ‍‌(Reliance Industries) వ్యవస్థాపకుడు, ముకేష్‌ తండ్రి ధీరూభాయ్ అంబానీ (Dhirubhai Ambani) జయంతి సందర్భంగా నిర్వహించిన 'రిలయన్స్ ఫ్యామిలీ డే'లో ‍‌(Reliance Family Day 2022) ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ముగ్గురు వారసులకు లక్ష్యాలను నిర్దేశించారు. 'రిలయన్స్ ఫ్యామిలీ డే'ని ఏటా నిర్వహించి, కంపెనీకి సంబంధించిన అతి ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. 


2021లో నిర్వహించిన ఫ్యామిలీ డే కార్యక్రమంలో.. రిలయన్స్‌ గ్రూప్‌లోని 3 వ్యాపార విభాగాలను తన ముగ్గురు పిల్లలకు (ఆకాశ్‌, ఈశా, అనంత్‌) ముకేశ్‌ అప్పజెప్పారు. టెలికాం, డిజిటల్‌ వ్యాపారాల బాధ్యతలను ఆకాశ్‌ అంబానీ ‍‌(Akash Ambani) భుజాల మీద పెట్టారు. రిటైల్‌ వ్యాపారాన్ని పెంచే అవకాశాన్ని ఈషా అంబానీకి ‍‌(Isha Ambani) ఇచ్చారు. న్యూ ఎనర్జీ బిజినెస్‌ను అనంత్‌ అంబానీకి ‍‌(‍‌Ananth Ambani) అప్పగించారు.


రిలయన్స్ ఫ్యామిలీ డేలో ముకేష్‌ అంబానీ ప్రసంగం ఆయన మాటల్లోనే..


సంవత్సరాలు, దశాబ్దాలు గడిచిపోతూనే ఉంటాయి. రిలయన్స్ మరింత విస్తృతంగా ఎదుగుతుంది. మర్రిచెట్టులా, దాని కొమ్మలు చాలా దూరం వ్యాపించి, దాని మూలాలు లోతుగా వెళ్లి భారతీయుల జీవితాలను సృజిస్తూనే ఉంటుంది. వారిని సుసంపన్నం చేస్తుంది, వారికి శక్తిని ఇస్తుంది, వారిని పెంచి పోషించి, సంరక్షణ అందిస్తుంది. 


2022 సంవత్సరం చివరి నాటికి, రిలయన్స్ తన స్వర్ణ దశాబ్దంలో సగం దూరాన్ని కవర్ చేసింది. ఇప్పటి నుంచి 5 సంవత్సరాల తరువాత, రిలయన్స్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా, రిలయన్స్‌ సాధించాల్సిన లక్ష్యాల గురించి ఉన్నతాధికారులు, ఉద్యోగులకు చెప్పాలనుకుంటున్నాను. 


ఆకాష్ అంబానీకి ఇచ్చిన లక్ష్యం
ఆకాష్ అధ్యక్షతన, భారతదేశం అంతటా ప్రపంచంలోనే అత్యుత్తమ 5G నెట్‌వర్క్‌ను జియో (Jio) ప్రారంభిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా సేవలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 5G సేవలు 2023 లో పూర్తిగా అమలులోకి వస్తాయి.  భారతదేశ భవిష్యత్‌ అవకాశాలను అందుకోవడానికి కోసం జియో ప్లాట్‌ఫామ్స్‌ సిద్ధంగా ఉండాలి. దేశీయ & అంతర్జాతీయ మార్కెట్లకు ప్రత్యేకమైన డిజిటల్ ఉత్పత్తులు, పరిష్కారాలను అందించడమే ఈ అవకాశాలు. ప్రతి గ్రామానికి 5G కనెక్టివిటీ అందించాలి. ఫలితంగా, నగరాలు - గ్రామాల మధ్య అంతరాన్ని పూర్తిగా తొలగించే చారిత్రాత్మక అవకాశం భారతదేశానికి అందుతుంది. తద్వారా, దేశ అభివృద్ధిలో జియో భాగం కావాలి.


ఈషా అంబానీకి ఇచ్చిన లక్ష్యం
ఇషా నాయకత్వంలో రిటైల్ వ్యాపారం అన్ని రకాల ఉత్పత్తుల్లో, భారతదేశంలో చాలా విస్తృతంగా, లోతుగా చొచ్చుకుపోతోంది. మరికొన్ని లక్ష్యాలను సాధించే సత్తా రిటైల్‌ బృందానికి ఉందని నమ్ముతున్నాను. జియో లాగే రిటైల్‌ వ్యాపార అభివృద్ధి వల్ల కూడా దేశ వృద్ధిపై ప్రభావం కనిపించాలి. కొత్త ఉద్యోగాలు రావాలి. రైతులకు మరింత ఆదాయం అందాలి. 


అనంత్‌ అంబానీకి ఇచ్చిన లక్ష్యం
రిలయన్స్ తాజా స్టార్టప్ వ్యాపారం పునరుత్పాదక ఇంధనం. కంపెనీని లేదా దేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యం దీనికి ఉంది. జామ్‌నగర్‌లోని మా గిగా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేశాము. దేశంలోనే అతి పెద్ద, అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పూర్తి పర్యావరణహిత కంపెనీగా మారాలి. న్యూ ఎనర్జీ గ్రూప్‌ లక్ష్యం ఇదే. ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని, భద్రత సాధించాలంటే దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించాలి. గుర్తుంచుకోండి, మీరు ముస్తాద్, సాంకేతికత రంగంలో ముందుండడం ద్వారా మాత్రమే ఈ లక్ష్యాన్ని చేరుకోగలరు.


ధీరూభాయ్‌ - మెస్సీ - వివేకానందుడు
ప్రపంచ ఫుట్‌బాల్‌ కప్‌ని అర్జెంటీనా ఎలా గెలుచుకుంది? ఇది నాయకత్వం జట్టు కృషి కలయిక. మెస్సీ (Messi) సొంతంగా కప్‌ గెలవలేదు. అదేవిధంగా మెస్సీ స్ఫూర్తిదాయకమైన నాయకత్వం లేకుండా అర్జెంటీనా విజయం సాధించలేదు. ధీరూభాయ్‌ అంబానీ కూడా ఇదే తరహాలో రిలయన్స్‌ను నిర్మించారు. ఆయనతో పాటు స్వామి వివేకానంద ఆలోచనలూ నాలో స్ఫూర్తిని నింపాయి.