భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్, పెళ్ళి (Prabhas Marriage) కాని కథానాయకుల లిస్టు తీస్తే... అందులో బాహుబలి ప్రభాస్ పేరు ముందు వరుసలో ఉంటుంది. సల్మాన్ ఖాన్‌కు కూడా పెళ్ళి కాలేదు. అయితే, ఇప్పుడు ఆయన పెళ్ళి కంటే ప్రభాస్ పెళ్ళి గురించి ఎక్కువ మంది ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అసలు, పెళ్ళి చేసుకునే ఉద్దేశం ప్రభాస్ మదిలో ఉందా? లేదా?


పెళ్ళి ప్రస్తావనతో ప్రారంభించిన బాలకృష్ణ
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న, 'ఆహా' ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ అవుతున్న 'అన్‌స్టాపబుల్‌ 2'కు ప్రభాస్ వచ్చిన సంగతి తెలిసిందే. షో స్టార్టింగే బాలకృష్ణ పెళ్ళి ప్రస్తావన తీసుకు వచ్చారు. ఇంట్రడక్షన్ అయిన తర్వాత పెళ్ళి టాపిక్ తీశారు. అందుకు ప్రభాస్ డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చారు. 


పెళ్ళి చేసుకుంటాను కానీ... 
'ఏంటి... పెళ్ళి ఉందా? లేదా?' అని బాలకృష్ణ డైరెక్టుగా అడిగారు. 'ఏమో సార్! ఇంకా తెలియదు' అని ప్రభాస్ చెప్పారు. అక్కడితో బాలయ్య ఆగలేదు. 'ఒంటరిగా ఫిక్స్ అయ్యావా?' అని మళ్ళీ అడిగారు. 'లేదు సార్! పెళ్ళి చేసుకుంటాను సార్! ఇంకా రాసి పెట్టి లేదేమో!?' అని ప్రభాస్ చెప్పారు. 


'మీ అమ్మకు చెప్పిన కబుర్లు చెప్పకు' అంటూ ప్రభాస్ మదిలో పెళ్ళి గురించి ఏం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు బాలకృష్ణ. ఏ తల్లికి అయినా కొడుకు ఓ ఇంటి వాడు కావాలని, ఇంటికి ఓ కోడలు రావాలని, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారని బాలయ్య చెప్పారు. తన సిస్టర్ ఇంటి దగ్గర ఉంటుందని, వదిన పక్కనే ఉంటారని, అలా మేనేజ్ చేస్తున్నానని ప్రభాస్ చెప్పుకొచ్చారు. 


''మన చేతుల్లో ఏముంటుంది? రాసి పెట్టి ఉండాలి. మీకు తెలుసు కదా!'' అంటూ... ఇంకా పెళ్ళి  జరగకపోవడానికి కారణం తాను కాదన్నట్టు ప్రభాస్ చెప్పుకొచ్చారు. ఆ విషయంలో బాలకృష్ణ ఏకీభవించలేదు. ''మన చేతుల్లోనే ఉందయ్యా బాబు! తాళి కట్టేది మనమే. మూడు ముళ్ళు చేతులతో వేయాలి'' అని బాలయ్య చెప్పారు. లేదంటే పురోహితుడు కడతాడా? ఏంటి? అంటూ చమత్కరించారు. 


'ఏ ధైర్యంతో ఒంటరిగా మిగిలిపోవాలని ఫిక్స్ అయ్యావ్' అని బాలకృష్ణ అడిగితే... ''నేను ఫిక్స్ అవ్వలేదు సార్'' అని ప్రభాస్ చెప్పారు. 'మరి, అందరికీ చేసుకుంటా! చేసుకుంటానని చెబుతున్నావ్. క్లారిటీ ఇవ్వడం లేదు' అని మళ్ళీ అడిగితే... ''అవ్వుద్ది సార్! నాకూ క్లారిటీ లేదు సార్'' అని ప్రభాస్ చెప్పారు. 


నేను సల్మాన్ పేరు చెప్పాలేమో!
'అన్‌స్టాపబుల్‌ 2'కు శర్వానంద్, అడివి శేష్ వచ్చారు. అప్పుడు పెళ్ళి ఎప్పుడు అని బాలకృష్ణ అడిగితే... శర్వా తర్వాత అని శేష్ చెప్పారు. ''నేను ప్రభాస్ పేరు చెబుతున్నా. నువ్వు నా పేరు చెప్పు'' అని శర్వా అన్నారు. ఆ విషయం ప్రభాస్ తో చెబితే ''నేను సల్మాన్ ఖాన్ పేరు చెప్పాలేమో'' అని సరదాగా అన్నారు. 


Also Read : అన్‌స్టాపబుల్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు - వాటిని వెంటనే తొలగించాలని ఆదేశాలు!


బాలకృష్ణ, ప్రభాస్ మధ్య సంభాషణ చాలా సరదాగా సాగింది. ''ఏది ఏమైనా మీరు అదృష్టవంతులు'' అని బాలకృష్ణ అనడంతో అందరూ నవ్వేశారు. గురువారం రాత్రి తొమ్మిది గంటలకు ప్రభాస్ అతిథిగా వచ్చిన 'ద బాహుబలి ఎపిసోడ్' పార్ట్ వన్ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే, ఎక్కువ మంది ఆహా ఓపెన్ చేయడంతో... యాప్ క్రాష్ అయ్యింది. చాలా సేపు పని చేయలేదు. దాంతో ప్రేక్షకులకు ఆహా సారీ చెప్పింది. ఇప్పుడు ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. 


Also Read : RRR మూవీపై ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటి షాకింగ్ కామెంట్స్ - తూచ్, అంటూ భలే కవర్ చేసింది